అరకొర వసతులు

by velandi.Saikiran |

హైదరాబాద్ లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ధీనంగా మారింది. జిల్లాలో ప్రభుత్వ రంగంలో 500 ప్రాథమిక పాఠశాలలు, 9 ప్రాథమికోన్నత

అరకొర వసతులు
X

దిశ , హైదరాబాద్ బ్యూరో: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ధీనంగా మారింది. జిల్లాలో ప్రభుత్వ రంగంలో 500 ప్రాథమిక పాఠశాలలు, 9 ప్రాథమికోన్నత పాఠశాలలు, 182 ఉన్నత పాఠశాలలు నడుస్తున్నప్పటికీ కేవలం 1.35 లక్షల మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 8 లక్షలకు పైగా పిల్లలు చదువుతుండగా.. కేవలం 20 శాతం మంది విద్యార్థులు కూడా లేకపోవడం ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఇట్టే అర్థం అవుతుంది. హైదరాబాద్ రెవెన్యూ జిల్లాలోని అంబర్‌పేట్, ముషీరాబాద్, సికింద్రాబాద్, సైదాబాద్, బండ్లగూడ, చార్మినార్, బహదూర్‌పురా, ఆసిఫ్ నగర్, షేక్‌పేట్ మండలాల్లోని 68 ప్రభుత్వ పాఠశాలల్లో అతి తక్కువ మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిల్లో పాఠశాల వాతావరణం బాగా లేకపోవడం, భవనం వసతులు లేక కమ్యూనిటీ హాళ్లలో, అద్దె గదుల్లో నడుస్తున్నాయి. చాలా తక్కువ పాఠశాలలల్లో మెరుగైన వసతులు కలిగి ఉండడం పరిస్థితికి అద్దం పడుతున్నాయి.

ఎక్కడ, ఎలాంటి సమస్యలున్నాయంటే..

అంబర్ పేట్ మండలంలో..

అంబర్ పేట్ మండలంలోని లేబర్ కాలనీలో వసతుల లేమి కారణంగా ప్రభుత్వ పాఠశాల మూతపడింది. నల్లకుంటలో ప్రభుత్వ పాఠశాల భవనం నాలుగు గదులతో కండీషన్ లో ఉన్నప్పటికీ ఇక్కడ కేవలం 16 మంది విద్యార్థులు మాత్రమే విద్యనభ్యసిస్తున్నారు. తిలక్ నగర్ లో కమ్యూనిటీ హాల్ లో పాఠశాల నడుస్తుండగా.. 33 మంది విద్యార్థులున్నారు. ఇక కురుమగూడలో 39మంది, గోల్నాక ప్రభుత్వ పాఠశాలలో 36 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు.

ముషీరాబాద్ మండలంలో..

ముషీరాబాద్ మండలంలోని ముగ్గుబస్తీలో పిల్లలు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ కేవలం 27 మంది విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. పోచమ్మ టెంపుల్ ప్రాంతంలో కమ్యునిటీ హాల్ లో నడుస్తున్న పాఠశాలలో 61 మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ సొంత భవనం అవసరం.

సికింద్రాబాద్ మండలంలో..

సికింద్రాబాద్ మండలంలోని బోలక్ పూర్ ప్రాథమిక పాఠశాల, గొల్ల కురుమ కాలనీ పాఠశాలలు ఒకే భవనంలో నడుస్తున్నాయి. వీటిల్లో 15, 18 మంది పిల్లలు మాత్రమే చదువుతున్నారు. న్యూ బోయగూడ పాఠశాలలో ఇద్దరు టీచర్లు ఉండగా.. కేవలం 28 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. పాఠశాల ఎదురుగా సుమారు 500 గజాల స్థలం ఉంది. ఇందులో పాఠశాల నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. మేకలమండిలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రథమికోన్నత పాఠశాలల్లో సుమారు 730 మంది విద్యార్థులుండగా ఇక్కడ ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. జిర్రా పాఠశాలలో ఇద్దరు టీచర్లుండగా.. కేవలం 12 మంది విద్యార్థులున్నారు. హైదర్ బస్తీ, ఆదిత్యా మెమోరియల్ హై స్కూల్ ఒకే చోట నడుస్తుండగా భవనం శిథిలాస్థకు చేరుకుని భయపెడుతున్నది.

సైదాబాద్ మండలంలో..

ఈ మండలంలోని బంజారానగర్ ప్రాథమిక పాఠశాలలో 33 మంది వలస కార్మికుల పిల్లలు చదువుతున్నారు. స్థానికుల పిల్లలు వివేక వర్ధిని పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు . వడ్డెరబస్తీ, శాలివాహన నగర్ లో పాఠశాల భవనం మూసీ సమీపంలో ఉండడం, పక్కనే 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను వీటిల్లో చదివించడం లేదు. ఇక్కడ కేవలం 22 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు . న్యూ మూసారాంబాగ్ లోని జీపీఎస్ , జీహెచ్ఎస్ పాఠశాలలు ఓ ఆలయానికి చెందిన భవనం లో ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు .

బహదూర్ పురా మండలంలో..

బహదూర్ పురా మండలంలోని నర్సారెడ్డి నగర్ లో కమ్యునిటీ హాల్ లో నడుస్తున్న పాఠశాలలో కేవలం 36 మంది, ఇక్కడే ఉర్దూ మీడియంలో ఇద్దరు టీచర్లుండగా.. 42 మంది విద్యార్థులు చదువుతున్నారు. చిరాగ్ అలీ నగర్ పాఠశాల భవనం వర్షాలకు కురుస్తుండగా ఇక్కడ కేవలం 27 మంది, రిసిగంజ్ లోని ఉర్దూ మీడియం , కిషన్ గంజ్ లోని తెలుగు మీడియం పాఠశాలలో ఒకే భవనంలో నడుస్తున్నాయి. గదులు ఇరుకుగా ఉండడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. కసరట్ట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం బాగా ఉన్నప్పటికీ 13 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. మూసాబౌలి, చార్ మహల్ పాఠశాలల ఎదుట శ్మశాన వాటిక ఉండడంతో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కాంపౌండ్ వాల్ కూడా నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. అఫ్జల్ గంజ్, తట్టికోట పాఠశాలలు కూడా ఒకే ఆవరణలో ప్రైవేట్ భవనంలో కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా విద్యార్థుల సంఖ్య తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో కలిపి 94 మంది మాత్రమే ఉన్నారు .

బండ్లగూడ మండలంలో..

బండ్లగూడ మండలంలోని హబీబ్ నగర్ ఉర్దూమీడియం పాఠశాలలో 48 మంది విద్యార్థులకు ఇద్దరు టీచర్లున్నారు. బట్జీ నగర్ పాఠశాల భవనం కూలిపోవడంతో శివాజీనగర్ లోని అద్దె భవనంలో నడుపుతుండగా.. 123మంది విద్యార్థులకు 5 గురు ఉపాధ్యాయులున్నారు. పార్వతీనగర్ పాఠశాల భవనం కండీషన్ లో ఉన్నప్పటికీ కేవలం 13 మంది పిల్లలు ఉన్నారు. సుల్తాన్ షాహి బయ్యాలాల్ నగర్ లో పాఠశాల అద్దె భవనంలో కొనసాగుతుండగా.. ముగ్గురు టీచర్లకు 30 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు.

చార్మినార్ మండలంలో..

డబీర్ పురాలో 1947లో ఏర్పాటు చేసిన పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో అద్దె భవనంలో నడుపుతున్నారు. ఫతేషా నగర్ ప్రాథమిక పాఠశాలలో 57 మంది, ఇక్కడే ఇంగ్లిష్ మీడియంలో 116 మంది విద్యార్థులు చదువుతున్నారు.

ఆసీఫ్ నగర్ మండలంలో..

సీసీ నగర్ కమ్యునిటీ హాల్ ను రెండు భాగాలుగా విడదీసి కొంత బాగంలో పాఠశాల, మిగిలిన భాగంలో బస్తీ దవాఖాన నడుపుతున్నారు ఇక్కడ 22 మంది విద్యార్థులున్నప్పటికీ పని చేసే టీచర్ రెగ్యులర్ గా గైర్హాజర్ అవుతున్నాడు. ఇక ముస్తాదిపురా , గిరికపల్లి, ముచుకుందనగర్ , మంగళ్ హాట్, అప్పర్ ధూల్ పేట్, లోయర్ ధూల్ పేట్ , లోధ్ క్షత్రియ నగర్ పాఠశాలల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి .

షేక్ పేట్ మండలంలో ....

షేక పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మెరుగ్గా ఉన్నప్పటికీ భవనం సరిపోవడం లేదు . ఎంజీ నగర్ లో 106 మంది విద్యార్థులకు నలుగురు టీచర్లున్నారు . బీజేఆర్ నగర్ పాఠశాల భవనం నిర్మాణంలో ఉండగా 22 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లున్నారు. భవన నిర్మాణం నత్తనడకన నడుస్తోంది . వెంకటగిరి, ఉదయ్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు కమ్యునిటీ హాల్ లో నడుస్తున్నాయి. సమీపంలోనే మినిస్టర్ క్వార్టర్స్ ఉన్నాయి. దేవరకొండ బస్తీ లో భవనం అరకొరగా ఉంది. ఖైరతాబాద్ 2 కు పాఠశాల భవనం లేదు.

ఇలా హైదరాబాద్ రెవిన్యూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. దీంతో మెరుగైన వసతులు కల్పించాలని , విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లుగా ఉపాధ్యాయులను నియమించాలని తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి , ప్రధాన కార్యదర్శి ఎం రాధేశ్యాంలు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్జప్తి చేశారు . ముఖ్యమంత్రి పదవి తో పాటు విద్యా శాఖను కలిగి ఉన్న మీరు ప్రభుత్వ పాఠశాలలకు భూమిని విరాళంగా ఇవ్వాలని కోరారు .

Next Story