ప్రభుత్వ సంస్థగా ‘హైదరాబాద్ మెట్రో’.. పట్టాలెక్కిన టేకోవర్ ప్రక్రియ

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-25 01:34:42  IST  )

హైదరాబాద్ మెట్రో రైలు ఇకపై పూర్తి ప్రభుత్వ సంస్థగా రూపాంతరం చెందింది. మే 1 నుంచి ఎల్ అండ్ టీ వాటాను రూ. 15,000 కోట్లతో కొనుగోలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ సంస్థగా ‘హైదరాబాద్ మెట్రో’.. పట్టాలెక్కిన టేకోవర్ ప్రక్రియ
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టులో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. పదేళ్లకు పైగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో సేవలందించిన మెట్రో రైలు తొలి దశ ప్రాజెక్టు ఇకపై పూర్తిస్థాయి ప్రభుత్వ సంస్థగా అవతరించనుంది. మెట్రోను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్‌లో ఎల్ అండ్ టీ సంస్థకు ఉన్న వంద శాతం ఈక్విటీ వాటాను ప్రభుత్వం కొనుగోలు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భారీ కొనుగోలు ప్రక్రియకు మొత్తం రూ.15వేల కోట్ల విలువను ఖరారు చేస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 30వ తేదీతో ప్రైవేటు భాగస్వామ్య శకానికి స్వస్తి పలికి మే 1వ తేదీ నుంచి మెట్రో రైలును ప్రభుత్వ రంగ సంస్థగా మార్చడానికి రంగం సిద్ధమైంది.

నిధుల సమీకరణకు పక్కా ప్రణాళిక

నిధుల సమీకరణపై ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఏప్రిల్ 30వ తేదీ నాటికి ఉన్న అప్పుల సర్దుబాటు కోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) నుంచి రూ.13,615 కోట్ల రుణాన్ని సేకరించడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ రుణానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి గ్యారంటీ ఇవ్వడమే కాకుండా మెట్రో రాబడి ద్వారా అప్పు తీరని పక్షంలో ప్రభుత్వం నుంచి నేరుగా నగదు మళ్లించేలా ఆర్బీఐకి ‘డైరెక్ట్ డెబిట్ మాండేట్’ ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ రుణాన్ని 20 ఏళ్ల కాల పరిమితిలో మెట్రో తన సొంత ఆదాయం ద్వారా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు, ఈక్విటీ వాటా కొనుగోలు కోసం చెల్లించాల్సిన సుమారు రూ.1,385 కోట్లను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ద్వారా సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తం డీల్ విలువలో ఈక్విటీ వాటా రూ.2వేల కోట్లలోపే ఉన్నందున కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అనుమతి లేకుండానే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సబ్ కమిటీ నిర్ణయాలు..

మెట్రో స్వాధీన ప్రక్రియలో బకాయిలు, బాధ్యతలపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకున్నది. మెట్రో స్వాధీన ప్రక్రియలో భాగంగా గతంలో ఉన్న బకాయిలు, న్యాయపరమైన చిక్కులపై కేబినెట్ సబ్ కమిటీ కీలకమైన సిఫార్సులు చేసింది. ప్రాజెక్టుకు సంబంధించి ఎల్ అండ్ టీ సంస్థ స్టాంపులు-రిజిస్ట్రేషన్ శాఖకు చెల్లించాల్సిన రూ.123.95 కోట్లు, లేబర్ సెస్ కింద కట్టాల్సిన రూ.163.74 కోట్లు, విద్యుత్ టారిఫ్ బకాయిలు రూ.15.38 కోట్లు, జీహెచ్‌ఎంసీకి చెల్లించాల్సిన అడ్వర్‌టైజ్‌మెంట్ ట్యాక్స్ రూ.75.12 కోట్ల బాధ్యతను ఎల్ అండ్ టీ సంస్థే భరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, భూమి యజమాని ప్రభుత్వమే కాబట్టి, జీహెచ్‌ఎంసీకి చెల్లించాల్సిన ఆస్తి పన్ను బకాయిల నుంచి మాత్రం ఎల్ అండ్ టీకి మినహాయింపు కల్పించాలని నిర్ణయించింది. గతంలో ఎల్ అండ్ టీ మెట్రోకు ఇచ్చిన రూ.900 కోట్ల వడ్డీ లేని రుణాన్ని కొనుగోలు ధర నుంచి మినహాయించకుండా, దానిని అలాగే కొనసాగించాలని నిర్ణయించారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న వివిధ కేసుల్లో ఎల్ అండ్ టీ మెట్రో తరఫున వాదించేందుకు ఆ సంస్థకు ప్రత్యేక పవర్ ఆఫ్ అటార్నీని కూడా ప్రభుత్వం కల్పించింది.

115మంది కొనసాగింపు

ఉద్యోగుల భవితవ్యం.. నిర్వహణలో అనుభవజ్ఞుల సాయం మెట్రో స్వాధీనం తర్వాత కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం మానవ వనరుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంది. ప్రస్తుతం ఎల్ అండ్ టీ మెట్రోలో పనిచేస్తున్న 115 మంది ఉద్యోగులను ఏడాది పాటు ప్రభుత్వమే కొనసాగించనుంది. వీరి వేతనాల కోసం ఏడాదికి సుమారు రూ.24.3 కోట్లు ఖర్చు చేయనున్నారు. వీటితో పాటు, మెట్రో నిర్వహణ, సాంకేతిక అంశాల్లో ఎల్ అండ్ టీకి ఉన్న అనుభవాన్ని వినియోగించుకోవడానికి ఆ సంస్థకు చెందిన ఏడుగురు ఉన్నత స్థాయి అధికారుల సేవలను ఆరు నెలల పాటు ‘అడ్వైజరీ’ హోదాలో కొనసాగించనున్నారు. ఈ అధికారులకు అయ్యే ఖర్చును ఎల్ అండ్ టీ సంస్థే భరించడం గమనార్హం.

మే1 నుంచి సరికొత్త ప్రయాణం

ఈ నెలాఖరులోగా (ఏప్రిల్ 30) షేర్ పర్చేస్ అగ్రిమెంట్‌తో పాటు ఐఆర్ఎఫ్సీతో త్రైపాక్షిక ఒప్పందాన్ని పూర్తి చేయాలని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు అవసరమైన పత్రాలపై సంతకాలు చేసేందుకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి అధికారాలు కల్పించింది. మే 1 నుంచి మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో ప్రభుత్వ నియంత్రణలోకి వస్తుంది. ఈ చారిత్రాత్మక నిర్ణయం వల్ల మెట్రో ఛార్జీల నియంత్రణపై ప్రభుత్వానికి పూర్తి అధికారం దక్కనుంది. అలాగే, ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో రెండో దశ విస్తరణ పనులకు ఈ స్వాధీన ప్రక్రియ ఇంధనంగా మారుతుందని, నిధుల సేకరణ, నిర్ణయాల అమలులో వేగం పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. పీపీపీ పద్ధతి నుంచి ప్రభుత్వ రంగ సంస్థగా మారిన మెట్రో, ఇకపై నగరవాసులకు మరింత మెరుగైన, చౌకైన రవాణా సదుపాయాలను అందిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఈ స్వాధీనానికి సంబంధించిన మరిన్ని సాంకేతిక లాంఛనాలు పూర్తి కానున్నాయి.

Next Story