- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అత్తాపూర్ సర్కిల్‌లో బుల్డోజర్ల హల్‌చల్.. అక్రమ నిర్మాణాల కూల్చివేత
హైదరాబాద్ అత్తాపూర్ సర్కిల్ వద్ద రోడ్డు ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝుళిపించారు.

దిశ, వెబ్‌డెస్క్: నగరంలోని అత్తాపూర్ (Attapur) సర్కిల్ పరిధిలో రోడ్డు ఆక్రమణలపై జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు ఉక్కుపాదం మోపారు. ఆరాంఘర్ నుంచి డెయిరీ ఫామ్ చౌరస్తా వరకు ప్రధాన రహదారిని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను ఇవాళ ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు. ఆరాంఘర్ - డెయిరీ ఫామ్ (Aramghar – Dairy Farm) రహదారి విస్తరణలో భాగంగా, రోడ్డును ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించారు. ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతున్న ఈ కట్టడాలను తొలగించాలని ముందే నోటీసులు జారీ చేసినట్లుగా సమాచారం. కూల్చివేతల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. బుల్డోజర్ల సహాయంతో షాపుల ముందున్న అదనపు నిర్మాణాలు, ప్రహరీ గోడలను కూల్చివేశారు.
ఈ క్రమంలోనే తమ నిర్మాణాలను కూల్చివేయడంపై స్థానిక యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ముందస్తు సమాచారం లేకుండానే కూల్చివేతలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. కాగా, ఈ మార్గంలో రోడ్డు ఆక్రమణల వల్ల నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోందని వాహనదారులు ఫిర్యాదు చేస్తున్నారు. తాజా కూల్చివేతలతో రహదారి వెడల్పు పెరిగి, రాకపోకలు సులభతరం అవుతాయని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు.






