TG: మెడికల్ టూరిజం హబ్‌గా హైదరాబాద్

by Gantepaka Srikanth |

నేడు హైదరాబాద్ మెడికల్ టూరిజం హబ్‌గా ఎదగడంలో అపోలో కీలక పాత్ర పోషించిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.

TG: మెడికల్ టూరిజం హబ్‌గా హైదరాబాద్
X

దిశ, తెలంగాణ బ్యూరో: నేడు హైదరాబాద్ మెడికల్ టూరిజం హబ్‌గా ఎదగడంలో అపోలో కీలక పాత్ర పోషించిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ దేశవ్యాప్తంగా 75 బ్రాంచ్‌లు, 10,400కు పైగా పడకలతో సేవలందిస్తోందని... ఇప్పుడు 76వ బ్రాంచ్‌గా హాస్పిటల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ప్రారంభం కావడం నిజంగా అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి యూనిఫైడ్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సృష్టించే దిశగా తెలంగాణ ముందడుగు వేసిందని మంత్రి తెలిపారు. ప్రతి పౌరుని డిజిటల్ హెల్త్ ప్రొఫైలింగ్ చేపడుతున్నామని అన్నారు. దేశంలో తొలిసారిగా 46 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళల డిజిటల్ హెల్త్ ప్రొఫైలింగ్ చేపడుతున్నామని తెలిపారు. దీని ద్వారా మహిళల ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు తీసుకోగలుగుతామని వెల్లడించారు.

హైదరాబాద్ నేడు దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా మెడికల్ టూరిజం హబ్‌గా ఎదిగిందన్నారు. ఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ప్రపంచ స్థాయి ఆసుపత్రులు, నైపుణ్యం కలిగిన వైద్యులు కలిసి తెలంగాణను ఆరోగ్య రంగంలో ముందంజలో నిలిపాయని తెలిపారు. మెడికల్ టూరిజం పాలసీ ద్వారా అంతర్జాతీయ రోగులకు ఒకే వేదికపై ఆసుపత్రులు, వైద్యులు, చికిత్స సమాచారం, ప్రయాణ సౌకర్యాలు అందించే విధంగా వ్యవస్థను రూపొందిస్తున్నామని... ప్రత్యేక మెడికల్ టూరిజం సొసైటీ, మెడికల్ వాల్యూ ట్రావెల్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ దోపిడీకి గురికాకూడదని... అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించాలని... ప్రజలు వైద్యం కోసం అప్పుల పాలవ్వకూడదని ప్రైవేటు హాస్పిటల్స్ కు హితవు పలికారు. అపోలో హాస్పిటల్స్ కూడా ఈ విలువలను నిలబెట్టుకుంటూ ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపక చైర్మన్ డా. ప్రతాప్ సి రెడ్డి, డా. సంగీతా రెడ్డి, శోభనా కామినేని, ఉపాసన కొణిదెల, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story