- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైవే ప్రయాణం ఇక ‘స్మార్ట్’! జాతీయ రహదారులకు ‘డిజిటల్’ హంగులు
జాతీయ రహదారులకు కేంద్ర ప్రభుత్వం ‘హైటెక్’ హంగులను అద్దుతున్నది. ప్రయాణ అనుభవాన్ని మెరుగుపర్చేందుకు సాంకేతికతను జత చేస్తుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ రహదారులకు కేంద్ర ప్రభుత్వం ‘హైటెక్’ హంగులను అద్దుతున్నది. ప్రయాణ అనుభవాన్ని మెరుగుపర్చేందుకు సాంకేతికతను జత చేస్తుంది. హైవేలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వాహనదారులకు అరచేతిలో అందేలా కొత్త వేదికలను తీసుకువస్తున్నది. డిజిటల్ టోలింగ్ వంటి అధునాతన వ్యవస్థలతో అంతరాయం లేని ప్రయాణానికి మార్గం సుగమం చేస్తున్నది. టెక్నాలజీ సహాయంతో జాతీయ రహదారుల నిర్వహణను సైతం మరింత మెరుగుపరుస్తున్నది.
60 శాతం పెరిగిన హైవేస్
63 లక్షల మీటర్లకు పైగా రహదారులతో భారతదేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్‌గా ఉన్నది. 2013-14 వరకు దేశంలో 91,287 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండగా, ఇప్పుడు 60 శాతం పెరిగి 1,46,204 కిలోమీటర్లకు చేరుకున్నది. పదకొండేళ్లలో 54,917 కిలోమీటర్ల హైవేస్ నిర్మాణం జరిగింది. దీనికి తగ్గట్టే వాహనాలు, ప్రయాణికుల సంఖ్య సైతం పెరిగింది.
‘ఫాస్టాగ్’తో నాన్ స్టాప్ జర్నీ
టోల్ వసూలు కోసం తీసుకువచ్చిన ‘ఫాస్టాగ్’తో నిమిషం కూడా నిలబడాల్సిన అవసరం లేకుండా వాహనాలు ఇప్పుడు టోల్ గేట్లు దాటుతున్నాయి. దేశవ్యాప్తంగా 8 కోట్ల మందికి పైగా వినియోగదారులు ఫాస్టాగ్ వాడుతున్నారు. ఇటీవల నాన్-కమర్షియల్ వాహనాల కోసం ఫాస్టాగ్ వార్షిక పాస్ సదుపాయం సైతం ప్రారంభించారు. రూ.3 వేలు చెల్లిస్తే ఏడాది పాటు లేదా 200 టోల్ ప్లాజాలను దాటవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న 1,150 టోల్ ప్లాజాల్లో ఇది పనిచేస్తుంది. ఇప్పటికే 25 లక్షలకు పైగా వినియోగదారులు ఫాస్టాగ్ వార్షిక పాస్ పొందారు. రూ.5.67 కోట్లకుపైగా టోల్ లావాదేవీలు నమోదయ్యాయి.
మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్
దేశంలో తొలి మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో(ఎంఎల్ఎఫ్ఎఫ్) టోలింగ్ వ్యవస్థను కేంద్రం గుజరాత్‌లో ఎన్‌హెచ్-48పై 2025 ఆగస్టులో చోర్‌యాసీ టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసింది. ఇది బారియర్-ఫ్రీ, కెమెరా, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్ఐడీ) ఆధారిత వ్యవస్థ. వాహనం వెళ్తుండగానే ఫాస్టాగ్, వాహన నంబర్‌ను ఇది నమోదు చేస్తుంది. దీని ద్వారా వాహనాలను ఆపకుండానే సులభంగా టోల్ వసూలు చేయొచ్చు. తద్వారా రద్దీని తగ్గించవచ్చు.
అరచేతిలో సకల సమాచారం..
హైవేలపై ప్రయాణించే వారి కోసం కేంద్రం తెచ్చిన రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌లో హైవేలు, టోల్ ప్లాజాలు, సమీపంలో ఉండే పెట్రోల్ పంప్‌లు, ఆస్పత్రులు, ఈవీ చార్జింగ్ స్టేషన్లు వంటి సౌకర్యాల వివరాలతోపాటు వాతావరణ సమాచారం కూడా ఎప్పటికప్పుడు అందుతున్నది. ఫాస్టాగ్ సేవలనూ ఇందులో పొందవచ్చు. భద్రతకు ప్రాధాన్యతనిస్తూ స్పీడ్ లిమిట్ అలర్ట్స్ కూడా ఈ యాప్‌లో వస్తుంటాయి. హైవేలకు సంబంధించి రోడ్డుపై గుంతలు, నిర్వహణ సరిగ్గా లేకపోవడం, ఆక్రమణలు, భద్రతా అంశాలపై ఈ యాప్ ద్వారా ఫిర్యాదు కూడా చేయవచ్చు. జియో-ట్యాగ్ ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చు. ఫిర్యాదుల పురోగతిని ట్రాక్ చేయవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో 4.5 స్టార్ రేటింగ్‌తో ఓవరాల్ ర్యాంకింగ్‌లలో రాజ్‌మార్గ్ యాత్ర యాప్ 23వ స్థానం, ట్రావెల్ విభాగంలో రెండవ స్థానంలో ఉంది. ఈ యాప్‌ను ఇప్పటికే 15 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు.
ఎన్‌హెచ్ఏఐ వన్ యాప్..
రహదారుల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచేందుకు, ప్రాజెక్టుల నిర్మాణం సమయానికి పూర్తయ్యేలా చూసేందుకు, అంతర్గత ప్రక్రియలను, సమన్వయాన్ని సులభతరం చేసేందుకు ఎన్‌హెచ్ఏఐ వన్ పేరుతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక యాప్‌ను ప్రారంభించింది. క్షేత్రస్థాయి సిబ్బంది హాజరు, హైవేల నిర్వహణ, రహదారి భద్రతా తనిఖీలు(రోడ్ సేఫ్టీ ఆడిట్స్), మరుగుదొడ్ల నిర్వహణ, రోజువారీ నిర్మాణ తనిఖీలు వంటివి ఎప్పటికప్పుడు ఈ యాప్‌లో నమోదు చేస్తారు. ప్రాంతీయ అధికారులు (ఆర్వో), ప్రాజెక్ట్ డైరెక్టర్(పీడీ)ల నుంచి కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు, సేఫ్టీ ఆడిటర్లు, టోల్ ప్లాజాల దగ్గర టాయిలెట్ సూపర్‌వైజర్ల వరకు ఈ యాప్‌లో రోజువారీ కార్యకలాపాలను నమోదు చేయాల్సి ఉంటుంది. జియో ట్యాగింగ్, టైమ్ స్టాంపింగ్ వంటి ఫీచర్లతో ఈ యాప్ జవాబుదారీతనాన్ని, కచ్చితత్వాన్ని పెంచుతున్నది.
ప్రాజెక్ట్ ఇన్‌ఫర్మేషన్ సైన్ బోర్డులు
హైవేలపై ఎన్‌హెచ్ఏఐ ప్రాజెక్ట్ ఇన్‌ఫర్మేషన్ సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నది. క్యూఆర్ కోడ్‌లతో ఇవి ఉంటాయి. ప్రాజెక్టు వివరాలు, ఎమర్జెన్సీ హెల్ప్ లైన్‌లు, సమీపంలో ఉండే ఆస్పత్రులు, పెట్రోల్ పంపులు, ఈవీ చార్జింగ్ స్టేషన్లు వంటి వివరాలను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పొందవచ్చు.
నెట్‌వర్క్ సర్వే వెహికల్స్
జాతీయ రహదారుల నిర్వహణ పకడ్బందీగా మార్చేందుకు నెట్‌వర్క్ సర్వే వెహికల్స్(ఎన్ఎస్‌వీ)ను ఎన్‌హెచ్ఏఐ ఏర్పాటు చేస్తున్నది. ఈ వాహనాలకు త్రీడీ లేజర్ వ్యవస్థలు, 360 డిగ్రీల కెమెరాలు ఉంటాయి. 23 రాష్ట్రాల్లో 20,933 కిలోమీటర్ల మేర ఇవి పనిచేస్తున్నాయి. ఇవి రోడ్డు సమస్యలను ఆటోమెటిక్‌గా గుర్తిస్తాయి. తద్వారా వీటిని పరిష్కరించే అవకాశం ఉంటుంది.






