ఎలక్షన్ రిజల్ట్‌పై జోరుగా బెట్టింగ్.. ఈ జిల్లాల్లోనే అధికం

by Sathputhe Rajesh |

తెలంగాణ రాష్టంలో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది.

ఎలక్షన్ రిజల్ట్‌పై జోరుగా బెట్టింగ్.. ఈ జిల్లాల్లోనే అధికం
X

దిశ , తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్టంలో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఇక ఓటింగ్‌కు ఒకే రోజు మిగిలింది. అయితే ఏ పార్టీ గెలుస్తుంది. ఎవరు అధికారంలోకి రాబోతున్నారనే చర్చ మొదలైంది. ఊరు వాడ, పల్లె పట్నం అని తేడా లేకుండా నలుగురు గుమిగూడితే చాలు పాలిటిక్స్‌పైనే గుసగుసలాడుకుంటున్నారు. ఈసారి ప్రధాన పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా ఉండటంతో జనాల అటెన్షన్ అంతా ఫలితాలపైనే ఉంది.

తెలంగాణ ప్రజలతో పాటు.. చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎవరికి వారు తమ పార్టీ అభ్యర్థి గెలుస్తారంటూ పలువురు బెట్టింగ్ కడుతున్నారు. వందకు వెయ్యి, వెయ్యికి లక్ష అంటూ వేలం పాట పాడుతున్నారు. ఇక పెద్ద లీడర్లు తలపడుతున్న నియోజకవర్గాల్లో అయితే.. ఎవరు ఎంత మెజార్టీతో గెలుస్తారనే విషయంపై లక్షల్లో బెట్టింగ్స్ నడుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పక్క రాష్టంలో ఆసక్తి

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఇక్కడి కంటే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా ఆసక్తి నెలకొంది. పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో పందెం రాయుళ్ల బెట్టింగ్‌ దందా కూడా జోరందుకుంది. ప్రధాన పార్టీల గెలుపోటములపై జోరుగా పందేలు కాస్తున్నారు. పార్టీలతో పాటు కీలక నేతల జయాపజయాలపై కూడా బెట్టింగ్ కాస్తున్నారు.

సర్వేల ఆధారంగా బెట్టింగులు

సాధారణంగా బెట్టింగ్స్‌.. సర్వేలపై ఆధారపడి ఉంటాయి. అందుకే ఇప్పటి దాకా వచ్చిన సర్వేలు ఎన్ని? అందులో ఏ పార్టీ గెలుపు అవకాశం ఎంత? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయ్‌? అనే అంశాలను పందెంరాయుళ్లు పరిగణనలోకి తీసుకుంటున్నారు. అలాగే సర్వేలు చేసిన సంస్థల విశ్వసనీయత ఎంత? గతంలో అవి చేసిన సర్వేల వాస్తవిక ఫలితాలు ఎలా వచ్చాయి? అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

ఆ వివరాల ఆధారంగానే పందాలు కాస్తున్నారు. అలాగే రాజకీయ నేతలతో టచ్‌లో ఉండే సర్వే సంస్థలను కొందరు స్వయంగా కలుస్తున్నారు. కచ్చితంగా గెలిచే పార్టీ ఏంటో ఒకటికి రెండుసార్లు అంచనాలు సరిచూసుకుంటున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను బేరీజు వేసుకోవడానికి తెలంగాణలో ఉన్న తమ పరిచయస్తులు, స్నేహితులు, బంధువులకు ఫోన్లు చేస్తున్నారు. ప్రజల మూడ్‌ ఎలా ఉంది? ఎటువైపు గాలి వీస్తోందోనని కూడా ఆరా తీస్తున్నారు.

సిండికేట్‌గా పందాలు

ఈ సారి ఎన్నికల్లో విజయాపజయాలపై కొందరు వ్యక్తిగత స్థాయిలో పందేలు కాస్తుండగా.. మరికొందరు సిండికేట్‌గా పందేలు కడుతున్నట్టు తెలిసింది. ఒక పార్టీ లేదా అభ్యర్థి గెలుస్తున్నారని భావిస్తే ఒకరు కాకుండా ఒక సమూహం 10 లేదా 25 మాది గ్రూప్‌తో సిండికేట్‌గా మారి లక్షలలో బెట్ కడుతున్నారు. గెలిస్తే అందులో వారి వాటా ఎంతో అంత వస్తుంది. పోతే మొత్తం పోతుంది. వ్యక్తిగతంగా అయినా, సిండికేట్‌ ద్వారా అయినా.. చాలా మంది రూ.లక్షలు, కోట్లల్లో పందేలు కాస్తున్నారు. కొందరైతే.. వ్యవసాయ భూములు, ఇళ్లను కూడా పందెంగా పెడుతున్నట్టు సమాచారం.

ఈ జిల్లాల్లో అధికం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఉద్దండులు పోటీ చేస్తున్న నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థుల విజయంపై పెద్దఎత్తున బెట్టింగులు కడుతున్నారు. ఇప్పటికే బెట్టింగ్‌ మార్క్ రూ.100 కోట్లు దాటినట్టు సమాచారం. ఏపీకి చెందిన ఓ వర్గం ఖమ్మం జిల్లా బెట్టింగుల్లో కీలక పాత్ర పోషిస్తోందనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలో ముఖ్యంగా రెండు జనరల్ సీట్లు, రెండు ఎస్‌సీ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనే విషయం మీద భారీ స్థాయిలో పందేలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలలో మంత్రుల స్థానంతో పాటు మూడు ఎస్సీ రిజెర్వేడ్ స్థానాలపై బెట్టింగ్ జోరుగా కొనసాగుతున్నది. ఉత్తర తెలంగాణాలో కూడా మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి మెదక్‌లో ఒక స్థానం, హైదరాబాద్, రంగా రెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో కూడా బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిసింది.

Next Story