- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైడ్రా ఆధ్వర్యంలో పక్కాగా వర్ష సమాచారం
వర్షానికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చేందుకు హైడ్రా ప్రయత్నిస్తోంది. ఇందుకు గాను వివిధ శాఖలకు చెందిన విభాగాలతో సమన్వయం కుదుర్చుకునే పనిలో నిమగ్నమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: వర్షానికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చేందుకు హైడ్రా ప్రయత్నిస్తోంది. ఇందుకు గాను వివిధ శాఖలకు చెందిన విభాగాలతో సమన్వయం కుదుర్చుకునే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో పట్టణ ప్రాంతాల్లో వాతావరణ అంచనా, పర్యవేక్షణ అనే అంశంపై శనివారం ఓ సదస్సును నిర్వహించింది. వర్షానికి సంబంధించి సరైన సమాచారం ముందుగానే నగర ప్రజలకు అందించడానికి అనుసరించాల్సిన పద్ధతులపై చర్చించింది. ఎంత మొత్తంలో, ఏఏ ప్రాంతాల్లో, ఎప్పుడు వర్షం పడుతోంది అనే కచ్చితమైన సమాచారం నగర ప్రజలకు చేరవేయాల్సిన అవసరాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ నొక్కి చెప్పారు. ఇందుకు అనుసరించాల్సిన పద్ధతులపై వివిధ శాఖలు, విభాగాలకు చెందిన నిపుణులు కలసి పని చేయాల్సినవసరం ఉందన్నారు. వర్షానికి సంబంధించిన కచ్చితమైన సమాచారం ఇవ్వగలిగితే.. నగరంలో ట్రాఫిక్ సమస్యను కొంతమేర తగ్గించవచ్చునని అన్నారు.
వివిధ విభాగాలతో వర్కింగ్ గ్రూప్..
హైడ్రా, వాతావరణ శాఖ(ఐఎండీ), తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్, తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి ఒక వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ నిర్ణయించారు. ఈ విభాగాలన్నీ సమన్వయంతో పని చేసి వర్షాన్ని అంచనా వేయడంతో పాటు.. తర్వాత జరిగే పరిణామాలను ఎదుర్కొనేందుకు యంత్రాంగాన్ని సన్నద్ధం చేనున్నట్టు అధికారులు చెబుతున్నారు. నగరంలో దాదాపు 157 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లున్నాయని.. వీటి సంఖ్యను పెంచుకోవాల్సి ఉందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను ఇందుకు వేదికలు చేసుకోవాలని సూచించారు. గాలుల తీవ్రతను కూడా అంచనా వేయాల్సినవసరం ఉందన్నారు. ఒక చదరపు కిలోమీటరు పరిధిలో ఒక సెంటీమీటర్ వర్షం పడితే 9.96 మిలియన్ లీటర్ల నీరు అందుబాటులోకి వస్తుందని.. ఆ నీరు ఎంత మేర భూమిలోకి ఇంకుతుందో చూసుకుని వరదను అంచనా వేయవచ్చునని ఐఎండీ రిటైర్డ్ డీజీ డా. కేజే రమేష్ అన్నారు. హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య, రీజనల్ ఫైర్ ఆఫీసర్ జయప్రకాష్, ఐఎండీ తెలంగాణ డైరెక్టర్ నాగరత్న, టీజీడీపీఎస్ కన్సల్టెంట్ రామారావు, ఐఎండీ నుంచి శ్రీధర్, ఎన్ఆర్ఎస్సీ కి చెందిన నరేంద్ర, సురేంద్రబాబు, ఇన్‌కాయీస్ డా. ప్రసాద్, ఐఐటీ ప్రొఫెసర్ సతీష్, వెదర్ మ్యాన్ బాలాజీ తదితరులు ఈ సదస్సులో పాల్గొని పలు సూచనలు చేశారు.






