ఆర్టీసీ అప్పుల కుప్ప‌గా మార‌డానికి బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే కార‌ణం

by Ratna Kumari |

ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇస్తూనే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామ‌ని కాంగ్రెస్ కార్మిక అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ టీజీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ వెల్లడించింది.

ఆర్టీసీ అప్పుల కుప్ప‌గా మార‌డానికి బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే కార‌ణం
X

దిశ, హిమాయత్ నగర్ : ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇస్తూనే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామ‌ని కాంగ్రెస్ కార్మిక అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ టీజీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ వెల్లడించింది. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూనియన్ జనరల్ సెక్రటరీ జక్కుల మల్లేశంతో కలిసి కన్వీనర్ మొగుళ్ల రాజిరెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 10 ఏళ్లు ఆర్టీసీ నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు పోతుందన్నారు. గత ప్రభుత్వం కార్మికుల పీఎఫ్ బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పీఎఫ్ బకాయిలు 600 కోట్లు నిధులు విడుదల చేసిందని గుర్తు చేశారు. అలాగే డీఏలను కూడా ఇచ్చిందన్నారు.

ఆర్టీసీ సంస్థ అప్పుల కుప్పగా మారడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. మాజీ మంత్రి హరీశ్ రావు ఇప్పుడు కార్మికుల పక్షాన ఉన్నామంటూ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 55 రోజులు సమ్మె చేస్తే.. ప్రభుత్వంలో విలీనం చేస్తామని నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. రెండు రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇస్తూనే రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. జేఏసీ పెట్టిన 32 డిమాండ్ల‌లో 29 డిమాండ్ ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. కార్మికుల పక్షాన ప్రభుత్వంతో చర్చలు సాగుతున్నాయని, రెండు రోజుల్లో సమ్మెకు పరిష్కారం లభిస్తుందని రాజిరెడ్డి ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఈ సమావేశంలో ఆర్డీ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Next Story