సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర రూటే సపరేటు.. కొత్త ఒరవడికి శ్రీకారం

by Web Desk |
సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర రూటే సపరేటు.. కొత్త ఒరవడికి శ్రీకారం
X

దిశ, శేరిలింగంపల్లి: సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మామూలు కేసుల నుండి మొదలు పెద్ద పెద్ద కేసుల వరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏం జరిగినా.. నిందితులను పట్టుకున్నా అందుకు సంబంధించిన వివరాలను సీపీ కార్యాలయంలోనే ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ రవీంద్ర బాధ్యతలు చేపట్టిన తర్వాత వినూత్న రీతిలో ముందుకు వెళుతున్నారు. అందులో భాగంగానే ఇయర్ ఎండ్ ప్రెస్‌మీట్‌లో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సత్యనారాయణను సీపీలు, ఏసీపీలతో పాటుగా తన పక్కనే కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్‌లో తనతో మాట్లాడించారు. తమ విధుల్లో అనుభవాలను ఆయనచేత వివరించారు. అలాగే ప్రతీ ప్రెస్ మీట్ లోనూ ఆయా ఆపరేషన్లలో యాక్టివ్ గా వ్యవహరించిన వారిని ప్రశంసించడం, ప్రోత్సాహకాలు అందించడం చేస్తున్నారు. దీంతో పోలీసు సిబ్బందిలోనూ నూతన ఉత్తేజం కనిపిస్తుంది.

సీపీ ఆఫీసు నుండి పోలీసు స్టేషన్‌కు..

సీపీ స్టీఫెన్ రవీంద్ర మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. మియాపూర్ పోలీసులు సీఐ తిరుపతి రావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సాధారణంగా సీపీ కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రెస్‌మీట్‌ను ఈసారి మియాపూర్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేశారు. గంజాయి స్మగ్లింగ్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఇకపై ఇదే తరహాలో ఆయా పోలీసు స్టేషన్లలో జరిగే ఘటనలకు సంబంధించి స్థానికంగానే ప్రెస్ మీట్‌లు ఏర్పాటు చేస్తారని వెల్లడించారు.

పోలీసుల్లో ఆనందం..

కేసులకు సంబంధించి ఆయా పోలీసు స్టేషన్లలోనే ప్రెస్ మీట్ లు ఏర్పాటు చేయడం పట్ల స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు, ఎస్సైలు, ఇతర సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాలో ముందుకు వెళ్లాలని, తమకు మంచి ప్రోత్సాహం లభిస్తుందని అంటున్నారు.



Next Story