- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూసీ పునరుజ్జీవనానికి తొలగిన చిక్కులు: రూ.4,100 కోట్ల రుణంపై ADB ఆరా!
మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు కోసం ఏడీబీ (ADB) రూ.4,100 కోట్ల రుణం అందించేందుకు సిద్ధమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: మూసీ నది పునరుజ్జీవం, అభివృద్ధి హాట్ టాపిక్‌గా మారింది. ఎన్ని అడ్డంకులొచ్చినా ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం.. పేదలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని ప్రతిపక్ష పార్టీల ప్రకటనలు సైతం చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం డిప్యూటీ సీఎం అధ్యక్షతన ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. మూసీ ప్రాజెక్టును ప్రజాస్వామ్య పద్ధతిలోనే చేపడతామని, సలహాలు, సూచనలు స్వీకరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టుకు రుణం ఇవ్వనున్న ఏడీబీ బ్యాంకు ప్రతినిధులు పునరుజ్జీవన ప్రాజెక్టుకు సంబంధించిన పూర్వాపరాలతో పాటు సాధ్యాసాధ్యాలు, సవాళ్లపై భాగస్వామ్య శాఖలతో చర్చించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అందులో భాగంగానే మంగళవారం హైడ్రా అధికారులతో ఏడీబీ ప్రతినిధులు సమావేశమయ్యారు. మిగిలిన శాఖల అధికారులతోనూ సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి.
రూ.4,100 కోట్ల రుణం
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు రూ. 4,100 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. మొదట ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని భావించినా, కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ఏడీబీ నుంచి రుణం తీసుకోవాలని రాష్ట్రానికి సూచించింది. మూసీ ప్రాజెక్టు వివరాలను మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్‌డీసీఎల్) అధికారులు వారికి వివరించగా, పర్యావరణపరంగా ప్రాజెక్టు చేపడుతున్న నేపథ్యంలో నిధులిచ్చేందుకు అంగీకరించింది. నదికి ఇరువైపులా రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్లాన్లు రూపొందించిన ప్రభుత్వం.. వివిధ ప్రాంతాల నుంచి మూసీలోకి వచ్చి కలుస్తున్న వరద, మురుగునీటిని శుద్ధి చేయడానికి మూసీ పొడవునా ఆయా ప్రాంతాల్లో నిర్మించే ఎస్టీపీలకు పంపించనున్నారు. వీటన్నింటినీ ఏడీబీ ప్రతినిధులు పరిశీలించిన విషయం తెలిసిందే. మూసీ అభివృద్ధికి మొదటగా రూ. 7 వేల కోట్లతో అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ విషయాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
హైడ్రాతో సమావేశం
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో హైడ్రా పాత్రపై ఏడీబీ ప్రతినిధులు ఆరా తీశారు. అందులో భాగంగానే హైడ్రా కమిషనర్ రంగనాథ్, అధికారులతో మంగళవారం సమావేశమయ్యారు. హైడ్రా మొదటి విడత చేపట్టిన 6 చెరువుల పునరుద్ధరణతో పాటు.. రెండో విడత చేపట్టిన 14 చెరువుల గురించి ఏడీబీ ప్రతినిధులు లోతుగా చర్చించారు. మూసీ పునరుజ్జీవనంలో మీరేమైనా సూచనలు చేస్తారా అని హైడ్రా కమిషనర్‌ను ఏడీబీ ప్రతినిధులు కోరగా.. "నగరంలో చాలా చెరువులు మూసీకి అనుసంధానంగా ఉన్నాయి. ఈ చెరువుల పునరుద్ధరణతో మూసీ నదికి మంచినీరు చేరేలా హైడ్రా చర్యలు తీసుకుంటోంది. హైడ్రా అభివృద్ధి చేసిన ప్రతి చెరువు వద్ద ఎస్టీపీ ఏర్పాటు చేసి మురుగునీటిని ఎక్కడికక్కడ శుభ్రం చేస్తే.. ఆ భారమంతా మూసీ మీద పడకుండా జాగ్రత్త పడినట్లు అవుతుంది" అని వివరించారు. మూసీ ఎగువ భాగంలో వచ్చే వరదను కట్టడి చేయడానికి ఉస్మాన్ సాగర్ నిర్మాణం ఎలా ఉపయోగపడిందో, నగరంలోని గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణతో వరద ముప్పును అంతగా తగ్గించవచ్చని.. హైడ్రా ఆ దిశగా పని చేస్తోందని తెలిపారు. పార్కులు, ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలు, చెరువులు, నాలాల ఆక్రమణలు తొలగించడం పర్యావరణానికి దోహదపడే అంశాలని పేర్కొన్నారు. చెరువులు, నాలాల ఆక్రమణలతో కలిగే వరద ముప్పును హైడ్రా కమిషనర్ ఈ సందర్భంగా ఏడీబీ ప్రతినిధులకు చూపించారు. భూగర్భ జలాల వృద్ధికి చెరువుల పునరుద్ధరణ దోహదపడుతుందన్నారు.
ఇతర శాఖలతో..
మూసీ పునరుజ్జీవనంలో భాగస్వామ్య శాఖలతో ఏడీబీ ప్రతినిధులు సమావేశమవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే హైడ్రాతో సమావేశమైన ప్రతినిధులు త్వరలోనే జీహెచ్‌ఎంసీ, జలమండలి, హెచ్‌ఎండీఏ, నీటిపారుదల శాఖ అధికారులతోనూ సమావేశం కానున్నట్లు సమాచారం. ప్రాజెక్టులో చేపట్టే కార్యక్రమాల గురించి చర్చించనున్నారు. ఈ సంప్రదింపుల తర్వాత నిధులు విడుదల చేసే అవకాశముంది.






