నెల పసికందును అపహరించిన కేసును 24 గంటల్లో ఛేదించిన చందానగర్ పోలీసులు

by Taduka Kalyani |

లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద నెల రోజుల పసికందు కిడ్నాప్ కేసును చందానగర్ పోలీసులు 24 గంటల్లో ఛేదించారు.

నెల పసికందును అపహరించిన కేసును 24 గంటల్లో ఛేదించిన చందానగర్ పోలీసులు
X

దిశ, శేరిలింగంపల్లి : లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద నెల రోజుల పసికందు కిడ్నాప్ కేసును చందానగర్ పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి చిన్నారిని సురక్షితంగా తల్లికి అప్పగించారు. ఈ కేసుతో అంతర్రాష్ట్ర చిన్నారుల అక్రమ రవాణా ముఠా కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. జూన్ 30వ తెల్లవారుజామున 2 గంటల సమయంలో లింగంపల్లి రైల్వే స్టేషన్ గోడ పక్కన సర్కస్ బృంద సభ్యులతో కలిసి నిద్రిస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళ మలన్ బౌరవ్ శాంతాబాయి ఒడిలో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి నెల రోజుల ఆడ శిశువును అపహరించారు. శిశువు ఏడుపు విని తల్లి మేల్కొని వెంబడించిన నిందితులు ఆటోలో పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏసీపీ సీహెచ్. వై. శ్రీనివాస్ పర్యవేక్షణలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇన్‌స్పెక్టర్ ఎస్. విజయ్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్లు సత్యనారాయణ, ఎన్. భాస్కర్ నేతృత్వంలోని బృందాలు మూడు రోజుల పాటు సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజిగిరి ప్రాంతాల్లో వందలాది సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో మహ్మద్ జుబేర్ (వికారాబాద్) ప్రధాన కిడ్నాపర్, మహ్మద్ ఇర్ఫాన్ (వికారాబాద్) తో పాటు మధ్యవర్తులు సాదేకా మక్సూద్ అలియాస్ నాజియా (నేరేడ్‌మెట్), నిమ్మీ జహాన్ అలీ అలియాస్ సీమా అలీ (బంజారాహిల్స్), చిన్నారిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన మహిళ రహ్నుమా అలీ (కోల్‌కతా) ను అరెస్టు చేశారు.

చిన్నారిని దత్తత ఇప్పించమంటే

సంతానం లేని కోల్‌కతాకు చెందిన రహ్నుమా అలీ డబ్బులు చెల్లించి ఒక చిన్నారిని దత్తత ఇప్పించాలని తన అత్త సీమా అలీని కోరింది. సీమా ఈ విషయాన్ని తన స్నేహితురాలు నాజియాకు చెప్పగా, ఆమె తనకు తెలిసిన జుబేర్‌కు సమాచారం ఇచ్చింది. భారీ మొత్తంలో డబ్బులు వస్తాయని ఆశతో జుబేర్ తన స్నేహితుడు ఇర్ఫాన్‌తో కలిసి చిన్నారిని కిడ్నాప్ చేయాలని కుట్ర పన్నాడు. జూన్ 30 తెల్లవారుజామున ఆటోలో లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్న ఇద్దరు నిందితులు నిద్రిస్తున్న తల్లి ఒడిలో నుంచి నెల రోజుల పసికందును అపహరించి నాజియా ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం రహ్నుమా అలీకి సమాచారం అందించారు. జూలై 1న రహ్నుమా అలీ తన బంధువుతో కలిసి విమానంలో కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు చేరుకుని చిన్నారిని తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఈ అక్రమ ఒప్పందంలో భాగంగా జుబేర్‌కు ఆన్‌లైన్ ద్వారా రూ.1.50 లక్షలు చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే నిందితులు చిన్నారిని కోల్‌కతాకు తరలించేలోపే పోలీసులు వారిని అరెస్ట్ చేసి, పసికందును సురక్షితంగా రక్షించి కన్నతల్లి ఒడికి చేర్చారు. ఈ కేసును వేగంగా ఛేదించి అంతర్రాష్ట్ర చిన్నారుల అక్రమ రవాణా ముఠాను బట్టబయలు చేసిన దర్యాప్తు బృందాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అభినందించారు.

Next Story