రూ.5 వేలకే జడ్పీటీసీ.. రూ.1000లకే సర్పంచ్ స్థానం

by Bhoopathi Nagaiah |

గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదల చేయడంతో గ్రామాల్లో అభ్యర్థుల హడావుడి ఎక్కువైంది.

రూ.5 వేలకే జడ్పీటీసీ.. రూ.1000లకే సర్పంచ్ స్థానం
X

దిశ, వెబ్‌డెస్క్ : గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదల చేయడంతో గ్రామాల్లో అభ్యర్థుల హడావుడి ఎక్కువైంది. సర్పంచ్ కావాలని రెండేళ్లుగా ఎదురుచూస్తున్న ఆశావహులు తాజా నోటిఫికేషన్‌లో రంగంలోకి దిగారు. గ్రామాల్లో బలాబలాలను అంచనా వేసుకుంటున్నారు. ఇక ఎంపీటీజీ, జడ్పీటీసీ ఆశావహులు సైతం కులసంఘాలు, యువజన సంఘాలు, మండలంలో ఉన్న ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునేందుకు వినాయక చవితి నుంచే తాయిలాలు అందిస్తున్నారు. ఇక ఊర్లలో వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ అభ్యర్థి వరకు ఇప్పటి నుంచే ఇళ్లకు వెళ్లి ఓటర్లతో మాట ముచ్చట కలుపుతున్నారు. పింఛన్లు వస్తున్నాయా..? ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా..? తాగునీరు వస్తుందా..? ఇంకా ఏఏ సమస్యలు ఉన్నాయి..? అంటూ వాకాబు చేస్తున్నారు.

ఇక వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీ ఎన్నికయ్యే అభ్యర్థి ఎంత డిపాజిట్ చేయాలో తెలుసా..? అతి తక్కువ ఫీజుతోనే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కల్పించింది. జడ్పీటీసీ జనరల్ అభ్యర్థి రూ.5 వేలు, రిజర్వుడ్ అభ్యర్థి రూ.2,500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎంపీటీసీకి జనరల్ అభ్యర్థి రూ.2,500, రిజర్వుడ్ అభ్యర్థి రూ.1,250 డిపాజిట్ చేయాలి. సర్పంచ్ జనరల్ అభ్యర్థి రూ.2000, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థి వెయ్యి రూపాయలు డిపాజిట్ చేస్తే సరిపోతుంది. ఇక వార్డు మెంబర్‌గా పోటీ చేసే జనరల్ కేటగిరి అభ్యర్థి కేవలం రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థి రూ.250 చెల్లిస్తే పోటీకి అర్హులు అవుతారు. కాగా, మొదటి విడతలో 31 జిల్లాలో 58 రెవెన్యూ డివిజన్లలో 292 జడ్పీటీసీ, 2,963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి నామినేషన్లను స్వీకరించనున్న ఎస్ఈసీ.. 11వ తేదీ వరకు నామినేషన్లకు గడువు విధించింది. 15న ఉపసంహరణ కాగా 23న పోలింగ్ నిర్వహిస్తారు. ఇక రెండో విడతలో ఈనెల 13న నామినేషన్లను స్వీకరించి, ఉపసంహరణకు 19 వరకు గడువు ఇవ్వనున్నారు. 27న పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. రెండు విడతల ఫలితాలను నవంబర్‌ 11న వెల్లడించనున్నారు.

Next Story