- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రెడిట్ కార్డుదారులకు సైబర్ క్రైం జాగ్రత్తలు
మీరు క్రెడిట్ కార్డు కలిగి ఉన్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త..! ఇది మీ కోసమే.. సైబర్ మోసానికి గురికాకుండా జాగ్రత్త పడండి.

దిశ, సిటీక్రైం: మీరు క్రెడిట్ కార్డు కలిగి ఉన్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త..! ఇది మీ కోసమే.. సైబర్ మోసానికి గురికాకుండా జాగ్రత్త పడండి. క్రెడిట్ కార్డు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రోజు రోజుకూ పెరుగుతుండడంతో పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పలు జాగ్రత్తలను సూచిస్తున్నారు. క్రెడిట్ కార్డు మోసాలతో సైబర్ నేరగాళ్లు రూ.లక్షలు దోచుకుంటున్నారని పోలీసులు తెలిపారు. క్రెడిట్ కార్డు వినియోగదారులను అప్రమత్తం చేసేందుకు సైబర్ క్రిమినల్స్ ఉపయోగిస్తున్న నేరప్రక్రియల గురించి అవగాహన కల్పిస్తున్నారు. దీనికి సంబంధించి సైబర్ క్రైం పోలీసులు శనివారం క్రెడిట్ కార్డు వినియోగదారులు ఎలా భద్రంగా ఉండాలో వివరించారు.
ఫిషింగ్ లింక్స్, ఫేక్ మర్చంట్ పేజీలతో టోకరా
క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఫేక్ ఈమెయిల్స్, ఎస్ఎంఎస్, సోషల్ మీడియా ప్రకటనలు వస్తాయి. వీటికి ఫేక్ పేమెంట్ పేజీలను జోడిస్తారు. వీటి ద్వారా చెల్లింపులు చేయడంతో మీ కార్డు వివరాలు, ఓటీపీలు సైబర్ నేరగాళ్లకు చేరుతాయి. సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా వేదికల మీద ఒరిజినల్ బ్యాంక్‌లు, సంస్థలకు సంబంధించినట్లుగా కొన్ని ఫేక్ హెల్ప్‌లైన్ నెంబర్లను పొందుపరుస్తారు. వీటిని ఆశ్రయిస్తే మీ కార్డు వివరాలు సైబర్ మోసగాళ్లకు వెళ్లిపోతాయి.
కార్డు లిమిట్ పెంచుతామని..
సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌లుగా ఫోన్ చేసి కార్డును అప్‌గ్రేడ్ చేస్తామని, కార్డు లిమిట్‌ను పెంచుతామని చెబుతారు. నమ్మిస్తారు కూడా. రిమోట్ యాక్సెస్ యాప్‌లను డౌన్‌లోడ్ చేయిస్తారు. వాటితో కార్డు, బ్యాంక్ ఖాతాల సమాచారాన్ని దోచేస్తారు. ఆ తర్వాత ఖాతాను ఖాళీ చేస్తారు.
క్యాష్ బ్యాక్ ఆఫర్ పేరుతో..
మీ రివార్డు పాయింట్స్‌కు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉందంటూ బురిడీ కొట్టిస్తారు. రివార్డు పాయింట్‌లను వెంటనే నగదులోకి మారుస్తామని ఓటీపీలు, కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలను తీసుకుని కొల్లగొడుతారు.
ఎస్ఎంఎస్‌తో సిమ్ స్వాపింగ్
సైబర్ నేరగాళ్లు ఎస్ఎంఎస్ రూపంలో మెసేజ్‌లు పంపి ‘ఫోన్‌లో ఇలా టైప్ చేయండి..’ అని చెప్పి స్వాపింగ్‌కు పాల్పడుతారు. ఇలా వారు చెప్పినట్లు ఫోన్‌లో టైప్ చేయగానే ఫోన్ మొత్తం వారి కంట్రోల్‌లోకి వెళ్లిపోతుంది.
ఏపీకే ఫైల్స్/ యాప్స్ పంపించి..
సైబర్ చీటర్స్ మిమ్మల్ని ఆశపెట్టి కొన్ని ఏపీకే ఫైల్స్, మాల్‌వేర్ ఉన్న యాప్‌లను డౌన్‌లోడ్ చేయించి వాటన్నింటికి అనుమతులు ఇవ్వాలని కోరుతారు. అలా చేయగానే వివరాలు వారి గుప్పిట్లోకి వెళ్లిపోతాయి.
ఈ నేరప్రక్రియలు బ్యాంక్ వినియోగదారులు గుర్తించి గుర్తు తెలియని వారి నుంచి వచ్చే మెసేజ్‌లు, లింక్‌లు, వాట్సాప్ కాల్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. వాటిని ఒరిజినల్ బ్యాంక్, కంపెనీ వెబ్‌సైట్‌ల ద్వారా ధ్రువీకరించుకోవాలి. ఎవరికీ బ్యాంక్, క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను తెలియజేయాల్సిన అవసరం లేదు. ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.






