‘మీల్ వితౌట్ రీల్’.. డిజిటల్ వ్యసనంపై ABVP సమరశంఖం

by Ramesh Naini |

స్వామి వివేకానంద జయంతి (జాతీయ యువజన దినోత్సవం) సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) వేదికగా ABVP ఆధ్వర్యంలో "SCREEN TIME to ACTIVITY TIME" అనే దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.

‘మీల్ వితౌట్ రీల్’.. డిజిటల్ వ్యసనంపై ABVP సమరశంఖం
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్వామి వివేకానంద జయంతి (జాతీయ యువజన దినోత్సవం) సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) వేదికగా ABVP ఆధ్వర్యంలో "SCREEN TIME to ACTIVITY TIME" అనే దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోమవారం ఉదయం జరిగిన "RUN FOR NATION" 5K రన్‌లో పాల్గొన్న ABVP జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వీరేంద్ర సింగ్ సోలంకి, ఈ క్యాంపెయిన్ పోస్టర్‌ను ఆవిష్కరించి కార్యక్రమాన్ని అధికారికంగా మొదలుపెట్టారు. యువతలో డిజిటల్ సమతుల్యత సాధించడమే లక్ష్యంగా ఈ ఉద్యమాన్ని చేపట్టినట్లు ఆయన ప్రకటించారు. యువతను డిజిటల్ వ్యసనాల నుంచి విముక్తి చేసి ప్రకృతి, క్రీడలు, సంస్కృతితో తిరిగి అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ ప్రారంభించినట్లు డాక్టర్ సోలంకి తెలిపారు. నేటి యువత సాంకేతిక యుగానికి ప్రతినిధులైనప్పటికీ, మొబైల్, డిజిటల్ పరికరాల మితిమీరిన వినియోగం వారి ఆరోగ్యం, సామాజిక జీవనంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని అన్నారు.

మీల్ వితౌట్ రీల్...

యువత తమ స్క్రీన్ టైమ్‌ను యాక్టివిటీ టైమ్‌గా మార్చుకున్నప్పుడే ఆరోగ్యవంతమైన, సమర్థవంతమైన దేశాన్ని నిర్మించగలమని, దీనిని ఒక సామూహిక ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన 71వ జాతీయ మహాసభల్లో వచ్చిన సూచనల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ ప్రచారంలో ‘స్క్రీన్ టైమ్ టు గ్రీన్ టైమ్’, ‘స్క్రీన్ టైమ్ టు ప్లే టైమ్’, ‘మీల్ వితౌట్ రీల్’ వంటి నినాదాలతో యువతను చైతన్యపరచనున్నారు. సగటున రోజుకు 8-9 గంటలు స్క్రీన్‌పై గడుపుతూ డిప్రెషన్ బారిన పడుతున్న విద్యార్థులలో మానవీయ, సృజనాత్మక వికాసాన్ని పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ABVP శాఖల ద్వారా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రావుల కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు, ప్రాంత సంఘటన మంత్రి విష్ణు వర్ధన్, స్టేట్ యూనివర్సిటీస్ ప్రముఖ్ అశ్వినీ, ఇతర జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు, HCU విద్యార్థి సంఘం ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఒక నిర్మాణాత్మక మార్పు కోసం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు పేర్కొన్నారు.

Next Story