- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: కలిసొచ్చిన డిసెంబర్ చివరి రోజులు.. కిటకిటలాడుతున్న పర్యాటక ప్రాంతాలు
TG: కలిసొచ్చిన డిసెంబర్ చివరి రోజులు.. కిటకిటలాడుతున్న పర్యాటక ప్రాంతాలు

దిశ, తెలంగాణ బ్యూరో: క్రిస్మస్ సెలవులు, శని-ఆదివారాలు, ఏడాది చివరి రోజులు కలిసిరావడంతో తెలంగాణ అంతటా ప్రయాణాల జోరు పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, కుటుంబాలు.. అందరూ సెలవులను వినియోగించుకుని టూర్లకు బయలుదేరడంతో రహదారులు, రైల్వే స్టేషన్లు, బస్‌స్టాండ్లు, విమానాశ్రయాలు జనంతో నిండిపోయాయి. రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు భక్తులు, సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి. ఏ దేవాలయం వద్ద చూసినా వేల సంఖ్యలో జనం, గంటల కొద్దీ క్యూలైన్లే కనిపిస్తున్నాయి.
పుణ్యక్షేత్రాలకు క్యూ..
హైదరాబాద్ నుంచి మొదలుకొని, యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, బాసర, ఆలంపూర్, కొమురవెళ్లి, మేడారం వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల వరకు రాష్ట్రంలో భక్తుల రద్దీ అసాధారణంగా పెరిగింది. ‘మా కుటుంబంతో కలిసి భద్రాచలం వచ్చాం. సెలవులు వచ్చాయి కదా.. దేవాలయాలు, టూరిస్టు ప్రాంతాలు కలియతిరిగేందుకు ప్లాన్ చేసుకున్నాం’ అని హైదరాబాద్‌కు చెందిన వెంకటేశం అనే ఉద్యోగి తెలిపారు. ఇక పర్యాటక ప్రాంతాలైతే వరంగల్ ఫోర్ట్, నాగార్జున సాగర్ డ్యామ్, అనంతగిరి హిల్స్ వంటివి సందర్శకులతో నిండిపోయాయి.
భక్తుల రద్దీ.. ట్రాఫిక్ జాములు.
హైదరాబాద్ నుంచి భక్తులు సులభంగా వెళ్లే అవకాశం ఉండే పుణ్యక్షేత్రాల్లో శ్రీశైలం ఒకటి. ఇక వరుస సెలవు రోజులు వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. శ్రీశైలం ఘాట్ రోడ్డు వాహనాలతో నిండిపోయి, ట్రాఫిక్ జామ్‌లు సాధారణమయ్యాయి. తిరుపతి తిరుమల దేవస్థానంలో అయితే పరిస్థితి మరింత తీవ్రం. భక్తుల రద్దీ పెరిగిపోవడంతో సర్వదర్శనాలను తాత్కాలికంగా ఆపేశారు. వీఐపీ, ప్రత్యేక దర్శనాలు కూడా నిలిపివేసినా, క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. తిరుపతి వెళ్లిన పలువురు భక్తులు అక్కడి నుంచి కాణిపాకం, వేలూర్ గోల్డెన్ టెంపుల్, కర్ణాటక, తమిళనాడుకు సైతం వెళ్లారు. ఇక రాష్ట్రం నుంచి గోవా, కర్ణాటక, మహారాష్ట్రలోని పలు దేవాలయాలు, టూరిస్ట్ అట్రాక్షన్ సెంటర్లకు సైతం పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివెళ్తున్నారు.
హిల్ స్టేషన్స్‌కు రయ్ రయ్..
దేశంలోని హిల్ స్టేషన్లు కూడా మన రాష్ట్ర పర్యాటకులతో కళకళలాడుతున్నాయి. కులూ మనాలీలో హిమపాతం మధ్య సాహస యాత్రలు, లడాక్‌లో శాంతియుతమైన ప్రకృతి సౌందర్యం, కశ్మీర్‌లో దాల్ లేక్, శాల్‌మార్ గార్డెన్లు మనవారిని ఎంతో ఆకర్షిస్తున్నాయి. గోవా బీచ్‌లు, కేరళ బ్యాక్‌వాటర్లు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్లకు పర్‌ఫెక్ట్ స్పాట్‌లుగా మారాయి. దేశీయ పర్యాటకంతో పాటు విదేశాలకు వెళ్లేవారి సంఖ్య కూడా ఈ ఇయర్ ఎండింగ్‌లో ఆశ్చర్యకరంగా పెరిగిందని హైదరాబాద్‌కు చెందిన ఓ ట్రావెల్ ఏజెంట్ తెలిపారు. చైనాకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమవడంతో పలువురు అక్కడి గ్రేట్ వాల్, ఫర్బిడెన్ సిటీలను సందర్శిస్తున్నారు. థాయ్‌లాండ్ బీచ్‌లు, ఇండోనేషియా బాలీ ద్వీపం, మలేషియా ట్విన్ టవర్లు, సింగపూర్ మెరీనా బే, యూఏఈలో బుర్జ్ ఖలీఫా, యూరప్ టూర్లు.. అన్నీ మన పర్యాటకులతో జనసమూహంగా మారాయి.
గోవాలో ప్రారంభమైన సెలబ్రేషన్స్
గోవాలో 2026 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సాధారణంగా ప్రారంభమయ్యాయి. భారీ మ్యూజిక్ ఫెస్టివల్స్ లాంటి సన్ బార్న్ తదితర ఈవెంట్స్ ఈ నెల 27, 28 లేదా 29 డిసెంబర్ నుంచి మొదలై 31వ తేదీ వరకు సాగుతాయి. పార్టీలు, బీచ్ ఈవెంట్స్ రద్దీ 30, 31 డిసెంబర్‌లో పీక్‌కు చేరుకుంటుంది, మధ్య రాత్రి ఫైర్‌వర్క్స్, డీజే పార్టీలతో కొత్త సంవత్సరాన్ని స్వాగతించేందుకు సిద్ధమవుతున్నారు. పలు రిసార్ట్స్, క్లబ్స్‌లో క్రిస్మస్ నుంచే ఫెస్టివ్ వైబ్ ఉంటుంది కానీ, న్యూ ఇయర్ స్పెసిఫిక్ పార్టీలు శనివారం నుంచే ఘనంగా స్టార్టయ్యాయి. మన తెలంగాణ నుంచి వెళ్లిన పర్యాటకులు ఇక్కడ న్యూ ఇయర్‌ను జ్ఞాపకాలతో నింపుకుంటున్నారు.
ఇయర్ ఎండింగ్ ట్రావెల్ సీజన్..
ఏడాది ముగిసిపోతున్న సమయంలో మిగిలిపోయిన సెలవులను వాడుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది ఉద్యోగస్తులు కుటుంబాలతో విహారయాత్రలకు బయలుదేరారు. కొందరు న్యూ ఇయర్ సెలబ్రేషన్ల కోసం ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. మరికొందరు మంచి పర్యాటక ప్రాంతాల్లో కొత్త సంవత్సరాన్ని స్వాగతించాలని టూర్లకు వెళ్తున్నారు. మొత్తంగా వరుస సెలవులు పర్యాటక కళ తీసుకువచ్చాయి. పుణ్యక్షేత్రాల నుంచి పర్యాటక కేంద్రాల వరకు ప్రతిచోటా జనసంద్రం కనిపిస్తూ, ఈ డిసెంబర్ చివరి రోజులను ‘ట్రావెల్ సీజన్’గా మార్చేశాయి.






