హైదరాబాదులో ఊపిరాడని వాతావరణం

by Bhanu |

వాయు కాలుష్యం గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజురోజుకు దీని ప్రభావం పెరిగిపోవడం అందరిని ఆందోళనలకు

హైదరాబాదులో ఊపిరాడని వాతావరణం
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : వాయు కాలుష్యం గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజురోజుకు దీని ప్రభావం పెరిగిపోవడం అందరిని ఆందోళనలకు గురి చేస్తోంది. ఐదేళ్ల క్రితం కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్ల సమయంలో రికార్డు స్థాయిలో వాయు కాలుష్యం తగ్గగా ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. గ్రేటర్‌లో వాయు కాలుష్యం ఢిల్లీతో పోటీ పడుతుండగా దక్షిణ భారతంలోని ప్రధాన నగరాలలో మొదటగా నిలిచింది. గ్రీన్ పీస్ ఇండయా అనే సంస్థ గతంలో జరిపిన అధ్యయనంలో అనేక కఠోర వాస్తవాలు వెలుగుచూశాయి. వాయు కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోంది. దీనికి కారణం మోటారు వాహనాలు వెదజల్లుతున్న పొగలే అని గుర్తించారు. వాహనాల నుంచి వెలువడే నైట్రోజన్‌ డయాక్సైడ్‌ పెద్ద మొత్తంలో వెలువడుతున్నట్లు నిపుణులు వెల్లడించారు.

జబ్బుల భారిన ప్రజలు..

హైదరాబాద్‌‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో గాలి నాణ్యత రోజురోజుకు క్షీణిస్తోంది. ఫలితంగా ప్రజలు పలు రకాల జబ్బుల భారిన పడుతున్నారు. నగరంలో కొద్ది రోజులుగా వాయు కాలుష్యం స్థాయి పెరుగుతూ వస్తోంది. వర్షాకాలంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ వాయు కాలుష్య ప్రభావం మాత్రం పెరుగుతూ వస్తోంది. ఇదిలాగే కొనసాగితే రాబోయే చలికాలంలో నగర ప్రజలు ఆరోగ్యంపై పెను ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదు. నవంబర్ నుంచి జనవరి మధ్య కాలంలో ఉష్ణోగ్రతలు పడిపోతాయి, ఇలాంటి పరిస్థితుల్లో గాలి నాణ్యత మరింత క్షిణిస్తుంది, ఈ ప్రభావం పిల్లలు, వృద్ధులు, ఆస్తమా, గుండె జబ్బులు ఉన్నవారిపై ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నగరవాసులను ఇప్పడు ఈ భయం వెంటాడుతోంది.

రోజురోజుకు పెరుగుతున్న వాహనాలతోనే..

నగరంలో ఇటీవల కాలంలో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. వాహనాల నుంచి వెలువడే నైట్రోజన్ డయాక్సిడ్‌తో వాయుకాలుష్యం తీవ్రరూపం దాలుస్తూ ప్రజల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతోంది. మరోవైపు రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో కూడా అతిసూక్ష్మ ధూళికణాలు పరిమితికి మించి నమోదవుతున్నాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) ప్రమాణాల ప్రకారం గాలిలో 40 మైక్రో గ్రాములు మించకూడదు. కానీ పరిస్థితులు అందుకు బిన్నంగా ఉన్నాయి. రవాణా శాఖ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలు ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చడంపై దృష్టిసారించడం లేదని నగరవాసులు మండిపడుతున్నారు. వాయు కాలుష్యం మానవాళి మనుగడకు తీవ్ర ప్రమాదమని తెలిసినా, దాని నియంత్రణ చర్యలు నామమాత్రంగానే ఉన్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

తగ్గుతున్న గాలి నాణ్యత..

కాలుష్య భూతం కోరల్లో చిక్కుకుని హైదరాబాద్ నగరం విలవిలలాడుతోంది. రోజు రోజుకూ నగరంలో వాయు కాలుష్యం పెరిగిపోయి గాలిలో నాణ్యత తగ్గిపోతోండగా దక్షిణ భారత దేశంలోనే అతి ప్రమాదకరమై స్థాయిలో వాయు కాలుష్య నగరాలలో భాగ్యనగరం ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక్కడ నివాసముంటున్న ప్రజలు ప్రతి రోజు కాలుష్యమైన గాలి పీలుస్తూ అనారోగ్యానికి గురౌతున్నారు. గ్రీన్ పీస్ ఇండియా అనే సంస్థ గతంలో 365 రోజుల పాటు హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యంపై అధ్యయనం చేసి భాగ్యనగరంలో గాలి ఎంత ప్రమాదకరంగా మారిందనేది ప్రకటించింది. నెల వారిగా సగటు 2.5 యూజీ/ఎం3 ఉండాల్సి ఉండగా 40 యూజీ/ఎం3కు పైగా నమోదౌతుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో గడువు తీరి పొగలు గక్కుతున్న వాహనాలను రోడ్ల మీదకు రానీయకుండా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలను నగర ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

Next Story