సిగ్నల్ ఫ్రీ దిశగా హైదరాబాద్ అడుగులు: రూ.7,042 కోట్లతో హెచ్-సిటీ పనులు స్పీడప్!

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-27 01:54:15  IST  )

హైదరాబాద్ హెచ్-సిటీ (H-CITI) ప్రాజెక్టు పనులను తెలంగాణ ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది.

సిగ్నల్ ఫ్రీ దిశగా హైదరాబాద్ అడుగులు: రూ.7,042 కోట్లతో హెచ్-సిటీ పనులు స్పీడప్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: క్యూర్ పరిధిలోని హెచ్-సిటీ పనులపై సర్కార్ ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వం హయాంలో ఎస్ఆర్డీపీలో భాగంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గుర్తించిన ప్రాజెక్టులను సైతం పూర్తి చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పరిధిలోని ఇంజినీరింగ్ ప్రాజెక్టులను త్వరిగతిన పూర్తి చేయాలని ముగ్గురు కమిషనర్లు ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ పనులు వేగంగా జరగడానికి కమిషనర్ కర్ణన్ ఆధ్వర్యంలో ప్రతివారం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

రూ.7.042 కోట్లకు పరిపాలన మంజూరు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (హెచ్-సిటీ)గా భాగంగా ఫ్లైఓవర్లు, అండర్ పాసుల నిర్మాణానికి రూ.7,042 కోట్లకు ప్రభుత్వం పరిపాలన మంజూరు ఇచ్చిన విషయం తెలిసిందే. వీటిలో ఒక్క కేబీఆర్ పార్కు చుట్టూ ప్రాజెక్టులు చేపట్టడానికి రూ.1090 కోట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ హెచ్-సిటీ కింద మొత్తం రూ.5942 కోట్లను మంజూరు చేస్తూ సర్కారు ఉత్తర్వులను జారీ చేసింది.

ఆరు స్టీల్ బ్రిడ్జీలు.. ఏడు అండర్ పాసులు

హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ఉన్న కేబీఆర్‌ పార్కు సమీపంలోని కేబీఆర్ పార్కు చుట్టూ జంక్షన్ల అభివృద్ధిలో భాగంగా నిర్మించనున్న ఫ్లైఓవర్లు, అండర్ పాసులను రెండు ప్యాకేజీల పనులు ప్రారంభమయ్యాయి. రూ.580 కోట్లతో మొదటి ప్యాకేజీలో కేబీఆర్ పార్కు ఎంట్రెన్స్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్, ముగ్ద జంక్షన్ రెండు స్టీల్ బ్రిడ్జీలు, మూడు అండర్ పాసులను నిర్మించనున్నారు. రూ.510 కోట్లతో రెండో ప్యాకేజీలో రోడ్డు నంబర్ 45 జంక్షన్, ఫిల్మ్ నగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, కాన్సర్ హాస్పిటల్ జంక్షన్లలో నాలుగు స్టీల్ బ్రిడ్జీలు, నాలుగు అండర్ పాసులను నిర్మించనున్నారు. వీటికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ట్రాఫిక్‌ను సైతం డైవర్షన్ చేశారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ సైతం స్పీడ్ అప్ అయింది. ఇప్పటికే బాధితులతో కమిషనర్ కర్ణన్ సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు.

చకచకా నల్లగొండ ఎక్స్ రోడ్డు ఫ్లైఓవర్

నల్లగొండ ‘ఎక్స్’ రోడ్స్–ఓవైసీ జంక్షన్ కారిడార్ పనులు చకచకా జరుగుతున్నాయి. దక్షిణ హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ సమస్యలను తగ్గించేందుకు చేపట్టిన నల్లగొండ ‘ఎక్స్’ రోడ్స్–సైదాబాద్–ఐఎస్ సదన్–ఓవైసీ జంక్షన్ సమగ్ర అభివృద్ధి కారిడార్ పనులు పూర్తికావొస్తున్నాయి. ప్రాజెక్టులో భాగంగా 2,530 మీటర్ల పొడవు గల ప్రధాన ఫ్లైఓవర్‌ను రూ.620 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. ఇప్పటివరకు సుమారు 90 శాతం పనులు పూర్తయ్యాయి. ముఖ్యంగా సైదాబాద్ నుంచి ధోబీఘాట్ జంక్షన్ వరకు కీలక ప్రాంతంలో ట్రాఫిక్ డైవర్షన్‌కు అవసరమైన అనుమతులు తీసుకుని పనులు వేగం పెంచారు.

Next Story