పాలన మీ వద్దకే! వాట్సాప్‌లో ప్రజావాణి దరఖాస్తులు.. హైదరాబాద్ కలెక్టర్ ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |

హైదరాబాద్ నగరంలో ప్రజావాణి దరఖాస్తుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

పాలన మీ వద్దకే! వాట్సాప్‌లో ప్రజావాణి దరఖాస్తులు.. హైదరాబాద్ కలెక్టర్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో ప్రజావాణి (Prajavani) దరఖాస్తుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు (Hyderabad Collector) హైదరాబాద్ కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం ప్రజావాణికి అంతా నేరుగా వచ్చి ఫిర్యాదులు చేసేవారు. అయితే ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు నేటి నుంచి వాట్సాప్ ద్వారా ప్రజావాణికి అర్జీలు పెట్టుకునే అవకాశం కల్పించారు. ఈ మేరకు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన (Harichandana) సోమవారం అధికారిక ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. హైదరాబాద్ పౌరులారా.. ఇప్పుడు పాలన మీ దగ్గరికి వస్తోందని పేర్కొన్నారు. కలెక్టరేట్‌కు రాకుండ ఫిర్యాదులను వాట్సప్ ద్వారా సెండ్ చేయవచ్చని తెలిపారు. 7416687878 నంబర్‌కు ఫిర్యాదులను చేయోచ్చని స్పష్టం చేశారు.

ఈ వాట్సప్ నెంబర్‌కు ఫిర్యాదు చేస్తే వాటిని సంబంధిత సిబ్బంది మానిటరింగ్ చేసి.. ప్రత్యేకంగా నిర్వహిస్తున్న పోర్టల్ లో ఫిర్యాదు చేసిన వారికి ఐడీ నెంబర్ కేటాయిస్తారు. వారంలోపు ఆ ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలు సమాచారం అంతా వాట్సప్ ద్వారా తెలియజేస్తారు. అయితే, సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు, ప్రైవేటు ఉద్యోగులు తదితరులు ప్రజావాణికి రాలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సూచనల మేరకు హైదరాబాద్ కలెక్టర్ ఈ వాట్సప్ ఫిర్యాదుల నిర్ణయం తీసుకున్నారు. ఇక, కలెక్టరేట్‌కు డైరెక్ట్‌గా వచ్చే ఫిర్యాదులతో సమానంగానే ఈ వాట్సప్ అర్జీలను కూడా ఒకే ప్రాధాన్యత ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Next Story