రూ.లక్షలు చెల్లించి ఇంజినీరింగ్ సీట్లు బుక్.. ఇప్పటికే భర్తీ ప్రక్రియ పూర్తి.. అంత డిమాండ్ ఎందుకంటే?

by Gantepaka Srikanth |

రాష్ట్రంలోని ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోటా(బీ-కేటగిరీ) సీట్లకు ఈ ఏడాది అనూహ్యంగా భారీ డిమాండ్‌ ఏర్పడింది.

రూ.లక్షలు చెల్లించి ఇంజినీరింగ్ సీట్లు బుక్.. ఇప్పటికే భర్తీ ప్రక్రియ పూర్తి.. అంత డిమాండ్ ఎందుకంటే?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోటా(బీ-కేటగిరీ) సీట్లకు ఈ ఏడాది అనూహ్యంగా భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఈ ఏడాది ఫీజుల పెంపు లేకపోవడంతో కళాశాల యాజమాన్యాలు బీ-కేటగిరి సీట్లపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కొన్ని కాలేజీల్లో ఇప్పటికే అనధికారికంగా మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ భర్తీ ప్రక్రియపై కొందరు తల్లిదండ్రులు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న కాలేజీలపై స్పష్టమైన సమాచారం ఉన్నప్పటికీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను పారదర్శకంగా భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే, కొన్ని కాలేజీలు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ, ముందస్తుగానే సీట్లను విక్రయించుకుంటున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయమై పలుమార్లు ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులు అందినా పట్టించుకోవడం లేదనే వాదనలు ఉన్నాయి. దీని వల్ల నిజమైన అర్హత కలిగిన విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.

చర్యలు శూన్యం

రాష్ట్రంలో 175 ఇంజినీరింగ్ కాలేజీలున్నా.. 10 కాలేజీలకు మాత్రం భారీగా డిమాండ్ ఉండడంతో ఆ కాలేజీలు ఫీజులను అధిక మొత్తంలో వసూలు చేస్తున్నాయి. ఈ పరిణామంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, అనధికారికంగా సీట్లు భర్తీ చేస్తున్న కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 175 ఇంజినీరింగ్ కాలేజీల్లో 1.18 లక్షల సీట్లున్నాయి. రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల భర్తీలో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల వాటా ప్రతి సంవత్సరం పెరుగుతోంది. మొత్తం సీట్లలో 30 శాతం మేనేజ్‌మెంట్ కోటా కింద భర్తీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈఏపీసెట్‌లో ర్యాంక్ ఆధారంగా కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద సీట్లను భర్తీ చేసినప్పటికీ, ఈఏపీసెట్‌లో పదివేల ర్యాంక్ దాటితే టాప్ కాలేజీల్లో సీటు వచ్చే అవకాశం ఉండడం లేదు. సీఎస్ఈ, దాని అనుబంధ కోర్సుల్లో 10వేల లోపు ర్యాంక్ ఉంటేనే సీటుపై ఆశ ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు. సీఎస్ఈ వంటి కోర్సులు చేయాలనుకునే వారు మంచి కాలేజీల్లో సీటు పొందడం కష్టంగా మారింది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడడం లేదు. ఈ కారణంతోనే మేనేజ్‌మెంట్ కోటా సీట్ల కోసం రూ.లక్షలు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో సీఎస్ఈ అనుబంధ కోర్సుల్లోని సీట్లు టాప్ కాలేజీల్లో రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని మధ్య తరహా కాలేజీల్లో రూ.10 లక్షల వరకు తీసుకుంటున్నారు.

మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు భారీ డిమాండ్

ప్రతి ఏటా మేనేజ్‌మెంట్ కోటాలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. టాప్ కాలేజ్, సీఎస్ఈ అయితే చాలు మంచి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌తో ఉద్యోగాలు పొందవచ్చనే భావన ఎగువ, మధ్య తరగతి కుటుంబాల్లోనూ ఎక్కువగా ఉంది. గత మూడేళ్లలో భర్తీ అయిన సీట్ల వివరాల ప్రకారం 2022లో 20,238, 2023లో 22,103, 2024లో దాదాపు 28వేల మేనేజ్‌మెంట్ సీట్లు భర్తీ అయ్యాయి. 60 శాతానికి పైగా సీఎస్ఈ అనుబంధ కోర్సుల్లో చేరడానికే విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. గతేడాది మొత్తం 1,07,160 సీట్లు భర్తీ కాగా, అందులో కన్వీనర్ కోటాలో 79,224, మేనేజ్‌మెంట్ కోటాలో 27,936 సీట్లు నిండాయి.

Next Story