TG: మున్సిపల్ ఎన్నికల్లో భారీగా నగదు, మద్యం, ఆభరణాలు సీజ్

by Prasad Jukanti |   (  Updated:2026-02-10 15:43:39  IST  )

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోడ్ సందర్భంగా సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదు, నగలు, మద్యాన్ని సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

TG: మున్సిపల్ ఎన్నికల్లో భారీగా నగదు, మద్యం, ఆభరణాలు సీజ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చెప్పారు. 1,183 లైసెన్స్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని,4318 మందిని బైండోవర్, 398 నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేశామన్నారు. ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికల కోసం 4 రాష్ట్రాల సరిహద్దుల్లో 20 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్టంలోని వివిధ జిల్లాల్లో 55 చెక్ పోస్టులు , 181 ప్లయింగ్ స్క్వాడ్స్ సిద్ధం చేశామన్నారు. 167 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ విధుల్లో ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు రూ. 3.09 కోట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. రూ.1.29 కోట్ల నగదు, రూ. 1.21 కోట్ల విలువైన మద్యం, రూ.15.7 లక్షల డ్రగ్స్, 28.69 లక్షలకు పైగా విలువ కలిగిన బంగారం, ఇతర విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 8,203 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని బందోబస్తు కోసం ఇతర శాఖల నుంచి 3 వేల అదనపు బలగాలను సిద్ధం చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశామన్నారు.

సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లపై నిఘా:

రాష్ట్రంలో 1302 హైపర్ సెన్సిటీవ్, 4975 నార్మల్, 1,926 సెన్సిటీవ్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ పోలీసులు 8,203 పోలింగ్ స్టేషన్లకు తగిన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. బందోబస్తు కోసం టీజీఎస్పీ, ఫారెస్ట్, ఎక్సైజ్, సీఐడీ, లీగల్ మెట్రాలజీ తదితర శాఖల నుండి 3,000 మంది బలగాలు సమకూర్చినట్లు తెలిపారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో 100 శాతం వెబ్‌కాస్టింగ్, అలాగే హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ల బయట కూడా వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశామని 9 ఫిబ్రవరి 2026 సాయంత్రం 5 గంటల నుండి సైలెంట్ పీరియడ్ కొనసాగుతుందని తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల వేళ పోలీసుల దూకుడు.. రూ.1.29 కోట్లు నగదు పట్టివేత.. డీజీపీ సంచలన ప్రకటన

Next Story