HYD: ఒక్కొక్కటిగా మూతపడుతున్న హోటళ్లు

by Gantepaka Srikanth |

అంతర్జాతీయ యుద్ధ పరిణామాల ప్రభావంతో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నది.

HYD: ఒక్కొక్కటిగా మూతపడుతున్న హోటళ్లు
X

దిశ, హస్తినాపురం: అంతర్జాతీయ యుద్ధ పరిణామాల ప్రభావంతో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో చిన్న హోటళ్లు, టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాణిజ్య సిలిండర్ల సరఫరా తగ్గిపోవడం, ధరలు అమాంతం పెరగడం, రీఫిల్లింగ్ గడువు 25 రోజులకు పెరగడం వంటి కారణాలతో హోటల్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గ్యాస్ కొరత కారణంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో చిన్న హోటళ్లు ఒక్కొక్కటిగా మూతపడుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. సాధారణంగా ఉదయం నుంచి రాత్రివరకు కస్టమర్లతో రద్దీగా ఉండే టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లు ఇప్పుడు వెలవెలబోయి కనిపిస్తున్నాయి. రోజూ కలిసి టీ తాగుతూ, టిఫిన్ చేస్తూ ముచ్చట్లు పెట్టుకునే ప్రజల సందడి కూడా తగ్గిపోయింది.

మూతపడిన హోటల్..

హస్తినాపురం డివిజన్‌లోని జడ్పీ రోడ్డులో ఎప్పుడూ రద్దీగా ఉండే ‘లక్కీ స్ట్రీట్’ టిఫిన్స్, టీ స్టాల్ గ్యాస్ కొరత కారణంగా మూతపడింది. ఇక్కడ రోజూ వందలాది మంది చుట్టుపక్కల బస్తీల ప్రజలు చేరుకొని టీ, టిఫిన్ చేస్తూ గడిపే వారు. ప్రస్తుతం హోటల్ మూతపడడంతో ఆ ప్రాంతం నిశ్శబ్దంగా మారింది. హోటల్ యజమాని ఆంజనేయులు మాట్లాడుతూ.. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో హోటల్ నిర్వహణ కష్టంగా మారిందన్నారు. హోటల్‌లో పనిచేసే సిబ్బందికి కూడా వంట చేసుకునే గ్యాస్ లేకపోవడంతో హోటల్ తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చిందని తెలిపారు. రోజువారీగా సిబ్బంది జీతాలు, హోటల్ అద్దె భారం పెరుగుతుండడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే నగరంలోని చిన్న హోటళ్ల పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో నగరం ఎలా నిశ్శబ్దంగా మారిందో అలాంటి పరిస్థితులు మళ్లీ ఎదురుకావచ్చని తెలిపారు. గ్యాస్ సరఫరా సమస్యను వెంటనే పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని హోటల్ నిర్వాహకులు కోరుతున్నారు. లేకపోతే చిన్న వ్యాపారులు, వారి కుటుంబాలు రోడ్డున పడి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story