- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో ‘ఉద్యాన’ సిరులు.. కూరగాయల సాగుకే రైతుల మొగ్గు
తెలంగాణలో ప్రభుత్వ రాయితీలతో ఉద్యాన పంటల సాగు గణనీయంగా పెరిగింది. రబీ సీజన్‌లో 52 వేల ఎకరాల్లో కూరగాయలను రైతులు సాగు చేస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఉద్యాన పంటలను సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ రబీ సీజన్ 32 జిల్లాల్లో దాదాపు 52 వేల ఎకరాల్లో వివిధ రకాల కూరగాయాల పంటలు సాగు చేసినట్లు హార్టికల్చర్డిపార్టుమెంటు గణంకాలు వెల్లడించింది. యాసంగి సీజన్‌లో నీటి ఎద్దడి సమస్య కారణంగా సన్న, చిన్న కారు రైతులంతా వరి వేయకుండా కూరగాయల పంటలు సాగు చేశారని, దీంతోపాటు ప్రభుత్వం రాయితీలు పెద్ద మొత్తంలో ఇవ్వడంతో లాభాలు వస్తాయనే అంచనాతోనూ అన్నదాతలు ఉద్యాన పంటలపై ఆసక్తి చూపుతున్నట్లు హార్టికల్చర్ పేర్కొంది. పెరిగిన సాగుతో వచ్చే 4 నెలల పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు తెప్పించుకోవాల్సిన అవసరంలేదని అధికారులు చెబుతున్నారు.
ఐదు రెట్లు పెరిగిన సాగు
2025–26 ఆర్థిక సంవత్సరంలో సమగ్ర ఉద్యాన అభివృద్ది పథకం ద్వారా సబ్సిడీలు ప్రకటించిన ప్రభుత్వం.. కూరగాయాల విస్తీర్ణం 10వేల ఎకరాలకు పెంచాలనే లక్ష్యంతో రూ.9.60 కోట్లు కేటాయించింది. ఉల్లిగడ్డ సాగు కోసం రూ.2.35 కోట్లు, అల్లం, పసుపు, వెల్లులి కోసం రూ.5.33 కోట్లు ఖర్చు చేసింది. ఎకరాకు రూ.16 చొప్పున ఉద్యాన పంటలు సాగు చేసిన రైతుల ఖాతాలో జమ చేస్తామని ఇటీవల ప్రకటించిన ప్రభుత్వం హామీని అమలు చేస్తుండగా ఐదు రెట్లు సాగు పెరిగినట్లు అధికారులు తెలిపారు. రానున్న నాలుగైదు ఏళ్లలో పండ్లు, కూరగాయల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇక రాష్ట్రంలో మామిడి పండ్లు తప్ప మిగతా అన్నీ దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండటంతో.. దాని నుంచి బయటపడేందుకు ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు భారీగా రాయితీలకు ఇస్తోంది. ఇప్పటికే ఆయిల్ఫామ్తోటల కోసం పెద్దఎత్తున ప్రచారం చేపట్టగా.. పండ్లు, కూరగాయల సాగు పెంచేలా ఊరురా అన్నదాతలకు అవగాహన కల్పించేందుకు ఏఈవోలు చర్యలు చేపట్టారు.
తగ్గిన వలసలు
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానశాఖ ఆద్వర్యంలో కూరగాయలు, పండ్లు సాగు చేసే రైతులకు ప్రోత్సహకాలు ఇవ్వడంతో రెండు ఎకరాల నుంచి ఐదెకరాలు ఉన్నవారు సొంతంగా సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. గతంలో మూడు ఎకరాల వరకు సబ్సిడీ పరిమితి ఉండగా ప్రస్తుతం గరిష్ఠంగా ఐదు ఎకరాలకు సాయం అందిస్తున్నారు. పంటల సాగు ఖర్చు ప్రాతిపదికన గతంలో ఉన్న యూనిట్ ధరలను రెట్టింపు చేయడంతో పాటు సబ్సిడీ ఏకంగా 40 శాతానికి పెంచారు. రాయితీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60 శాతం, 40 శాతం చొప్పున తమ వాటాలను భరిస్తున్నాయి. ఆర్థిక సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. దీంతో చిన్నకారు రైతులు పట్టణాలకు వలస వెళ్లకుండా సొంత గ్రామాల్లోనే నివాసం ఉండే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించినట్లైంది. పంటలు సాగుచేసే కుటుంబంతోపాటు మరో 5 మంది కూలీలకు జీవనోపాధి దొరుకుతుంది.
50 శాతం రాయితీ
ఈ ఆర్థిక సంవత్సరానికి సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం ద్వారా అందిస్తున్న రాయితీలు, నిధులను ఉద్యాన శాఖ ప్రకటించింది. మామిడి, డ్రాగన్, అవకాడో, బత్తాయి, అరటి, జామ, బొప్పాయి తదితర పండ్ల తోటలకు ఎకరాకు రూ.20 నుంచి 32 వేలు, పుట్టగొడుగుల పెంపకానికి ఎకరాకు రూ.1 లక్ష నుంచి రూ.12 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనుంది. కూరగాయల సాగుకు ఎకరాకు రూ.9,600, ఉల్లిగడ్డలు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, పసుపు, పూలు, జీలకర్ర, ఓమా, సుగంధ ద్రవ్యాలకు ఎకరానికి రూ.8 వేల చొప్పున ఇవ్వనుంది. జర్బెర, ట్యూబెరోస్, గ్లాడియోలస్, లిల్లీ వంటి పూలసాగుకు ఎకరాకు రూ.40 వేలు, పాత తోటల అభివృద్దికి రూ.9,600, పాత తోటల పునరుద్ధరణకు రూ.2 కోట్లు, నీటి వనరుల సృష్టి కోసం రూ.2.73 కోట్లు, ప్లాస్టిక్ మల్చింగ్ కోసం రూ.14.24 కోట్లు కేటాయించనుంది. సేంద్రీయ సాగు, నర్సరీల ఏర్పాటు, విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు, పాలీహౌజ్‌లు, కోల్డ్ స్టోరేజీలు, సౌర పంట, ఎండబెట్టే యంత్రాల వంటి యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం 30 నుంచి 50 శాతం వరకు రాయితీ ఇవ్వనుంది.






