హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌లో రాష్ట్రం వెనకడుగు

by Malleboina Mahesh |

తెలంగాణలో మందకొడిగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్.. రాష్ట్ర సగటు కేవలం 26 శాతమే.. హైదరాబాద్‌లో 3 శాతం ప్రగతితో అధికారుల నిర్లక్ష్యం తీవ్రం!

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌లో రాష్ట్రం వెనకడుగు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సెర్వికల్ క్యాన్సర్) మహమ్మారిని నివారించేందుకు ఉద్దేశించిన ప్రతిష్టాత్మక హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను అధికారులు గాలికొదిలేశారు. సాక్ష్యాత్తు ప్రభుత్వ యూ-విన్ అధికారిక నివేదిక (జూన్ 17, 2026) ప్రకారం రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంత నత్తనడకన సాగుతున్నదో బయటపెట్టింది. రాష్ట్ర సగటు కేవలం 26 శాతానికే పరిమితం కావడం చూస్తే.. ఉచిత వ్యాక్సిన్ పై అవగాహన కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యం ఏ పాటిదో అర్థమవుతున్నది.

వ్యాక్సినేషన్ లో వెనకే..

రాష్ట్రంలో ప్రతియేటా సుమారు 60 వేల వరకు క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. రాబోయే ఐదేళ్లలో ఈ సంఖ్య మరో 10 శాతం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 28న లాంఛనంగా ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లో చేపట్టిన హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రక్రియ నాలుగు నెలలు పూర్తవుతున్నా... మందకొడిగా సాగుతున్నట్లు తెలుస్తున్నది.

అధికారిక వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో అర్హులైన బాలికలను గుర్తించేందుకు నిర్వహించిన సర్వేలో మొత్తం 3,47,442 మంది బాలికలను గుర్తించారు. అయితే, వీరి కోసం అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 21,912 వ్యాక్సినేషన్ సెషన్లను (కేంద్రాలను) నిర్వహించినప్పటికీ, ఇప్పటివరకు కేవలం 91,289 మంది బాలికలకు మాత్రమే టీకాలు అందించగలిగారు. దీనివల్ల రాష్ట్ర సగటు వ్యాక్సినేషన్ కేవలం 26 శాతానికే పరిమితమైంది. గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశాయి. మిజోరం (89), బీహార్(85), ఆంధ్రప్రదేశ్ (70) వంటి రాష్ట్రాలు మన కంటే ఎంతో ముందున్నాయి.

రాజధానిలో మరీ ఘోరం

అవగాహన, వనరులు పుష్కలంగా ఉండే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రగతి కేవలం మూడు శాతం మాత్రమే నమోదవడం అత్యంత దిగ్భ్రాంతికరం గా భావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 42,360 మంది బాలికలను గుర్తించి సర్వే చేసిన అధికారులు.. కనీసం 1,177 మందికి కూడా టీకాలు వేయించలేకపోయారంటే క్షేత్రస్థాయి పర్యవేక్షణ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఐటీ కారిడార్, విద్యావంతులు ఎక్కువగా ఉండే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో సైతం కేవలం 8 శాతం మాత్రమే వ్యాక్సినేషన్ జరగడం గమనార్హం. వ్యాక్సిన్ల లభ్యత ఉండి, నిధులు అందుబాటులో ఉన్నా.. పట్టణ ప్రాంతాల్లోని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను సమన్వయం చేయడంలో రాష్ట్ర, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు పూర్తిగా చేతులెత్తేశారనే చర్చ జరుగుతున్నది.

గ్రామీణ అధికారుల చొరవ..

పెద్దపల్లి జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని 74 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసి రాష్ట్రంలోనే అగ్ర స్థానంలో నిలిచారు. రాజన్న సిరిసిల్ల (68 శాతం), ఖమ్మం (65శాతం) వంటి జిల్లాల్లో గ్రామీణ యంత్రాంగం నిబద్ధతతో పనిచేసి సత్ఫలితాలు సాధించింది. గ్రామీణ ప్రాంతాల్లో సాధ్యమైనప్పుడు.. అన్ని వసతులు ఉన్న హైదరాబాద్, నల్లగొండ (12 శాతం), నాగర్‌కర్నూల్ (15 శాతం), వికారాబాద్ (18 శాతం) జిల్లాల్లో వ్యాక్సినేషన్ ప్రొగ్రమ్ ఎందుకు వెనుకబడిందనేది ప్రశ్నార్థకంగా మారింది. లక్షలాది మంది బాలికల ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే దీన్ని కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా, విఫలమైన అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తున్నది. ప్రచార ఆర్భాటాలు పక్కన పెట్టి, ఇప్పటికైనా స్కూళ్లు, కాలేజీలు, బస్తీల్లో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించకపోతే క్యాన్సర్ ముప్పును నివారించలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేసే ఉచిత సంజీవని..

మహిళల్లో ప్రాణాంతక గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణకు ఈ హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ఎంతో కీలకం. ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత క్యాన్సర్‌గా మారడానికి ఏళ్ల సమయం పడుతుంది. అందుకే 9 నుంచి 14 ఏళ్ల వయసున్న బాలికలకు ఈ టీకా ఇస్తే వారిలో శక్తివంతమైన రోగనిరోధక శక్తి తయారవుతుంది. చిన్న వయసులోనే ఈ టీకా రెండు డోసులు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చే ప్రమాదం దాదాపు 90 శాతానికి పైగా తగ్గుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేస్తోంది.

ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ టీకా ప్రైవేట్ మార్కెట్‌లో సామాన్యులకు భారంగా మారింది. భారత్‌లోనే తయారైన సెర్వావాక్ ధర ఒక డోసుకు రూ.1,400 నుండి రూ.2000 వరకు ఉండగా.. విదేశీ బ్రాండ్లయిన గార్డసిల్ రకాలను బట్టి రూ.4000 నుంచి ఏకంగా రూ.11 వేల వరకు పలుకుతున్నాయి. ప్రైవేటులో వేల రూపాయలు ఖర్చయ్యే ఈ విలువైన క్యాన్సర్ నివారణ టీకాను ప్రస్తుతం ప్రభుత్వం పూర్తి ఉచితంగా అందిస్తోంది. ఇంతటి సువర్ణావకాశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో వైద్యారోగ్య శాఖ అధికారులు విఫలమయ్యారనే చర్చ జరుగుతున్నది.

Next Story