- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాతబస్తీలో మెట్రో రైల్ విస్తరణ పనులను పరిశీలించిన సీఎస్ కె.రామకృష్ణారావు
హైదరాబాద్ పాత నగరంలో మెట్రో కారిడార్ ను ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సందర్శించారు.

దిశ, చార్మినార్ : హైదరాబాద్ పాత నగరంలో మెట్రో కారిడార్ ను ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తో కలిసి మెట్రో రైల్ మార్గంలో త్వరితగతిన జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. గత దశాబ్ద కాలంగా నిర్లక్ష్యానికి గురైన పాతనగర మెట్రో రైలు మార్గంలో ఇప్పుడు జరుగుతున్న పనుల తీరు పట్ల ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంజీబీఎస్ నుండి చాంద్రాయణ గుట్ట వరకు 7.5 కిలోమీటర్ల నిడివిగల ఈ మెట్రో కారిడార్ లో ప్రభావిత ఆస్తుల కూల్చివేతలను మెట్రో ఎండీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు. దారుల్ షిఫా నుంచి ప్రారంభించి మండి రోడ్, శాలిబండ జంక్షన్ మార్గంలో ప్రభావిత కట్టడాల కూల్చివేత పనులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిశితంగా పరిశీలించారు. ఈ మార్గంలో ఇరువైపులా చిక్కుముడులుగా ఉన్న క్లిష్టమైన విద్యుత్, టెలిఫోన్, టీవీ కేబుళ్లను అత్యంత జాగ్రత్తతో తొలగిస్తూ పనులు సాగిస్తున్నామని ఎన్వీఎస్ రెడ్డి ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుకి వివరించారు. ఈ మార్గంలో అత్యంత రద్దీగా ఉండే ఇరుకైన రహదారులు ఉండడం వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికాబద్ధంగా కూల్చివేత పనులను చేపట్టినట్టు మెట్రో ఎండీ వెల్లడించారు. ఈ మార్గం లో దాదాపు 105 మత, చారిత్రక, ఇతర సున్నిత కట్టడాలు ఉన్నాయని, వాటికి ఏమాత్రం హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభావిత కట్టడాల కూల్చివేతలు జరుపు తున్నామని ఆయన చెప్పారు.
పగటి పూట వెనుకభాగంలో ఉన్న కట్టడాలను తొలగించి, రాత్రి సమయాల్లో రహదారికి ఆనుకుని ఉన్న ప్రభావిత ఆస్తులను యంత్రాల సాయంతో తొలగిస్తున్నామని వివరించారు. ఇందుకు స్థానికులతో ముందుగానే సంప్రదింపులు జరుపుతున్నామని, వారి సహాయ సహకారాలతోనే ముందుకు సాగుతున్నామని ఆయన సిఎస్ కు తెలిపారు. ఎదురౌతున్న సమస్యలను చాకచక్యంగా పరిష్కరిస్తూ, సమర్థవంతంగా విస్తరణ పనులను నిర్వహిస్తున్నందుకు మెట్రో ఎండీని, ఇతర అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రశంసించారు. ప్రభావిత ఆస్తులు దగ్గరదగ్గరగా ఉండటంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని సీఎస్ సూచించారు. సురక్షితంగా అక్కడ కూల్చివేతలు, శకలాలు తొలగించే కార్యక్రమం వెంటవెంటనే జరగాలని ప్రధాన కార్యదర్శిఆదేశించారు. జరుగుతున్న పనుల తీరుతెన్నుల పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇంకా వాటిని వేగవంతం చేయడానికి అదనపు నిధులను విడుదల చేస్తామని ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వెల్లడించారు.
కొత్త కారిడార్ ల డీపీఆర్ లకు త్వరలో ఆమోద ముద్ర
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా మెట్రో రైల్ రెండవ దశ (పార్ట్-బి) డీపీఆర్ లు సిద్ధమయ్యాయని, రాబోయే హెచ్ఏఎంఎల్ బోర్డు సమావేశంలో వాటిని పరిశీలించి, ఆమోదిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. వీటిని త్వరలోనే రాష్ట్ర మంత్రి వర్గం కూడా ఆమోదించాక కేంద్రానికి పంపుతామని ఆయన వెల్లడించారు. జేబీఎస్ - మేడ్చల్ (24.5 కి.మీ); జేబీఎస్ - శామీర్ పేట్ (22 కి.మీ) కారిడార్ లతో పాటు శంషాబాద్ - ఫ్యూచర్ సిటీ కొత్త కారిడార్(40 కి.మీ) కి కూడా డీపీఆర్ లు సిద్ధం అయ్యాయని ఆయన తెలిపారు. మెట్రో ఎండీ తో ఈ డీపీఆర్ ల గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ కార్యదర్శి కె. ఇల్లంబర్తి, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్. వి. కర్ణన్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, వాటర్ బోర్డ్ ఎండీ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






