హైదరాబాద్ టూ కర్ణాటక.. గోవాకు తగ్గనున్న 100 కి.మీ దూరం !

by velandi.Saikiran |   (  Updated:2026-05-06 21:31:01  IST  )

భాగ్యనగర వాసులకు రైల్వే ప్రయాణం ఇకపై మరింత వేగవంతం, సులభతరం కానుంది.

హైదరాబాద్ టూ కర్ణాటక.. గోవాకు తగ్గనున్న 100 కి.మీ దూరం !
X

హైదరాబాద్ టూ కర్ణాటక.. ప్రయాణం మరింత ఈజీ

గుంతకల్- వాడి రైల్వే మల్టీ ట్రాకింగ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

మంత్రాలయానికి మెరుగవ్వనున్న కనెక్టివిటీ

దిశ, తెలంగాణ బ్యూరో : భాగ్యనగర వాసులకు రైల్వే ప్రయాణం ఇకపై మరింత వేగవంతం, సులభతరం కానుంది. దక్షిణ భారతాన్ని పశ్చిమ భారతంతో అనుసంధానించే కీలకమైన గుంతకల్- వాడి రైల్వే మార్గంలో 3వ, 4వ లైన్ల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలపడం తెలంగాణ రైల్వే రంగానికి ఉపయుక్తంగా మారనుంది. ఈ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుతో కేవలం రద్దీ తగ్గడమే కాకుండా, తెలంగాణ నుంచి కర్ణాటక, రాయలసీమ, గోవా వైపు వెళ్లే రైళ్ల వేగం పెరగనుంది. మొత్తం రూ. 23,437 కోట్ల భారీ వ్యయంతో చేపడుతున్న మూడు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులలో ఇది కూడా ఒకటి. కాగా... 2030-31 నాటికి ట్రాక్ పెంపుదలను పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

వాడి- సికింద్రాబాద్ కనెక్టివిటీకి ఊతం...

తెలంగాణ రైల్వే నెట్‌వర్క్‌లో వాడి జంక్షన్ అత్యంత కీలకం. సికింద్రాబాద్ నుంచి వాడి వరకు ఇప్పటికే ఉన్న లైన్లకు ఈ కొత్త ప్రాజెక్టు అనుసంధానం కావడం వల్ల హైదరాబాద్ నుంచి కర్ణాటక, రాయలసీమ, గోవా వైపు వెళ్లే రైళ్ల రాకపోకలు మరింత సులభతరం అవుతాయి. ప్రస్తుతం వాడి- గుంతకల్ మార్గంలో రద్దీ కారణంగా సికింద్రాబాద్ నుంచి వచ్చే రైళ్లు తరచూ ఆలస్యమవుతుంటాయి. 3వ, 4వ లైన్లు అందుబాటులోకి వస్తే, క్రాసింగ్‌ల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు. హైదరాబాద్ నుంచి కర్ణాటక సరిహద్దుల మీదుగా బెంగళూరు వైపు వెళ్లే రైళ్ల వేగం పెరగడంతో పాటు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.

తెలంగాణ ప్రయోజనాలు ఇవే...

వాడి ప్రాంతం నుంచి సిమెంట్, సున్నపురాయి, ఇతర ముడి పదార్థాల రవాణాకు తెలంగాణలోని పరిశ్రమలకు మార్గం సుగమం అవుతుంది. హైదరాబాద్ నుంచి మంత్రాలయం (శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం), గుంతకల్ సమీపంలోని కసాపురం వంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లే భక్తులకు రైళ్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పిఎం-గతి శక్తి పథకం కింద చేపట్టే ఈ పనుల వల్ల స్థానిక యువతకు ఉపాధి లభించడమే కాకుండా, లాజిస్టిక్ రంగానికి బలం చేకూరుతుంది. ఈ ప్రాజెక్టు కేవలం ప్రయాణ సౌకర్యమే కాకుండా, పర్యావరణ పరిరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. రైల్వే లైన్ల విస్తరణ వల్ల రోడ్డు రవాణాపై ఒత్తిడి తగ్గి, డీజిల్ వినియోగం ఆదా అవుతుంది. తద్వారా కర్బన ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు కలుగుతుంది. ఇది పూర్తయితే తెలంగాణ నుంచి దేశంలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాలకు రైల్వే ప్రయాణం సరికొత్త పుంతలు తొక్కనుంది.

లింక్ పూర్తయితే గోవాకు తగ్గనున్న 100 కి.మీ దూరం

గుంతకల్- వాడి రైల్వే లైన్ కు అనుసంధానం చేసేలా ఇప్పటికే గద్వాల-రాయచూరు, మహబూబ్ నగర్- రాయచూరు రైల్వే లైన్లు పూర్తయ్యాయి. అలాగే రాయచూరు-మునీరాబాద్ లైన్ లో సింధనూరు- మునీరాబాద్ లైన్ పూర్తై రైళ్లు కూడా తిరుగుతున్నాయి. రాయచూరు-మాన్వి- సింధనూరు రైల్వే లైన్ పూర్తయితే హైదరాబాద్- గోవాకు కనీసం 102 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దూరం తగ్గడం మరియు కొత్త లైన్ కావడంతో రైళ్ల వేగం పెరిగే అవకాశం ఉండటం వల్ల, సుమారు 3 నుండి 4 గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుందని అంచనా.

Next Story