- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాంకీ రాక.. కార్మికుల పోక: ట్రై కార్పొరేషన్లలో ముదిరిన 'చెత్త' పంచాయితీ
హైదరాబాద్ పరిధిలో కొత్తగా ఏర్పడిన మూడు కార్పొరేషన్లలో చెత్త పంచాయితీ ముదిరింది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర దుమారం రేగుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మహానగరంలో పారిశుధ్య నిర్వహణ ఒక్కసారిగా రణరంగంగా మారింది. కొత్తగా ఏర్పడిన ట్రై కార్పొరేషన్ల (జీ హెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్‌గిరి) పరిధిలో ‘చెత్త’ పంచాయితీ ముదిరి పాకాన పడింది. నగరంలో ఇంటింటి నుంచి చెత్తను సేకరించే స్వచ్ఛ ఆటోలను ప్రైవేటు సంస్థ ‘రాంకీ’ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ శుక్రవారం వేలాది మంది స్వచ్ఛ ఆటో కార్మికులు జీహెచ్‌ఎంసీ హెడ్ ఆఫీసును ముట్టడించారు. రాంకీ సంస్థతో కలిసి పనిచేయడం తమకు సాధ్యం కాదని, తమను స్వతంత్రంగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ ఆఫీసు గేట్లను దిగ్బంధించారు. దీంతో నగరవ్యాప్తంగా చెత్త సేకరణ ప్రక్రియ స్తంబించిపోయింది.
రాంకీ పెత్తనం మాకొద్దు
దశాబ్ద కాలంగా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న తమను, ఇప్పుడు కార్పొరేట్ సంస్థ చేతుల్లో పెట్టడం ఏమిటని స్వచ్ఛ ఆటో కార్మికులు ప్రశ్నిస్తున్నారు. రాంకీ సంస్థ పరిధిలోకి వెళ్తే తమ జీవనోపాధి దెబ్బతినడమే కాకుండా, పని ఒత్తిడి పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ముట్టడితో లోయర్ ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోయింది.
కమిషనర్ల అత్యవసర భేటీ
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ.కర్ణన్, సీఎంసీ కమిషనర్ జి.సృజన, ఎంఎంసీ కమిషనర్ ఎం.వినయ్ కృష్ణారెడ్డి అత్యవసరంగా సమావేశమయ్యారు. ఒకవైపు ప్రభుత్వం రాంకీ ద్వారా ఆధునిక పారిశుధ్యం కావాలని కోరుతుండగా, మరోవైపు క్షేత్రస్థాయిలో కార్మికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకత అధికారులకు తలనొప్పిగా మారింది. పారిశుధ్యం ఆగిపోతే ప్రజల నుంచి వచ్చే ఆగ్రహాన్ని తట్టుకోవడం కష్టమని కమిషనర్లు భావిస్తున్నారు.
స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులు సహకరించాలి : ట్రై కార్పొరేషన్ల కమిషనర్లు
గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులు పూర్తి సహకారం అందించాలని ట్రై కార్పొరేషన్ల కమిషనర్లు ఆర్వీ కర్ణన్, జి.సృజన, టి.వినయ్ కృష్ణారెడ్డి సంయుక్తంగా కోరారు. శుక్రవారం సాయంత్రం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో స్వచ్ఛ ఆటోల డ్రైవర్లు, కార్మికులతో ట్రై కార్పొరేషన్ల కమిషనర్లు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్వచ్ఛ ఆటో టిప్పర్ పారిశుధ్య కార్మికులు సమస్యలను, విజ్ఞప్తులను విన్నారు. ఈ సందర్భంగా ముగ్గురు కమిషనర్లు మాట్లాడుతూ.. క్యూర్ పరిధిలోని ట్రై కార్పొరేషన్లలో శానిటేషన్‌ను మరింత మెరుగుపరచాలని స్పష్టం చేశారు. రోడ్లకు ఇరువైపుల, కాలనీలలో చెత్త కనిపించకూడదని సీఎం ఆదేశించారని చెప్పారు. స్వచ్ఛ ఆటో కార్మి కుల సహకారం లేకుండా ఇది సాధ్యం కాదని కమిషనర్లు పేర్కొన్నారు. క్యూర్ పరిధిలోని ట్రై కార్పొరేషన్ పరిధిలో త్వరలో అమలు చేయనున్న100 రోజుల కార్యాచరణలో ప్రణాళిక అమలులో శానిటేషన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఉందన్నారు. స్వచ్ఛ ఆటోకు కేటాయించిన ఏరియాలో ప్రతి ఇంటి నుంచి 100 శాతం చెత్త సేకరణ చేయాలన్నారు. కార్మికులకు ప్రమాదం జరిగితే ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామన్నారు. ఉద్యోగ భద్రతకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో శానిటేషన్ అదనపు కమిషనర్లు రఘు ప్రసాద్, రవి కిరణ్ యాదగిరిరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ పద్మజ పాల్గొన్నారు.






