- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సేవాగుణంలో ధనవంతులుగా యంగ్ డాక్టర్స్.. 16 నెలల్లో 5 వేల మందికి..
వైద్యం పై సరైన అవగాహన లేకుండా గందరగోళానికి గురయ్యే వారి కోసం అండగా నిలబడ్డారు. వచ్చిన రోగానికి ఎక్కడ మెరుగైన చికిత్స దొరుకుతుందని తెలియక సతమతమయ్యే వారికి దారి చూపించేందుకు నలుగురు ఓ ఆలోచనతో కలిసారు.

దిశ, సిటీక్రైం : వైద్యం పై సరైన అవగాహన లేకుండా గందరగోళానికి గురయ్యే వారి కోసం అండగా నిలబడ్డారు. వచ్చిన రోగానికి ఎక్కడ మెరుగైన చికిత్స దొరుకుతుందని తెలియక సతమతమయ్యే వారికి దారి చూపించేందుకు నలుగురు ఓ ఆలోచనతో కలిసారు. అమ్మో మా రోగానికి సర్జరీలు జరగాలంటే లక్షలాది డబ్బులను ధారపోయిల్సిందేనన్న భావన నుంచి చాలా మంది పేదలను బయటపడేసి వారికి నయమయ్యేలా చేసి వారికి సంపూర్ణ ఆరోగ్యవంతమైన భవిష్యత్తును అందిస్తున్నారు. ఇలా నలుగురు యువ డాక్టర్ లు కలిసి ఏర్పాటు చేసిన డాక్టర్ నెట్ సర్వీసెస్ తో అందుతున్న సేవలతో వీరు సేవా గుణంలో ధనవంతులుగా ముద్ర వేసుకుంటున్నారు.
నలుగురిది ఒకే ఆలోచన
హైదరాబాద్ కు చెందిన ధన రాచమల్లా(ఎంబీబీఎస్), రమణారెడ్డి(ఎంబీబీఎస్), నటేష్ కొలుసు(ఆర్థోపెడిక్), ధీరజ్ కుమార్(ఈఎన్ టీ) వారి విభాగాల్లో వైద్య సేవలను అందిస్తున్నారు. ఇలా వీరంతా వివిధ ఆసుపత్రుల్లో పని చేస్తున్నారు. అయితే 2023 సంవత్సరం డిసెంబరులో ఈ నలుగురికి ఓ సంఘటనతో ఓ ఆలోచన మెలిగింది. ఆలోచనకు మెరుగు పట్టి మారుమూల గ్రామాలు, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించే డాక్టర్ ల సమాచారం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అదే విధంగా తెలిసి తెలియక సామాన్యులు ఆర్ధికంగా నష్టపోకుండా , అనారోగ్యాన్ని నయం చేసే విధంగా దారి చూపించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నారు.
5 వేల మంది సంప్రదించారు
డాక్టర్ నెట్ సర్వీసెస్ ను ప్రారంభించిన దాదాపు 16 నెలలోనే 5 వేల మంది వీరిని సంప్రదించి మెరుగైన వైద్య సేవల కోసం సలహాలను తీసుకున్నారు. ఇలా తీసుకున్న వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇప్పుడు జీవనం సాగిస్తున్నారు. ఆపద సమయంలో వైద్య సలహాలు తీసుకున్న వారిలో 10 ఓపెన్ హార్ట్ సర్జరీలు, 70 ఆర్ధోసర్జరీలు, 80 ఈఎన్ టీ సర్జరీలు, కిడ్నీ రోగాలకు సంబంధించిన చికిత్సలు, 12 బ్రేయిన్ సర్జరీలు ఇంకా అనేక రోగాల బారిన పడ్డ వారికి సరైన మార్గాన్ని చూపించి వారికి సకాలంలో వైద్య చికిత్సలు అందేలా చేసి ఈ డాక్టర్ నెట్ సర్వీసెస్ ఓ సంజీవినిలా నిలపడింది. ఈ డాక్టర్ నెట్ సర్వీసెస్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరులో మొత్తం 650 డాక్టర్ లు కనెక్ట్ అయ్యారు.
ఆరు నెలల పాపకు హార్ట్ సర్జరీ
మిర్యాలగూడకు చెందిన అజయ్ క్యాబ్ డ్రైవర్. క్యాబ్ ద్వారా వచ్చే సంపాదనతోనే అతని ఇళ్లు నడుస్తుంది. అతని సంతానమైన ఆరు నెలల పాపకు అరుదైన గుండె కు సంబంధించిన అనారోగ్యం తలెత్తింది. నయం చేసేందుకు అనేక ఆసుపత్రులను సంప్రదించారు. ఆ చికిత్సకు ఎక్కడ ఆరా తీసిన 18 లక్షలు అవుతుందని తెలిసింది. అజయ్ ఓ సందర్భంలో డాక్టర్ నెట్ సర్వీసెస్ నుంచి సంప్రదించారు. ఈ నలుగురు డాక్టర్ లు ఆ పాపకు ఉన్న అనారోగ్యం పై ఆరా తీసి ఈ చికిత్సల్లో నిపుణులైన వైద్యులను సంప్రదించి.
అజయ్ దయనీయ స్థితిని వివరించి ఆ చికిత్సను 5 లక్షల్లో పూర్తయ్యేలా చేశారు. ఆ నగదును కూడా ఫండ్ రేయిజింగ్ ద్వారా సేకరించి అజయ్ బిడ్డను కాపాడారు. ఇలా డాక్టర్ నెట్ సర్వీసెస్ చాలా తక్కువ కాలంలో ఆదరణ పొందుతుంది. సామాన్యులు ఎవరైనా వారికి వచ్చే అనారోగ్యాలపై గందరగోళం, కలవరానికి గురికావాల్సిన అవసరం లేదు. డాక్టర్ నెట్ సర్వీసెస్ ను సంప్రదిస్తే మీకు మెరుగైన వైద్య చికిత్సలు అందేలా ఈ యువ డాక్టర్ లు మీకు అండగా ఉంటారు. డాక్టర్ నెట్ సర్వీసెస్ హెల్స్ లైన్ నెంబర్ల--9000299892, 9908450055, 9177366423 లను సంప్రదిస్తే చాలు మీకు నాణ్యమైన, మెరుగైన వైద్య చికిత్సల సలహాలు, చిట్కాలు దొరుకుతాయని ఈ డాక్టర్ నెట్ సర్వీసెస్ హామి ఇస్తోంది.
అవార్డులు
నలుగురు యువ డాక్టర్ లు చేస్తున్న సేవలను గుర్తించిన పలు స్వచ్ఛంద సంస్థలు, సోషల్ ఆర్గనైజేషన్ ల వారు ఐకానిక్ సేవా, పూర్ణ నంది అవార్డు, ప్రతిభ పురస్కార్, ఎన్టీఆర్ సేవా అవార్డులను అందించాయి.






