బచావ్ భయ్యా అన్న మహిళా.. మధ్యలో వెళ్లినందుకు ఇరువర్గాల మధ్య ఘర్షణ

by Disha Web Desk 12 |
బచావ్ భయ్యా అన్న మహిళా.. మధ్యలో వెళ్లినందుకు ఇరువర్గాల మధ్య ఘర్షణ
X

దిశ, చార్మినార్ : అర్థరాత్రి పాతబస్తీ‌లో భార్య భర్తల మధ్య తలెత్తిన వివాదం కాస్త ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘటన సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపుతోంది. ఒక వర్గానికి చెందిన వారు మరో వర్గం పై ఇనుప రాడ్‌లు, కట్టెలు, బ్యాట్‌లు, కత్తులతో చేసిన దాడులకు దాదాపు 12 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన వీడియో‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సంతోష్ నగర్ పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ అరుంధతి కాలనికి చెందిన ఎర్రవల్లి నందు (47) ఆదివారం రాత్రి తన కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లో ఉన్నాడు.

నిద్రకు ఉపక్రమించడానికి అపుడే గేట్‌కు తాళం వేసి ఇంట్లోకి వెళ్ళాడు. బయట భార్య భర్తలు గొడవ పడుతున్న శబ్దం రావడంతో గేటు లోపల నుంచే చూడ సాగాడు. మొయిన్ బాగ్ ఈది బజార్‌కు చెందిన షేక్ అమీర్ తన భార్యను కొట్టుకుంటూ తీసుకెళ్తున్నాడు. నందు ఇంటి దగ్గరికి రాగానే గొడవ మరింత పెద్దగా అయ్యింది. ఇంతలోనే అమీర్ భార్య బచావో భయ్యా అంటూ నందు వైపు చూస్తూ కోరింది. గేట్‌కు తాళం తీసి బయటికి వచ్చిన నందు అమీర్‌ను వద్దు అని వారించాడు. నువ్వేంటి నాకు చెప్పేది అని అమీర్ నందును కాలితో తన్ని చితక బాదాడు. మా నాన్నను ఎందుకు కొడుతున్నావ్ అని నందు కుమారులు అడ్డుకోబోయారు. వారి మధ్య పెనుగులాట జరిగింది.

అక్కడి నుంచి వెళ్లిపోయిన అమీర్ కాసేపటికే 50 మందిని పోగు చేసుకొని, ఇనుప రాడ్‌లు, హాకీ బ్యాట్‌లు, కత్తులతో నందు ఇంటిపై అటాక్ చేశారు. నందుతో పాటు నందు భార్య సవిత, అతని ముగ్గురు కుమారులపై విచక్షణ రహితంగా దాడి చేశారు. అంతేగాకుండా అడ్డుకోబోయిన వారితో పాటు కంటికి కనిపించిన వారిపై కూడా దాడులు చేశారు. ఈ ఘటనలో నందు, నందు భార్యతో పాటు ముగ్గురు కుమారులు, మరో 7 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న దక్షిణ మండలం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడిన అరుగురిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఘటన స్థలంలో పోలీస్ పికెట్‌ను ఏర్పాటు చేశారు. నందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతోష్ నగర్ పోలీసులు ఐపీసి 307,324,452,148 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed