- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘స్లాటర్’ ఆదాయానికి భారీగా గండి: పెరిగిన మాంసం విక్రయాలు.. తగ్గిన ఇన్‌కం!
మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల ఆధునిక కబేళాలో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: స్లాటర్ హౌస్‌ల ఆదాయానికి అక్రమార్కులు గండికొడుతున్నారు. రాష్ట్రంలో మాంసం వినియోగం పెరుగుతుండగా.. రాబడి మాత్రం ఆదాయం తగ్గిపోతున్నది. ఈ శాఖపై ఎవరూ పెద్దగా దృష్టిపెట్టరన్న ఉద్దేశమే ఏమోగానీ గతం కంటే తక్కువగా ఆదాయాన్ని చూపిస్తుండటం విశేషం. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలోని ఆధునిక స్లాటర్ హౌస్ లో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వ్యవహారంపై అర్బన్ డెవలప్ మెంట్ ఫోరం కన్వీనర్ ఎం.శ్రీనివాస్పశు సంవర్థకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఆధునిక స్లాటర్ హౌస్ నిర్వహణను కాంట్రాక్ట్ ఏజెన్సీ నుంచి తొలగించి 2025 జనవరి నుంచి ప్రభుత్వ యంత్రాంగమే చేపట్టింది. నిర్వహణ ఏజెన్సీ ఎంపిక కోసం కొత్తగా టెండర్లు పిలవాలని నిర్ణయించింది. ఏడాదిన్నర కాలం గడిచినప్పటికీ కొత్త టెండర్ ప్రక్రియ చేపట్టలేదు. స్లాటర్ హౌస్ నుంచి వచ్చే ఆదాయం కూడా గతంలో కాంట్రాక్టు ఏజెన్సీ కంటే అతితక్కువగా మాత్రమే ప్రభుత్వానికి అందుతున్నట్టు తెలిసింది.
వివరాలు గోప్యం..
2025 జనవరి నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఆదాయ వివరాలు తెలియజేయాలని సమాచార హక్కు చట్టం కింద అడిగితే ససేమిరా అంటున్నారు. అప్పీల్ కు వెళ్తే ఆడిట్ లో ఉన్నందున ఇవ్వలేమని కుంటిసాకులు చెబుతుండటం విశేషం. స్లాటర్ హౌస్ లో ప్రతిరోజూ ఎన్ని గొర్రెలు, మేకలను వధిస్తున్నారని అడిగితే సగటున 900 నుంచి 1000 అని సమాధానమిస్తున్నారు. గతంలో ప్రతిరోజు మూడు వేలు, ఆదివారం రోజు ఐదువేలకు పైగా స్లాటర్ అయ్యేవి. ప్రస్తుతం ఎందుకు ఇంత భారీసంఖ్యలో తగ్గిపోయాయి? తగ్గిపోవడం కంటే అధికారులు తగ్గించి చూపిస్తూ స్లాటరింగ్ ఫీజును భారీమొత్తంలో నొక్కేస్తున్నారు. ఈ అవినీతి బయటపడుతుందనే ఉద్దేశంతోనే ఆర్టీఐ కింద అడిగినా వివరాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. కాంటాక్ట్ ఏజెన్సీ ఏటా ఒక రూ.1.92 కోట్లు చెల్లించేది. ప్రస్తుతం అధికారులు చెప్పే లెక్కల ప్రకారం ఏటా రూ.కోటి రావడం లేదు. గతంలోని కాంట్రాక్టు ఏజెన్సీ తక్కువ మాత్రమే చెల్లిస్తుందని కొత్తగా టెండర్ వేస్తే ఏటా రూ.నాలుగు కోట్ల పైగా ఆదాయం వస్తుందని అంచనాతో ఇప్పటి వరకు ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ నిర్వహణలో ఆదాయం పెరగకపోగా భారీగా తగ్గింది.
అప్పట్లో ప్రవేటు వ్యక్తికి..
అప్పట్లో మేడ్చల్జిల్లా చెంగిచెర్లలోని ఆధునిక కబేళా నిర్వహణను టెండర్ ప్రక్రియ నిర్వహించకుండానే మహ్మద్ సలీం అండ్ కంపెనీకి నిరవధికంగా అప్పగించారు. నాటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ఆధీనంలోని తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ సంస్థ నిర్వాకం వల్ల రూ.కోట్లలో నష్టం వాటిల్లిందన ఆరోపణలు వచ్చాయి. 2018లోనే కాంట్రాక్ట్ పీరియడ్ ముగిసినా కొత్తగా టెండర్లు పిలవకుండా లీజు గడువును బోర్డు తీర్మానం మేరకు నిరవధికంగా పొడిగిస్తూ లేఖ నం.277/ఎంఏఎఫ్/టీఎస్ఎస్జీడీసీఎఫ్ఎల్/2015 ప్రకారం సంస్థ ఎండీ డాక్టర్ వి.లక్ష్మారెడ్డి ఆదేశాలు జారీచేశారు. చెంగిచెర్ల కబేళాను ఏటా కేవలం రూ.1.92 కోట్లు చెల్లించేలా లీజు ఒప్పందాన్ని పొడిగిస్తూ మహ్మద్ సలీం అండ్ కంపెనీకి అప్పగించారు. 70 ఎకరాల సువిశాల ప్రాంగణాన్ని మాంసం వ్యాపారం చేసే స్లాటర్ హౌస్ ను తక్కువ మొత్తానికే కట్టబెట్టడం మోసపూరిత నిర్ణయమన్న ఆరోపణలు వచ్చాయి. నగరంలో అతి తక్కువ విస్తీర్ణం, తక్కువ వ్యాపారం జరిగే న్యూ బోయిగూడ, అంబర్ పేట కబేళాల కంటే చెంగిచెర్ల కబేళాను తక్కువ మొత్తానికే కట్టబెట్టారు.
ఆదాయం ఇలా..
గతంలో ప్రైవేట్ కంపెనీ నుంచి 2008 జులై నుంచి 2009 మార్చి వరకు రూ.98.16 లక్షలు, 2009 నుంచి 2015 వరకు రూ.1.41 కోట్ల చొప్పున, 2016లో రూ.3.69 కోట్లు, 2017, 2018లో 1.92 కోట్ల వంతున, 2020 ఆగస్టు వరకు 96.18 లక్షలు అంటే మొత్తం రూ.21.27 కోట్లు చెల్లించింది. 70 ఎకరాల విస్తీర్ణం కలిగిన స్లాటర్ హౌస్ పేరిట ప్రభుత్వానికి 15 ఏళ్లలో నామమాత్రపు ఆదాయమే సమకూరిందన్న అభిప్రాయం ఉండేది. ఇప్పుడు రూ.కోటి వరకే రావడం వెనక ఉద్దేశం ఏమిటో అంతుచిక్కడం లేదన్న విమర్శలు వస్తున్నాయి..






