- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బృహత్ హైదరాబాద్‌గా మారనున్న భాగ్యనగరం.. టార్గెట్ 60 రోజులు
జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనం ప్రక్రియను వేగవంతం చేసేందుకు మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనం ప్రక్రియను వేగవంతం చేసేందుకు మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తోంది. అయితే జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు ముగియడానికి ఇంకా 76 రోజులు ఉంది. ఈ నేపథ్యంలో విలీన ప్రక్రియను పూర్తి చేయడానికి సుమారు 60 రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే 2007లో జీహెచ్ఎంసీ ఏర్పాటు సమయంలో చేసినట్టుగానే గడ్డి అన్నారం మున్సిపాలిటీని ఎల్బీ నగర్ మున్సిపాలిటీలో విలీనం ఒక సర్కిల్ చేశారు. మిగిలినవాటన్నింటిని సర్కిల్‌గా మార్చారు. అదే తరహాలో ఈ సారి సైతం 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను మార్పులు చేసి సర్కిళ్లుగా ఏర్పాటు చేయనున్నారు.
పరిరక్షణ బాధ్యత హైడ్రాకు
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) పరిధిలో చెరువులు, భూముల పరిరక్షణ బాధ్యతను హైడ్రాకు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే 19 జులై 2024లో హైడ్రా ఏర్పాటు సందర్భంగా విస్తీర్ణం, పెరుగుతున్న జనాభా గురించి ఓ నివేదిక తయారు చేశారు. దాని ఆధారంగా 2021 వరకు 2053 చదరపు కిలోమీటర్ల పరిధిలో 1.29 కోట్ల జనాభా ఉంది. ఈ ఏరియాలో జీహెచ్ఎంసీతోపాటు మరో ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలు, కంటోన్‌మెంట్ బోర్డు ఏరియా, 33 గ్రామపంచాయతీలు, 61 ఇండిస్ట్రీయల్ ఏరియా లోకల్ అథారిటీలు ఉన్నాయి. ఈ ఏరియాను జీహెచ్ఎంసీలో విలీనం చేశారు.
27 మున్సిపాలిటీల్లో 10,92,514 జనాభా
జీహెచ్ఎంసీలో విలీనం చేసిన 27 మున్సిపాలిటీల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం 10,92,514 జనాభా ఉంది. వీటిలో 621 వార్డులు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలు 1,31,224 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి. వీటితోపాటు 51 గ్రామాలను సైతం సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేసిన విషయం తెలిసిందే. అయితే గ్రామాలను విలీనం చేసిన తర్వాత వార్డుల పునర్విభజన జరగలేదు. జరిగితే మరో 20 వార్డులు పెరిగే అవకాశముంది.
బృహత్ హైదరాబాద్‌లో 50 సర్కిళ్లు
జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలను విలీనం చేసిన తర్వాత హైదరాబాద్... బృహత్ హైదరాబాద్‌గా మారింది. జీహెచ్ఎంసీలో ఆరు జోన్లు, 30 సర్కిళ్ల మాదిరిగానే 27 మున్సిపాలిటీల పరిధిని 20 సర్కిళ్లు, నాలుగు జోన్లుగా మార్చాలనే కసరత్తు జరుగుతోంది. దీంతో 10 జోన్లు.. 50 సర్కిళ్లుగా మారే అవకాశముంది. అయితే 27 మున్సిపాలిటీల్లో వార్డుల్లో జనాభాలో చాలా వ్యత్యాసం ఉన్నది. అన్నింటిలో ఒకే స్థాయి జనాభా ఉండేవిధంగా మార్పులు చేయనున్నారు. దీంతోపాటు బృహత్ హైదరాబాద్‌గా మార్చి 200 వార్డులుగా విభజించనున్నారు. ఒక్కో సర్కిల్‌కు నాలుగు వార్డులు, ఒక్కో జోన్‌కు ఐదు సర్కిళ్లు ఉండేలా కసరత్తు ప్రారంభించనున్నారు.
60 రోజుల్లో ప్రక్రియ
జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీన ప్రక్రియను పూర్తి చేయడానికి సుమారు 60 రోజులు పట్టే అవకాశముంది. ముఖ్యంగా ఇంజినీరింగ్ పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాల్సి ఉంటుంది. మున్సిపాలిటీ పరిధిలో ఓపెన్ ల్యాండ్స్, ప్రభుత్వ భూములను గుర్తించడంతోపాటు ఏమైనా వివాదాలు ఉంటే వాటిని పంచనామా చేయాల్సి ఉంటుంది. ఏ మున్సిపాలిటీలో ఎన్ని ప్రాపర్టీ టాక్స్ అసెస్‌మెంట్స్ ఉన్నాయి? ఎంత ఆస్తి పన్ను వసూలవుతోంది? వార్డు ఆఫీసులు, మున్సిపాలిటీలకు సంబంధించిన ఆఫీసులు, పార్కులు, ఇతర ఆస్తులను గుర్తించి వాటికి సంబంధించిన రికార్డులను జీహెచ్ఎంసీకి మున్సిపల్ శాఖ అందజేయాల్సి ఉంటుంది. రికార్డులను ఇచ్చిపుచ్చుకున్నట్టు రశీదులను సైతం పరస్పరం అందజేసుకోవాల్సి ఉంటుందని జీహెచ్ఎంసీ ఓ సీనియర్ అధికారి తెలిపారు.






