‘నార్ముల్​ డెయిరీ’లో జీతాలిస్తలేరని మనోవేధనతో ఉద్యోగి మృతి

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-02-14 15:06:18  IST  )

హ‌య‌త్ న‌గ‌ర్ లోని నార్మూల్ డెయిరీలో విధుల్లో ఉండ‌గా.. ఓ ఉద్యోగి కుప్ప‌కూలి శుక్ర‌వారం కింద ప‌డ్డాడు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ శ‌నివారం మృతి చెందాడు.

‘నార్ముల్​ డెయిరీ’లో జీతాలిస్తలేరని మనోవేధనతో ఉద్యోగి మృతి
X

దిశ, వనస్థలిపురం : హయత్​నగర్​లోని నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్‌ లిమిటెడ్‌ (నార్ముల్‌-మదర్‌ డెయిరీ) లో శుక్రవారం విధుల్లోనే కుప్పకూలి అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయారు. ఉద్యోగులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్​ మెట్​ మండలం .. పసుమాముల గ్రామానికి చెందిన తులసిగారి బాల నర్సింహ్మ (46) నార్ముల్​ మదర్​ డెయిరీలో గత కొన్నేండ్లుగా ప్లాంట్​ ఆపరేటర్​ విభాగంలో.. ప్రీ ప్యాక్​ సెక్షన్​ సూపర్​వైజర్​గా పనిచేస్తున్నారు. రోజు మాదిరిగానే శుక్రవారం ఆఫీసుకు వచ్చారు. డ్యూటీ చేస్తుండగా.. సాయంత్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గమనించిన తోటి ఉద్యోగులు వెంటనే స్థానికంగా ఉండే వనస్థలిపురంలోని ఈవ్య హాస్పిటల్​కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి మలక్​పేటలోనే యశోద ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్లు తీవ్రమైన బ్రెయిన్ స్ట్రోక్​తో పరిస్థితి సీరియస్​గా ఉందని, వెంటనే ఆపరేషన్​ చేయాలని భారీగా ఖర్చు అవుతుందని చెప్పారు. మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించాలని సూచనతో కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం చనిపోయారు.

జీతాలందక ఆర్థిక ఒత్తిళ్లతో సతమతమయ్యాడు: కుటుంబ సభ్యులు

గాంధీ ఆస్పత్రి నుంచి అంబులెన్స్​లో మృత దేహాన్ని తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు డెయిరీ ఎదుట ఆందోళనకు దిగారు. బాల నర్సింహ్మ మృతికి నార్ముల్​ డెయిరీ యాజమాన్యమే కారణమని ఆరోపించారు. ఆయన కుటుంబానికి న్యాయం చేసే వరకు కదిలేది లేదని భీష్మించారు. డెయిరీ లోపలికి వెళ్లడానికి గేట్లు తోసుకుని వెళ్లేందుకు కుటుంబ సభ్యులు యత్నించారు. వెంటనే అలర్ట్​ అయిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దాదాపు 4 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పోషణ భారమవ్వడంతో బాల నర్సింహ్మ తీవ్రమైన ఆర్థిక ఒత్తిడికి గురయ్యాడని తెలిపారు. ఆర్థిక ఒత్తిడి తట్టుకోలేకనే ఆయన బ్రెయిన్​స్ట్రోక్​ కు గురయ్యారని, నార్ముల్​ డెయిరీ యాజమాన్యం నిండుప్రాణాలు బలితీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.

బాల నర్సింహ్మ కుటుంబానికి అండగా ఉంటాం: చైర్మన్​ మధుసూదన్​రెడ్డి

ప్రీ ప్యాక్​ సెక్షన్​ సూపర్​వైజర్​ బాలనర్సింహ్మ మృతి బాధాకరమని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని నార్ముల్​ మదర్​ డెయిరీ చైర్మన్​ మధుసూదన్​రెడ్డి భరోసా ఇచ్చారు. ఉద్యోగి కుటుంబానికి అంత్యక్రియలకు తక్షణ సాయం కింద రూ. 50 వేలు అందజేశామని చెప్పారు. కుటుంబ సభ్యులు పెట్టిన డిమాండ్లను త్వరలో జరగబోయే బోర్డు మీటింగ్​లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎంప్లాయీస్​కు రెండు నెలల జీతాలు పెండింగ్​లో ఉన్నాయని, అవి త్వరలో చెల్లిస్తామని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు.

Next Story