పేదల నిమ్స్‌ను కాపాడండి ముఖ్యమంత్రి సారు!?

by Jakkula.Mamatha |

పేదలకు వరమైన నిమ్స్.. ఇప్పుడు వరుస వివాదాలతో నిమ్స్ ఆస్పత్రి ప్రతిష్ట మసకబారుతోంది.

పేదల నిమ్స్‌ను కాపాడండి ముఖ్యమంత్రి సారు!?
X

దిశ, ఖైరతాబాద్ : పేదలకు వరమైన నిమ్స్.. ఇప్పుడు వరుస వివాదాలతో నిమ్స్ ఆస్పత్రి ప్రతిష్ట మసకబారుతోంది. కీలక స్థానాల్లో ఉన్న కొందరు అధికారులు అడ్డూ అదుపు లేకుండా సాగిస్తున్న అక్రమాలతో ఈ హాస్పిటల్ లో వైద్యం నిరుపేదలకు అందని ద్రాక్షగా మారుతోంది. రాజకీయ నేతల పలుకుబడితో నిమ్స్ లో రాజ్యం నడిపిస్తున్న వైద్యులు కొందరు అసలు పని వదిలేసి కొసరు పనికే ప్రాధాన్యత ఇస్తున్నారు. డబ్బు సంపాదించుకోవడమే లక్ష్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బెడ్లు అమ్ముకోవటం.. లక్షలు తీసుకుంటూ కాంట్రాక్ట్ ఉద్యోగాలను భర్తీ చేయడం.. వీరి బాగోతాలు తరచూ వెలుగులోకి వస్తున్నా చర్యలు తీసుకుంటారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.?

దీనికి కారణం కొందరు అధికారులు సొంత ప్రయోజనాల కోసం అక్రమార్కుల కోసం అండగా నిలబడుతుండటమే అని నిమ్స్ వర్గాలే అంటున్నాయి. అయితే, ఇటీవల నిమ్స్ లో నిరాటంకంగా జరుగుతున్న అక్రమాలు వరుసగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై సీరియస్ గా దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. అసలు...నిమ్స్ హాస్పిటల్ లో ఏం జరుగుతుందో? నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో రంగంలోకి దిగిన నిఘా వర్గాలు ఇప్పటివరకు వెలుగు చూసిన అవినీతి బాగోతాలపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలియవచ్చింది. వీటితో నివేదికను తయారు చేసి త్వరలోనే సీఎంకు అందజేయనున్నట్టు సమాచారం. పేదల నిమ్స్ ను కాపాడాలంటూ ముఖ్యమంత్రిని ప్రజలు కోరుతున్నారు..

బెడ్లు అమ్ముకున్నా చర్యలేవి..?

కరోనా సమయంలో నిమ్స్ ఆస్పత్రిలో కొందరు యధేచ్ఛగా బెడ్ల దందా సాగించారు. దీనిపై అప్పట్లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా నమోదయ్యాయి. కరోనా బారిన పడ్డ తన తల్లికి బెడ్ ఇవ్వడానికి లక్ష రూపాయలు తీసుకున్నారని కృష్ణారెడ్డి అనే వ్యక్తి హాస్పిటల్ సూపరిండింటెంట్ కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశాడు. గూగుల్ పే ద్వారా ప్రశాంత్ అనే వ్యక్తికి డబ్బు చెల్లించినట్టు ఆధారాలు కూడా అందచేశారు. క్యాష్ కౌంటర్ లో తనిఖీ చేయగా తాను కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే చెల్లించినట్టుగా ఉందని తెలియచేశాడు. దీనిపై అంతర్గత విచారణ జరపగా ప్రస్తుతం అదనపు సూపరిండింటెంట్ గా ఉన్న డాక్టర్ లక్ష్మీ భాస్కర్ చెప్పిన మేరకే కృష్ణారెడ్డి తల్లికి బెడ్ కేటాయించినట్టు సిబ్బంది తెలిపారు. దీనిపై సూపరిండింటెంట్ ఫిర్యాదు చేయగా పంజాగుట్ట పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. అయితే, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గాని ఈ కేసును లోక్ అదాలత్ లో రాజీ కుదుర్చుకున్నారు. ఇటు కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు ఎవ్వరినీ అరెస్ట్ చేయకపోవటం...అటు అంతర్గత విచారణ జరిపించిన ఆస్పత్రి ఉన్నతాధికారులు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఆ సమయంలోనే హాస్పిటల్ లో ఏడు వేలకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు దుర్వినియోగమైనట్టు ఆరోపణలు వచ్చాయి. అయినా, ఎవరూ పట్టించుకున్న పాపానికి పోలేదు.

ఇప్పటికీ అదే పరిస్థితి :

ఇప్పటికీ నిమ్స్ హాస్పిటల్ లో ఇదే పరిస్థితి కొనసాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. అస్వస్థతకు గురైన అయిన వారిని ఆస్పత్రిలో చేర్పించేందుకు వస్తున్న వారు కాసులు సమర్పించనిదే మంచం దొరకటం లేదని సమాచారం. కీలక స్థానాల్లో ఉండి నిమ్స్ లో హవా నడిపిస్తున్న కొందరు అధికారులు ప్రైవేట్ వ్యక్తులను ఏజెంట్లుగా పెట్టుకుని ఈ దందా నడుపుతున్నట్టుగా తెలిసింది. ముఖ్యంగా అత్యవసర వైద్య సహాయం అవసరమైన వారి కుటుంబీకులను టార్గెట్ గా చేస్తూ వేలు.. లక్షల్లో డబ్బు వసూలు చేస్తున్నట్టు తెలియవచ్చింది. దీనికి అవినీతికి మరిగిన కొందరు ఆస్పత్రి సిబ్బంది సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా బెడ్ కావాలని అడిగితే ఖాళీలు లేవని ఈ సిబ్బంది చెబుతున్నారు. అక్కడే తచ్చాడుతూ ఉండే ఏజెంట్లు రోగి కుటుంబీకులను పక్కకు తీసుకెళ్లి ఇంత మొత్తం ఇస్తే నిమిషాల్లో బెడ్ ఇప్పిస్తామంటూ బేరం కుదుర్చుకుంటున్నారు. అవతలి వారు డబ్బు ఇవ్వగానే తమ గాడ్ ఫాదర్లుగా ఉన్న కొందరు అధికారులకు పనై పోయిందని చెప్పి మంచాలు ఇప్పిస్తున్నారు.

బాణాసంచా కేసు :

నిమ్స్ ట్రామా కేర్ భవనంలో ఆరోగ్య సిబ్బంది కార్యాలయం పక్కనే ఉన్న గదిలో గతంలో పెద్ద మొత్తంలో బాణాసంచా దొరికింది. అదే అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగినపుడు ఈ విషయం వెలుగు చూసింది. అగ్నికీలలు ఆ గదికి వ్యాపించి ఉంటే బాణాసంచా పేలి ప్రమాద తీవ్రత పెరిగేదని ప్రతి ఒక్కరూ అన్నారు. అదే జరిగి ఉంటే నిమ్స్ ఆస్పత్రిలో ఊహించని విషాదం సంభవించి ఉండేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. దీనిపై కూడా పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే రాత్రికి రాత్రి బాణాసంచా మాయం కావటం. అయితే, ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఓ ఉన్నత స్థాయి అధికారి తన పలుకుబడితో విచారణ ముందకు సాగకుండా అడ్డుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన అంతస్తులో సీసీ కెమెరాలు లేవు...బాణాసంచా ఎవరు తెచ్చారు? ఎవరు తరలించారు? అన్నదానికి ఆధారాలు దొరకలేదు...భవిష్యత్తులో దొరికితే కేసు విచారణ సాగిస్తామంటూ పోలీసులు సంబంధిత కోర్టుకు ఓ నోట్ సమర్పించి కేసును పక్కన పెట్టేయడం గమనార్హం.

కాంట్రాక్టుల్లో సైతం :

ఇక, ఆస్పత్రి ఏ కాంట్రాక్ట్ ను దక్కించుకోవాలన్నా ఇక్కడ లక్షల్లో అనధికార రుసుము చెల్లించాల్సిందే అన్న ఆరోపణలున్నాయి. ఉన్నత స్థాయిలో ఉన్న ఓ వైద్యుని ప్రమేయం లేకుండా ఏ ఒక్క కాంట్రాక్ట్ కూడా ఫైనల్ కాదని .. ఆస్పత్రిలో ఇలా ప్రతీదీ ఆయనే ఫైనల్ చేస్తుంటారు అన్న విమర్శలున్నాయి..చివరకు చిన్న స్టాల్ పెట్టుకోవాలన్నా సదరు అధికారి జేబు తడపాల్సిందే అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి..

లక్షల రూపాయలకు..

ఇక, హాస్పిటల్ లో కాంట్రాక్టు ఉద్యోగాలు అవినీతికి మరిగిన అధికారులకు వరంగా మారాయి. 3 నుంచి 5 లక్షల రూపాయలు తీసుకుంటూ డబ్బు ఇచ్చిన వారిని కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియమిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్కసారి డబ్బు ఇస్తే చాలు.. నెలనెలా వేలల్లో జీతాలు వస్తాయి కదా! అని చెబుతూ అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నట్టు సమాచారం.

కాంట్రాక్టు ఉద్యోగులను అడ్డం పెట్టుకుని..

ఇక, కాంట్రాక్టు ఉద్యోగులను అడ్డం పెట్టుకుని ఓ ఉన్నత అధికారి కోట్ల రూపాయల్లో వడ్డీ దందా నడుపుతున్నట్టు హాస్పిటల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సదరు అధికారి 5 రూపాయల వడ్డీకి అప్పులు ఇవ్వడం.. తీసుకున్న వారి నుంచి వసూళ్లు చేయడమే వారి డ్యూటీగా మారిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పోలీస్ కేసుల్లో..

ఇక, ఇదే ఆస్పత్రిలో అదనపు సూపరిండింటెంట్ గా ఉన్న డాక్టర్.లక్ష్మీ భాస్కర్ పై కొన్ని రోజుల క్రితం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసులు నమోదయ్యాయి. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ప్లాటు ఇప్పిస్తానని తనతోపాటు వైద్య విద్య చదువుకున్న స్నేహితునికే టోకరా ఇచ్చి ఆయన లక్షల రూపాయలు స్వాహా చేశాడు. ఈ మేరకు బాధితులు మొదట ఫిర్యాదు చేయగా బంజారాహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేయలేదు. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసులు నమోదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

Next Story