- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అడివే వారికి మరుగుదొడ్డి.. రాష్ట్రంలోని ఆ స్కూల్‌లో దారుణ పరిస్థితులు
గిరిజన విద్యార్థులు చదువుకునే గురుకుల పాఠశాలలో కనీస సౌకర్యాలు లేకపోవడం, మరుగుదొడ్లు సరిపోక విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి పక్కనె వున్న అడవికి వెళ్లాల్సి రావడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: గిరిజన విద్యార్థులు చదువుకునే గురుకుల పాఠశాలలో కనీస సౌకర్యాలు లేకపోవడం, మరుగుదొడ్లు సరిపోక విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి పక్కనె వున్న అడవికి వెళ్లాల్సి రావడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం బొమ్మరెడ్డిగూడెం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో నెలకొన్న పరిస్థితులపై రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్‌ను ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. ఈ వ్యవహారంపై దాఖలైన ఫిర్యాదును విచారణకు స్వీకరించిన కమిషన్ ఈ మేరకు మే 5వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది.
విద్యార్థుల ఆత్మగౌరవాన్ని, విద్యాహక్కును కాలరాయడమే..
హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది యెన్నం బాలచందర్ రెడ్డి జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు చేసిన ఫిర్యాదుతో ఈ గురుకులం దుస్థితి వెలుగులోకి వచ్చింది. అధికారుల లెక్కల ప్రకారం.. 2010లో కేవలం 150 మంది విద్యార్థుల సామర్థ్యంతో ఈ స్కూల్‌ను నిర్మించారు. అప్పట్లో వారికి సరిపోయేలా 16 మరుగుదొడ్లు కట్టారు. కానీ, ప్రస్తుతం ఇక్కడ 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏకంగా 275 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగినప్పటికీ దానికి తగ్గట్టుగా మౌలిక వసతులు పెంచలేదు. ఉన్నవాటిలో కూడా ప్రస్తుతం పనిచేస్తున్న మరుగుదొడ్లు కేవలం పది మాత్రమే.. అవి ఏమాత్రం సరిపోకపోవడంతో విద్యార్థులు ప్రతిరోజూ కాలకృత్యాలు తీర్చుకోవడానికి పక్కనే ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోంది. ఆ అడవిలో పాములు, విష పురుగుల భయంతో ఆ పసివాళ్లు ప్రాణాలు అరచేతిలోపెట్టుకుని గడపాల్సి వస్తోంది. ఇది విద్యార్థుల భద్రతను ప్రమాదంలో పడేయడంతో పాటు వారి ఆత్మగౌరవాన్ని, విద్యాహక్కును కాలరాయడమేనని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆరోపణలు నిజమైతే అది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే..
న్యాయవాది బాలచందర్ రెడ్డి తన పిటిషన్‌లో శానిటేషన్ సౌకర్యాలు కల్పించకుండా విద్యార్థులను ఆరుబయటకు పంపడం అనేది భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ లకు విరుద్ధం. అలాగే ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం మానవ హక్కుల పరిరక్షణ చట్టం నిబంధనల ప్రకారం ఇది హక్కుల ఉల్లంఘనే అని ఆయన వాదించారు. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ.. పిటిషన్‌లో పేర్కొన్న ఆరోపణలు నిజమైతే అది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టం చేసింది. అందుకే తక్షణమే జోక్యం చేసుకుని కలెక్టర్‌ను వివరణ కోరింది. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకునే పేద, గిరిజన విద్యార్థుల ఆరోగ్యం, ఆత్మగౌరవం, విద్యా హక్కులను కాపాడాల్సిన కనీస బాధ్యత అధికారులపై ఉందని న్యాయవాది బాలచందర్ రెడ్డి గుర్తుచేశారు. ఈ ఉదంతం అట్టడుగు వర్గాలకు చెందిన విద్యాసంస్థల్లో మౌలిక వసతుల పట్ల ప్రభుత్వ యంత్రాంగం చూపుతున్న నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.






