హిమాయత్ సాగర్‌కు భారీగా వరద.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు జీహెచ్ఎంసీ హెచ్చరిక

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-07 15:27:24  IST  )

హైదరాబాద్ వ్యాప్తంగా కురుస్తోన్న భారీ వర్షానికి హిమాయత్ సాగర్ కు వరద పోటెత్తింది. దీంతో రాత్రికి ఒక గేటు ఎత్తి నీటిని విడుదల చేయనున్నట్లు జీహెచ్ఎంసీ తెలిపింది.

హిమాయత్ సాగర్‌కు భారీగా వరద.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు జీహెచ్ఎంసీ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. సుమారు మూడు గంటలుగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండటంతో జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండుకుండలను తలపిస్తున్నాయి. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో అత్యధికంగా 12.3, శ్రీనగర్ కాలనీలో 11.1, యూసుఫ్గూడ 10.4, ఖైరతాబాద్ - 10.8 ఉప్పల్ -9.5, ఎల్బీనగర్ 9.3, బంజారాహిల్స్ 9, నాగోల్ -8.5, గోల్కొండ 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

హిమాయత్ సాగర్ కు భారీగా వరదనీరు వస్తుండటంతో గురువారం రాత్రి 10 గంటలకు ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తామని జీహెచ్ఎంసీ వెల్లడించింది. మూసీనదికి దిగువన నివసించేవారు జాగ్రత్తగా ఉండాలని, నది ఒడ్డున ఉన్న ప్రాంతాలకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ఎప్పటికప్పుడు అన్ని విభాగాల అధికారులు పరిస్థితిని సమీక్షించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు జీహెచ్ఎంసీ సూచించింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం 040 - 211 11 111 లేదా 100కు డయల్ చేయాలని తెలిపింది.

Next Story