నగరంలో భారీగా విద్యుత్ డిమాండ్.. పదేళ్లలో రెట్టింపైన వినియోగం

by velandi.Saikiran |

హైదరాబాద్... విశ్వనగరం. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తోంది. ఐటీ, పరిశ్రమలను విపరీతంగా ఆకర్షిస్తున్న

నగరంలో భారీగా విద్యుత్ డిమాండ్.. పదేళ్లలో రెట్టింపైన వినియోగం
X
  • నగరంలో భారీగా విద్యుత్ డిమాండ్
  • పదేళ్లలో రెట్టింపైన వినియోగం
  • 2202 మెగావాట్ల నుంచి 4352 మెగావాట్లకు చేరుకున్న డిమాండ్
  • 43,83 మిలియన్ యూనిట్ల నుంచి 90 మిలియన్ యూనిట్లకు పెరిగిన వినియోగం
  • ఐటీ, పరిశ్రమలు, వ్యాపార రంగాలు, విద్యుత్ వాహనాల పెంపుతో డిమాండ్
  • డిమాండ్ కు తగ్గట్లుగా మౌళిక వసతులను పెంచుకుంటున్న టీజీఎస్పీడీసీఎల్

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్... విశ్వనగరం. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తోంది. ఐటీ, పరిశ్రమలను విపరీతంగా ఆకర్షిస్తున్న హైదరాబాద్ మహానగరంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిశ్రమలు విస్తరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో విద్యుత్ సమస్యలు లేకుండా సర్కారు అన్ని చర్యలు తీసుకుంటోంది. గత 11 ఏళ్లలో రెట్టింపు విద్యుత్ వినియోగమవుతున్నా... ఎలాంటి ఆటంకాలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తోంది. ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ లో తమ సంస్థలను స్థాపించేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా నగరంలో విద్యుత్ డిమాండ్ రెట్టింపు అయినా కూడా ఎలాంటి సమస్యలు తలెత్తడం లేదు. దీంతో నగరంలో డేటా సెంటర్లు, కొత్త ఐటీ పరిశ్రమలు, నూతన ఇండస్ట్రీలు వెలుస్తున్నాయి.

ఊహించని స్థాయిలో విద్యుత్ డిమాండ్

రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుండగా... నగరంలోనూ అదే ఒరవడి కొనసాగుతోంది. అత్యధికంగా సైబర్ సిటీ సర్కిల్ లో ఇబ్రహీంబాగ్, గచ్చిబౌలి, పటాన్ చెరు, కందుకూరు, మేడ్చల్ డివిజన్ల పరిధిలో ఏడాదికి 20శాతం మేర విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. ఇక సైబర్‌సిటీ సర్కిల్‌లో కొండాపూర్ డివిజన్, మేడ్చల్ సర్కిల్‌లో కూకట్‌పల్లి, జీడిమెట్ల డివిజన్లు, హబ్సిగూడ సర్కిల్‌లో హబ్సిగూడ, సైనికపురి, కీసర డివిజన్లు, సరూర్ నగర్ సర్కిల్‌లో సరూర్ నగర్, చంపాపేట్, ఇబ్రహీంపట్నం డివిజన్లు, రాజేంద్రనగర్ సర్కిల్‌లో రాజేంద్రనగర్, షాద్ నగర్ డివిజన్లు, సంగారెడ్డి సర్కిల్‌లో సంగారెడ్డి డివిజన్ లో ఏటా 15శాతం మేర విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది.

హైదరాబాద్ (సెంట్రల్) సర్కిల్‌లో సైఫాబాద్, ఆజమాబాద్, మెహిదీపట్నం డివిజన్లు, హైదరాబాద్ (సౌత్) సర్కిల్‌లో చార్మినార్, బేగంబజార్, ఆస్మాన్ గఢ్ డివిజన్లు, సికింద్రాబాద్ సర్కిల్‌లో ప్యారడైజ్, బోయిన్‌పల్లి, కంటోన్మెంట్ డివిజన్లు, బంజారా హిల్స్ సర్కిల్‌లో బంజారా హిల్స్, గ్రీన్‌లాండ్స్ డివిజన్లలో ఏడాదికి 10 శాతం మేర విద్యుత్ డిమాండ్ పెరిగిపోయింది. విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా దక్షిణ డిస్కం ప్రత్యేక దృష్టి సారించింది. గతేడాది వేసవిలో గ్రేటర్‌ వ్యాప్తంగా 61 సబ్‌స్టేషన్లలో లోడ్‌ గ్రోత్‌ 30 శాతం నుంచి 87 శాతం వరకు నమోదయింది. ఈ డిమాండ్‌ దృష్టిలో ఉంచుకుని టీజీఎస్‌పీడీసీఎల్ 5 ఏళ్ల కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా 307 కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం, పవర్ ట్రాన్స్ ఫార్మర్ల (PTR)ల సామర్థ్యవృద్ధి, కొత్త 33 కేవీ లైన్లు, 11 కేవీ లైన్లు, 963 అదనపు డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఇతర మౌలిక వసతుల ఏర్పాటును చేస్తోంది. లోడ్‌ గ్రోత్‌ అధికంగా ఉన్న సబ్‌స్టేషన్లలో సామర్థ్యాన్ని పెంచుతున్నారు. 11 కేవీ ఫీడర్లపై 60-70 శాతం లోడ్‌ దాటకుండా ఫీడర్ల విస్తరణ చేపట్టి ఓవర్‌లోడ్‌ పడకుండా చర్యలు చేపట్టారు. గతంలో 80 శాతం లోడ్ ఉన్నప్పుడు మాత్రమే పీటీఆర్, డీటీఆర్ మార్చేవారు. కానీ ఇప్పుడు 60శాతం లోడ్ దాటగానే అదనంగా పీటీఆర్, డీటీఆర్ సహా ఇతర మౌలిక వసతులను పెంచుతున్నారు. ఫలితంగా లోడ్ పెరగినా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఎంతటి డిమాండ్ అయినా తట్టుకునేలా...

హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఐటీ, పరిశ్రమలు, డేటా సెంటర్లు, కమర్షియల్ కాంప్లెక్సులు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, వాణిజ్య అవసరాలు పెరుగుతున్న కారణంగా విద్యుత్ లోడ్‌ డిమాండ్‌ వేగంగా పెరుగుతోంది. ఈ పెరుగుదలకు తగిన విధంగా మౌలిక వసతులు కల్పించేందుకు టీజీఎస్‌పీడీసీఎల్ (TGSPDCL) నాలుగు విభాగాలుగా గ్రోత్ కారిడార్లను విభజించి కార్యాచరణ చేప్టటింది. 20శాతం, 15 నుంచి 20శాతం, 10 నుంచి 15శాతం, 10శాతం లోపు కారిడార్లుగా విభజించుకుని మౌలిక వసతులను కల్పిస్తున్నాం. దాదాపు 30 నుంచి 40 శాతం మేర మౌలిక వసతులను విస్తరిస్తున్నాం. ఫలితంగా 5వేల మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ పెరిగినా ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా అందిస్తాం.

- టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ

సంవత్సరం అత్యధిక డిమాండ్ (మెగావాట్లలో) విద్యుత్ వినియోగం (మిలియన్ యూనిట్లలో)

2013-14 2202 43.83

2014-15 2261 49.5

2015-16 2497 52.8

2016-17 2586 55.6

2017-18 2796 60.8

2018-19 2958 62.8

2019-20 3391 73.8

2020-21 2930 61.3

2021-22 3158 67.01

2022-23 3435 71.4

2023-24 3756 81.3

2024-25 4352 90.68

2025-26 4190 89.5

Next Story