నగరవాసికి వల.. లక్షద్వీప్ ట్రిప్ పేరిట భారీ మోసం.. క్రూజ్ బుకింగ్ ఫేక్ వెబ్‌సైట్ బట్టబయలు

by Ramesh Naini |   (  Updated:2026-01-05 12:33:21  IST  )

విలాసవంతమైన క్రూజ్ షిప్‌లో షికారు చేయాలనుకున్న ఓ నగర వాసి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు.

నగరవాసికి వల.. లక్షద్వీప్ ట్రిప్ పేరిట భారీ మోసం.. క్రూజ్ బుకింగ్ ఫేక్ వెబ్‌సైట్ బట్టబయలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: విలాసవంతమైన క్రూజ్ షిప్‌లో షికారు చేయాలనుకున్న ఓ నగర వాసి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. కొచ్చి, లక్షద్వీప్‌, ముంబయి నగరాల మీదుగా సాగే క్రూజ్ ప్రయాణం కోసం ఆన్‌లైన్‌లో వెతికిన బాధితుడు.. చివరకు రూ.2,42,488 పోగొట్టుకున్నారు. హైదరాబాద్‌లోని కాచిగూడకు చెందిన ఓ వ్యక్తి డిసెంబరు 26, 2025న క్రూజ్ ప్యాకేజీల కోసం గూగుల్‌లో శోధించారు. అక్కడ కనిపించిన ఓ వెబ్‌సైట్‌ను నిజమైనదే అని నమ్మి, నలుగురు సభ్యుల ప్రయాణానికి బుకింగ్‌ చేసుకున్నారు. ఇందుకు గాను మొదట రూ.23,680 అడ్వాన్స్‌గా చెల్లించారు.

చివరకు పేమెంట్‌ ఫెయిల్ అయ్యిందంటూ..

బాధితుడు ఒకేసారి డబ్బు పంపలేకపోవడంతో, విడతల వారీగా పంపాలని సైబర్‌ కేటుగాళ్లు సూచించారు. ఆ తర్వాత అసలు మోసం మొదలైంది. లక్షద్వీప్‌ వెళ్లాలంటే ప్రత్యేక పర్మిట్‌ లెటర్లు కావాలని, పిల్లలకు అదనపు చార్జీలు ఉంటాయని నమ్మించి మరికొంత డబ్బు లాగారు. చెల్లింపుల సమయంలో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని, చెక్-అవుట్ సమయంలో డబ్బు రీఫండ్ అవుతుందని మాయమాటలు చెప్పి బాధితుడితో పలు దఫాలుగా డబ్బు కట్టించుకున్నారు. చివరకు పేమెంట్‌ ఫెయిల్ అయ్యిందంటూ బుకింగ్‌ను రద్దు చేశారు. రద్దయిన టికెట్ల డబ్బు మొత్తం వెనక్కి రావాలంటే క్యాన్సిలేషన్ చార్జీల కింద మరో రూ.48,500 కట్టాలని డిమాండ్ చేశారు. వాట్సాప్‌లో కార్డెలియా క్రూజ్‌ కస్టమర్ కేర్ ప్రతినిధులమని చెప్పుకుంటూ నమ్మించి, మొత్తం రూ.2,42,488 కాజేశారు. మోసపోయామని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

సైబర్ పోలీసుల కీలక సూచనలు

సైబర్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా క్రూజ్ ప్యాకేజీలు, ఆన్‌లైన్ బుకింగ్‌ల విషయంలో జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. క్రూజ్ ప్యాకేజీలను ఎల్లప్పుడూ ఆయా సంస్థల అధికారిక వెబ్‌సైట్లు లేదా గుర్తింపు పొందిన ట్రావెల్ ఏజెంట్ల ద్వారానే బుక్ చేసుకోవాలని సూచించారు. గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లేదా ఆన్‌లైన్ ప్రకటనల్లో కనిపించే అనుమానాస్పద వెబ్‌సైట్ల ద్వారా విడతల వారీగా డబ్బులు అడిగితే అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. బుకింగ్ కన్ఫర్మేషన్‌లో స్పష్టంగా పేర్కొననప్పుడు పర్మిట్‌లు, పిల్లల చార్జీలు, యాడ్-ఆన్స్ (Add-ons) పేరుతో అదనపు ఛార్జీలు చెల్లించవద్దని సూచించారు. అలాగే సాంకేతిక సమస్యలు అంటూ రీఫండ్ ఇస్తామని చెప్పి మళ్లీ మళ్లీ డబ్బులు అడిగితే అది కచ్చితంగా మోసమేనని హెచ్చరించారు. నిజమైన కంపెనీలు రిఫండ్ కోసం ముందస్తుగా క్యాన్సిలేషన్ చార్జీలు వసూలు చేయవని స్పష్టం చేశారు. వాట్సాప్ ద్వారా వచ్చే కస్టమర్ కేర్ కాల్స్, మెసేజ్‌లను నమ్మవద్దని, కేవలం అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన నంబర్లనే సంప్రదించాలని సైబర్ పోలీసులు సూచించారు.

ఫిర్యాదు చేయాలంటే:

సైబర్ మోసానికి గురైన వారు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 87126 65171 నంబర్‌కు కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.

Next Story