ఐఆర్ఎఫ్‌సీతో మెట్రోరైలు రుణ ఒప్పందం : సీఎస్ రామకృష్ణారావు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-25 16:22:15  IST  )

హైదరాబాద్ నగర పట్టణ రవాణా మౌలిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.

ఐఆర్ఎఫ్‌సీతో మెట్రోరైలు రుణ ఒప్పందం : సీఎస్ రామకృష్ణారావు
X
  • ఎల్అండ్‌టీ నుంచి హెచ్ఎంఆర్ఎల్‌కు రూ.13,600కోట్ల రీఫైనాన్సింగ్
  • హైదరాబాద్ మెట్రోకు భారీ ఆర్థిక బలం
  • పట్టణ రవాణా విస్తరణకు దీర్ఘకాలిక నిధుల సమీకరణ
  • 20ఏండ్ల కాలపరిమితితో చెల్లింపులు
  • కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన సీఎస్ రామకృష్ణారావు

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగర పట్టణ రవాణా మౌలిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్ఎఫ్సీ) ద్వారా గరిష్ఠంగా రూ.13,600 కోట్ల రీఫైనాన్సింగ్ కింద రుణం పొందింది. ఢిల్లీలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఐఆర్ఎఫ్‌సీ, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్)లిమిటెడ్, హెచ్ఎమ్ఆర్ఎల్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి. ఈ కార్యక్రమంలో ఐఆర్ఎఫ్‌సీ సీఎండీ, సీఈఓ మనోజ్ కుమార్ దుబే, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో సమర్థవంతమైన, సుస్థిరమైన మరియు ప్రజానుకూల ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉందన్నారు.

దేశ ఆర్థికవృద్ధికి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని, నగర వేగవంతమైన అభివృద్ధికి అనుగుణంగా మెట్రో కనెక్టివిటీ విస్తరణ అత్యంత అవసరమని తెలిపారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు నగర జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో మెట్రో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. రూ.13,600 కోట్ల రీఫైనాన్సింగ్ ద్వారా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం లభిస్తుందని, దీని వల్ల ప్రాజెక్టు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం మరింత బలపడుతుందని ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ప్రస్తుత రుణ భారం తగ్గడంతో పాటు భవిష్యత్ మెట్రో విస్తరణ ప్రణాళికలకు ఇది దోహదపడుతుందన్నారు. ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో సహకరించిన కేంద్ర ప్రభుత్వం, ఐఆర్ఎఫ్‌సీ, ఎల్ అండ్ టీ బృందం, హెచ్ఎంఆర్ఎల్, సంబంధిత అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, బొగ్గు మరియు గనుల శాఖ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , వారి అమూల్యమైన, నిరంతర సహకారం, మార్గదర్శనం,ప్రోత్సాహాన్ని అందించినందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలిపారు. అలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహకారం, సమర్థవంతమైన మార్గనిర్దేశానికి ప్రధాన కార్యదర్శి కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా, దేశవ్యాప్తంగా ప్రకటించిన ఏడు హైస్పీడ్ రైలు కారిడార్లలో హైదరాబాద్‌కు మూడు కారిడార్లను ప్రకటించడాన్ని ప్రత్యేకంగా ఆయన ప్రస్తావించారు. ఈ నిర్ణయం నగర కనెక్టివిటీ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చడమే కాకుండా, హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి మహానగరంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుందని, ఇది రాష్ట్ర సమగ్ర అభివృద్ధి పట్ల ప్రధాన మంత్రి దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివేంద్ర ప్రతాప్, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు,ప్రాయోజిత పధకాల సమన్వయ ప్రత్యేక కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) ప్రతినిధి కేవీబీ. రెడ్డి, సీఎఫ్‌వో ఏవీఆర్. శ్రీనివాస శర్మతో పాటు ఐఆర్ఎఫ్‌సీ, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

20 ఏండ్ల కాలపరిమితి..

రూ.13,600 కోట్ల రుణ సౌకర్యాన్ని నాన్ కన్వర్టిబుల్ డిబెంచర్లు, కమర్షియల్ పేపర్లు మరియు వర్కింగ్ కాపిటల్ రీఫైనాన్సింగ్‌ వంటి రుణ అవసరాలకు వినియోగించనున్నారు. దీని ద్వారా ప్రస్తుత రుణదాతలకు క్రమబద్ధమైన ఎగ్జిట్ లభించడంతో పాటు ప్రాజెక్టు ఆర్థిక స్థిరత్వం గణనీయంగా మెరుగుపడనుంది. ఈ రుణాన్ని 20 సంవత్సరాల కాలపరిమితితో, త్రైమాసిక చెల్లింపుల విధానంలో రూపొందించారు. అధిక వడ్డీ రుణాలను తక్కువ వ్యయంతో కూడిన దీర్ఘకాలిక రూపాయి ఫైనాన్సింగ్‌తో భర్తీ చేస్తున్నారు. ఈ లావాదేవీకి తెలంగాణ ప్రభుత్వ నిర్బంధ, కచ్చితమైన చెల్లింపు హామీ, రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ, ఆర్‌బీఐ మద్దతుతో డైరెక్ట్ డెబిట్ మాండేట్ వంటి బలమైన క్రెడిట్ ఎన్‌హాన్స్‌మెంట్ వ్యవస్థ మద్దతుగా నిలిచాయి. 69.2 కిలోమీటర్ల పొడవుతో మూడు కారిడార్లు, 57 స్టేషన్లతో నిర్మితమైన హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-1 దేశంలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో అభివృద్ధి చేసిన అతిపెద్ద మెట్రో ప్రాజెక్టుల్లో ఒకటి. ప్రస్తుతం ఈ నెట్‌వర్క్ ద్వారా రోజుకు 5 లక్షలకు పైగా ప్రయాణికులు సేవలు పొందుతున్నారు. ఈ రీఫైనాన్సింగ్ వల్ల హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ఆర్థిక సామర్థ్యం మరింత బలోపేతం కావడంతో పాటు కొత్త కారిడార్లు, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ, చివరి మైలు కనెక్టివిటీ వంటి విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేయడానికి అవకాశం కలుగుతుంది. హైదరాబాద్ మెట్రో భవిష్యత్ విస్తరణలకు బలమైన ఆర్థిక పునాది ఏర్పరచడంలో ఈ ఒప్పందం ఒక కీలక మైలురాయిగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. సుస్థిరమైన, సమర్థవంతమైన, పర్యావరణహిత ప్రజా రవాణా వ్యవస్థ నిర్మాణంలో ఇది ముఖ్యమైన ముందడుగుగా నిలవనుంది.

Next Story