డ్రగ్స్‌కు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్

by Taduka Kalyani |

యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా చైతన్యవంతులను చేయడమే లక్ష్యంగా కంచన్‌బాగ్ పోలీసులు మిధాని డిపోలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

డ్రగ్స్‌కు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్
X

దిశ, చంపాపేట్, జూన్ 25: యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా చైతన్యవంతులను చేయడమే లక్ష్యంగా కంచన్‌బాగ్ పోలీసులు మిధాని డిపోలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పించడంతో పాటు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమానికి చాంద్రాయణగుట్ట ఏసీపీ సుధాకర్, కంచన్‌బాగ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ జే. బాలరాజ్, ఎస్‌ఐలు వెంకటరమణ, నాగలక్ష్మి, శ్రీకాంత్, బ్లూ కోల్ట్స్-3 సిబ్బంది, పెట్రోల్ కార్-1 సిబ్బంది, మిధాని డిపో మేనేజర్ విజయకుమార్ హాజరయ్యారు. కార్యక్రమంలో మొత్తం 58 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు యువత జీవితాన్ని, కుటుంబాలను, సమాజాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. క్షణిక ఆనందం కోసం డ్రగ్స్‌కు అలవాటు పడితే భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. విద్యార్థులు చెడు స్నేహాలకు దూరంగా ఉండి, విద్య, క్రీడలు, వ్యక్తిత్వ వికాసం పై దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్ విక్రయం, వినియోగం లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు అందించాలని, సమాజాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని అధికారులు పిలుపునిచ్చారు. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని డ్రగ్స్ నివారణకు సంబంధించిన పలు ప్రశ్నలు అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

Next Story