మెట్రో 2.0లో డబుల్ డెక్కర్.. మదీనా గూడలో 1.6 కి. మీ. వరకు ప్లాన్

by Javid Pasha |

మెట్రో 2.0లో డబుల్ డెక్కర్.. మదీనా గూడలో 1.6 కి. మీ. వరకు ప్లాన్

మెట్రో 2.0లో డబుల్ డెక్కర్.. మదీనా గూడలో 1.6 కి. మీ. వరకు ప్లాన్
X

దిశ, సిటీ బ్యూరో : హైదరాబాద్ మహా నగరం విస్తరణతోపాటు రియల్ ఎస్టేట్ బూమ్ పెరగడానికి మెట్రోరైలు ప్రాజెక్టు సైతం సాధనంగా మారింది. రెండో దశ విస్తరణతో నగరానికి రాకపోకలు సులవుగా మారాయి. ట్రాఫిక్ జామ్ ఇబ్బందుల్లేకుండ ప్రయాణాలు సాగిస్తున్నారు. అయితే హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు రెండో దశకు సంబంధించిన డీపీఆర్ లను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. రెండోదశలో డబుల్ డెక్కర్ మెట్రోరైలు నిర్మాణానికి ప్రణాళికలు రూూపొందించారు. మదీనాగుడలో గంగారం దగ్గర 1.6కి.మీ మార్గంలో కింద ఫ్లైఓవర్ పైన మెట్రోరైలు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో చర్చించినట్టు సమాచారం. పారాడైస్ నుంచి డెయిరీఫామ్ వరకు, పరేడ్ గ్రౌండ్ నుంచి శామీర్ పేట్ వరకు ఎలివేటెడ్ కారిడార్లపైనా మెట్రోరైలు నిర్మాణంపై అధ్యయనం మొదట్లో భావించినా..తర్వాత ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రోరైలు ప్రాజెక్టు పనులను వేర్వేరుగా చేపట్టాలని నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే డబుల్ డెక్కర్ తో కొన్ని సాంకేతికపరమైన సమస్యలు ఉన్నా తప్పనిసరిగా పరిస్థితుల్లోనే గంగారం వద్ద కింద ఫ్లైఓవర్, పైనా మెట్రోరైలు వెళ్లే విధంగా చేపట్టనున్నట్టు అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు విప్రో జంక్షన్ టీజీఐఐసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఫ్లైఓవర్ పనుల్లో డబుల్ డెక్కర్ నిర్మాణం చేపట్టాలని భావించారు. దీనిపై చర్చలు జరుగుతున్నాయి.

49.5కి.మీ భారీ కారిడార్

మొదటి దశలో ఎల్బీనగర్-మియాపూర్ కారిడార్ 29కి.మీ ఉంది. మియాపూర్ నుంచి పటాన్ చెరు 13.4కి.మీ, ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1కి.మీ మొత్తం పటాన్ చెరు నుంచి ఎల్బీనగర్ వరకు 49.5కి.మీ అతిపెద్ద కారిడార్ కాబోతుంది. ఈ మార్గంలో సింగిల్ ట్రైన్ నడిపించాలని అధికారుల ప్రతిపాదన ఉంది. నాగోల్ నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ వరకు 36.8కి.మీ మార్గంలో 24 స్టేషన్లను ప్రతిపాదించారు. 4 స్టేషన్లను తగ్గించి హైస్పీడ్ తో రైలును నడిపించాలనే ఆలోచన ఉందని అధికారులు చెబుతున్నారు. కోకాపేట్ నియోపోలీసు దగ్గర 5లక్షల మంది రెగ్యులర్ ప్రయాణిస్తారని అధ్యయనంలో తేలిందని అధికారులు చెబుతున్నారు.

వేర్వేరుగానే డిజైన్లు..

హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్లతోపాటు మేడ్చల్‌, శామీర్‌పేట వరకూ మెట్రోరైలు ప్రాజెక్టును పొడిగించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు నిర్మించాలని భావించారు. అందుకు సంబంధించిన డిజైన్లు కూడా రూపొందించారు. నాగ్ పూర్ తరహాలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు నిర్మిస్తే భూసేకరణతోపాటు ఖర్చు కూడ తగ్గే అవకాశముందని హెచ్ఎండీఏ అధికారులు భావించారు. కానీ నాగ్ పూర్ మోడల్ ఆశించిన స్థాయిలో ఫలితాలివ్వలేదని, హైదరాబాద్ లో ఫీజుబులిటీ కాదని మెట్రోరైలు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ద్రుష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో సాంకేతికపరమైన అంశాల్లో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మెట్రోరైలు అధికారులు చర్చించుకుని నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారని అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ మూడు విభాగాల అధికారులు ఇప్పటికే పలుమార్లు చర్చించారు. ఫలితంగా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు కాకుండా వేర్వేరుగా వెళ్లాలని నిర్ణయించారు. అయితే హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న భూసేకరణలో మాత్రం అటు ఫ్లైఓవర్లు, ఇటు మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మించేందుకుగాను చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఎలివేటెడ్ కారిడార్లలో..

హైదరాబాద్‌–కరీంనగర్‌ మార్గంలో సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి శామీర్‌పేట వరకు వెస్ట్‌ మారేడుపల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్‌, హకీంపేట, తూంకుంట మీదుగా 18.100 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్‌ కారిడార్‌ను ఆరు లేన్లుగా నిర్మించనున్నారు. ఇక జాతీయ రహదారి 44లోని హైదరాబాద్‌–నాగ్‌పూర్‌ మార్గంలో సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్‌ నుంచి సుచిత్ర సమీపంలోని డైరీ ఫామ్‌ రోడ్డు వరకు 5.40 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ను ఆరు లేన్లుగా నిర్మించనున్నారు. అయితే ముందుగా శామీర్‌పేట మార్గంలో 12.1 కిలోమీటర్లు, కండ్లకోయ మార్గంలో సుమారు 4 కిలోమీటర్ల వరకు డబుల్‌ డెక్కర్‌(కింద ఫ్లైఓవర్..ఫైనా మెట్రోరైలు)నిర్మించాలని డిజైన్లు తయారు చేశారు. జాతీయ రహదారి 44లోని హైదరాబాద్‌–నాగ్‌పూర్‌ మార్గంలో సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్‌ నుంచి డైరీ ఫామ్‌ రోడ్డు వరకు 5.40 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ రానుంది. ఈ మార్గంలో జేబీఎస్ నుంచి వచ్చే మెట్రో తాడ్ బండ్ జంక్షన్ నుంచి బోయిని పల్లి జంక్షన్ నుంచి డెయిరీ ఫామ్ వరకు 3.5కి.మీ మార్గంలోనే డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించాలని నిర్ణయించారు. కానీ మారిన పరిస్థితి నేపథ్యంలో హెచ్ఎండీఏ, మెట్రోరైలు ప్రాజెక్టు అధికారులు వేర్వేరుగానే డిజైన్ తయారుచేయడంతోపాటు పనులు చేపట్టనున్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలోనూ

జీహెచ్ఎంసీ పరిధిలోనూ ఫ్లైఓవర్లు, మెట్రోరైలు ప్రాజెక్టులను వేర్వేరుగానే చేపట్టాలని నిర్ణయించారు. అయితే ముందుగా ఐటీ కారిడార్‌లోని విప్రో జంక్షన్‌ వద్ద ఒకే పిల్లర్‌పై ఫైఓవర్‌ను, మెట్రో కారిడార్‌ను నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించారు. ఎల్బీనగర్ నుంచి ఎయిర్ పోర్టు వెళ్లే మెట్రో మార్గంలోనూ టీకేఆర్ కాలేజ్ జంక్షన్ నుంచి మందమల్లమ్మ జంక్షన్ ఆరులేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఈ మార్గంలో డబుల్ డెక్కర్ నిర్మించాలని భావించారు. మైలార్ దేవ్ పల్లి జంక్షన్ నుంచి కాటేదాన్ జంక్షన్ వరకు ఆరులేన్ల గ్రేడ్ సపరేటర్ నిర్మించాలని జీహెచ్ఎంసీ ప్రతిపాదనలు రూపొందించింది. ఇదే మార్గంలోనూ ఎయిర్ పోర్ట్ మెట్రోరైలు పోతుంది. ఇక్కడ సైతం డబుల్ డెక్కర్ కారిడార్ వెళ్లాలని భావించారు. కానీ రెండు ఒకే ఫిల్లర్ పై ఉండడం భద్రత సమస్యలు వచ్చే అవకాశముందని బావించిన అధికారులు వేర్వేరుగానే నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు.

వైబ్రేషన్స్ వస్తాయనే

హెచ్ఎండీఏ నిర్మించనున్న రెండు మార్గాల్లో ఎలివేటెడ్ కారిడార్లలో కింద ప్లైఓవర్, పైన మెట్రోరైలు ఉండేవిధంగా డిజైన్ చేశారు. అయితే రెండు ఒకే ఫిల్లర్ ఉండడంతో వైబ్రేషన్స్ రానున్నాయని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు ఏ చిన్న ప్రమాదం సంభవించిన రెండు రవాణ మార్గాలు దెబ్బతినే అవకాశముందని కూడా నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనూ డబుల్ డెక్కర్ కు ఫీజుబులిటీ కాదని అధికారులు నిర్ణయానికొచ్చినట్టు చెబుతున్నారు.

Next Story