అసైన్డ్ భూముల్లో హై రైజ్ బిల్డింగ్స్

by Malleboina Mahesh |

అభివృద్ధికి, ఐటీ సంస్థలకు కేరాఫ్ అడ్రస్ శేరిలింగంపల్లి. ఇక్కడ గజం భూమి ధర రూ.3 లక్షల వరకు ఉంటుంది. గత ప్రభుత్వం అసైన్డ్ భూములను వేలం వేస్తే రూ. ఎకరం రూ.60 కోట్ల వరకు పలికింది.

అసైన్డ్ భూముల్లో హై రైజ్ బిల్డింగ్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అభివృద్ధికి, ఐటీ సంస్థలకు కేరాఫ్ అడ్రస్ శేరిలింగంపల్లి. ఇక్కడ గజం భూమి ధర రూ.3 లక్షల వరకు ఉంటుంది. గత ప్రభుత్వం అసైన్డ్ భూములను వేలం వేస్తే రూ. ఎకరం రూ.60 కోట్ల వరకు పలికింది. ఐటీ సంస్థలు, స్టార్ హోటల్స్ కొలువుదీరిన మాదాపూర్ ప్రాంతంలో సైతం భూములకు ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో దానికి ఆనుకునే ఉన్న ఖానా మెట్ లోని అసైన్డ్ ల్యాండ్స్ కు వ్యాల్యూ పెరిగింది. ఇదే అదునుగా అక్కడ కొందరు వాటిని కొనుగోలు చేశామంటున్నారు. ఫలితంగా హైటెక్ సిటీ దగ్గరలో రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ, అసైన్డ్ భూములు వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. విచ్చలవిడిగా భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. అంతా తెలిసినా శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ వెంకారెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ ప్రదీప్ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కేవలం నోటీసులతో సరిపెట్టడం పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని ప్రాంతాలకు వెళ్తున్న హైడ్రా.. ఇక్కడ మాత్రం ఎందుకు అడుగు పెట్టడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసైన్డ్ భూముల విషయంలో అన్ని ప్రాంతాల్లో ఒకే తరహా చర్యలు చేపట్టాలనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.

మొక్కుబడిగా నోటీసులు..

శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ సర్వే నం.41/5, 43, 45, 46, 50, 58, 59, 60, 64 ల్లోని ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు. నకిలీ, బోగస్ పత్రాలతో వీటిని సొంతం చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏ ఆధారాలతో ప్రభుత్వ భూములను తమవిగా క్లెయిమ్ చేస్తున్నారో సెప్టెంబర్ మూడో తేదీలోగా డాక్యుమెంట్లు సమర్పించాలని శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ వెంకారెడ్డి నోటీసులు జారీ చేశారు. ఇందులో ప్రభుత్వ భూములను గోటూరి అమర్ నాథ్ రెడ్డి అన్యాక్రాంతం చేస్తున్నట్లు ఆరోపణలపై నోటీసులు జారీ చేసినట్లుగా లేఖ నం.బి/1002/2005, తేదీ.25.08.2025న పేర్కొన్నారు. అది కూడా ఉప్పల్ శ్రీకాంత్ గౌడ్ రెండు సార్లు ఫిర్యాదు చేయడం వల్ల నోటీసులు ఇచ్చినట్లుగా రెఫరెన్స్ లో ప్రస్తావించారు. అంటే ప్రభుత్వ, అసైన్డ్, యూఎల్సీ ల్యాండ్స్ ను కాపాడే బాధ్యత అధికారులది కాదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. మరోవైపు వీటి గురించి అడిగిన వారిపై శేరిలింగంపల్లి డిప్యూటీ తహశీల్దార్ ప్రదీప్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.

అది అసైన్డ్‌ ల్యాండ్..

సర్వే నం.41/5లో రెండు ఎకరాల భూమిని కటిక రామయ్యకు 1961లో ప్రభుత్వం కేటాయించింది. ఆయన చనిపోయిన తర్వాత బాలయ్య, మరో ముగ్గురు వారసులకు విరాసత్ అయ్యింది. వాళ్లు జీపీఏ ఇచ్చారు. ఆ జీపీఏ ద్వారానే అమర్ నాథ్ రెడ్డితోపాటు పలువురు కొనుగోలు చేశారు. 41/5లో 29 మంది కొనుగోళ్లు చేశారు. దీనిపై పలు కేసులు హైకోర్టులో పెండింగులో ఉన్నాయి. అలాగే సర్వే నం.43, 45, 46, 50, 58, 59, 60, 64 లోని ల్యాండ్ ప్రభుత్వానిది కాదు. ఇది గురుకుల్ ట్రస్ట్ కి చెందిన పట్టా ల్యాండ్. ధరణి, భూ భారతిలోనూ ఇదే ఉంది. 1950 నుంచి ప్రొటెక్టెడ్ టెనెంట్స్ గా అనేక మంది పేర్లు రికార్డుల్లో ఉన్నాయి. ఈ గురుకుల్ ట్రస్ట్ భూములపైనా సుప్రీం కోర్టులో కేసులు ఉన్నాయి. ఇదంతా డిప్యూటీ కలెక్టర్ జారీ చేసిన నోటీసుకు సమాధానంగా అమర్ నాథ్ రెడ్డి ఇచ్చిన రిప్లయ్ లోనే ఉన్నది.

41/5లోని ల్యాండ్ అసైన్డ్ అయినప్పుడు కొనుగోళ్లు ఎలా చెల్లుబాటు అవుతాయో అధికారులకే తెలియాలి. ఇంతకాలంగా ప్రొహిబిటెడ్ లిస్టులో ఈ సర్వే నంబర్లను చేర్చినప్పుడు కొనుగోలుదార్లు ప్రశ్నించలేదు. ఇప్పుడేమో అసైన్డ్ ల్యాండ్స్ ను తాము కొనుగోలు చేశామని డిక్లరేషన్ ఇచ్చినప్పటికీ.. చర్యలు తీసుకోవడం లేదు. కనీసం ఈ మేరకు నివేదికను డిప్యూటీ కలెక్టర్ వెంకారెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ ప్రదీప్ ఉన్నతాధికారులకు పంపకపోవడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని ఫిర్యాదుదారులు చెబుతున్నారు. అదే మండలంలోని మిగతా అసైన్డ్ ల్యాండ్స్ కు ట్రాన్సాక్షన్స్ ను అనుమతిస్తారా అని ప్రశ్నిస్తున్నారు.

మీకెందుకంటున్న అధికారులు

ప్రజాప్రయోజనాల కోసం చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్ మండలాల్లో వేలాది ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం సేకరిస్తున్నది. పలు ప్రాజెక్టులను డిజైన్ చేసింది. అయితే హైటెక్ సిటీకి పక్కనే ఉన్న అసైన్డ్ ల్యాండ్స్ లో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఖానామెట్ లోని అసైన్డ్ ల్యాండ్స్ లో అక్రమ నిర్మాణాలకు పునాదిరాళ్లు పడ్డప్పటి నుంచి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. అయినా రెవెన్యూ యంత్రాంగం తమకేం పట్టనట్లు వ్యవహరించిందనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే నెలల కాలంలోనే బహుళ అంతస్థుల భవనాలు వెలిశాయి. తాజాగా కూడా అనేక నిర్మాణాలు పునాది దశలో ఉన్నప్పుడు కూడా ఫిర్యాదు చేస్తే.. పూర్తయ్యే వరకు నోటీసులతో కాలయాపన చేస్తున్నారు.

సిటీకి 30, 40 కి.మీ. దూరంలో ఉండే అసైన్డ్ పట్టాదారులకు, హైటెక్ సిటీకి పక్కనే ఉన్న అసైన్డ్ పట్టాదారులకు మధ్య వ్యత్యాసం ఎందుకు ఉన్నదో అధికారులే చెప్పాలి. ‘ఖానామెట్ వాళ్లు అమ్ముకోవచ్చు. కానీ మొయినాబాద్, షాబాద్ మండలాల పేద దళిత, బహుజన అసైన్డ్ రైతులు మాత్రం ప్రభుత్వానికి అప్పగించి నామమాత్రపు నష్టపరిహారం పొందాలా? అని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని మీడియా ప్రశ్నిస్తే శేరిలింగంపల్లి డీటీ ప్రదీప్, డిప్యూటీ కలెక్టర్ వెంకారెడ్డిలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేవలం నోటీసులకే పరిమితమవుతున్న అంశంపై మాట్లాడితే మీకెందుకు అని చెబుతుండడం గమనార్హం.

అది ప్రభుత్వానిదే ..

రెవెన్యూ రికార్డుల ప్రకారం ఖానామెట్‌ సర్వే నం.41లో మొత్తం 252.24 ఎకరాలుగా నమోదైంది. అదంతా ప్రభుత్వానిదే. సర్వే ల్యాండ్‌ రికార్డుల ఏడీ లేఖ జి8/2567/93, శేరిలింగంపల్లి తహశీల్దార్‌ లేఖ నం.సి/449/93 (తేదీ.1-7-1993) ప్రకారం సర్వే నం.4, 5, 8, 41లో ముస్తాఖ్‌ హుస్సేన్‌, మరో ఆరుగురికి లావునీ పట్టాలు ఉన్నాయంటూ, వారికి అనుకూలంగా సర్వే ల్యాండ్ రికార్డుల ఏడీ సప్లిమెంటరీ సేత్వార్‌ను జారీ చేశారు. దీంతో సీసీఎల్‌ఏ అప్పీల్స్‌ డైరెక్టర్‌ దగ్గర కేసు వేశారు. ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు లావునీ పట్టాలు ఇచ్చినట్లుగా ఉన్నాయి. 1992-93లో కేవలం జీరాక్స్‌ లావునీ పట్టాలు (ఫైల్‌ నం.ఎ3/ఇ1/11993/60, తేదీ.8-4-1961) చూసి సప్లిమెంటరీ సేత్వార్‌ను రూపొందించారు. ఆ కాలంలో లావునీ పట్టాలన్నీ తెలుగులో ఉన్నాయి.

సర్వే ల్యాండ్‌ రికార్డుల ఏడీ సమర్పించినవి ఇంగ్లీషులో ఉన్నాయి. పైగా 1961 నాటి అధికారుల సంతకంతో సరిపోలడం లేదని కలెక్టర్‌ ధ్రువీకరించారు. అసైన్‌మెంట్‌ పొందిన వారెవరూ హైదరాబాద్‌ స్టేట్‌ ఫోర్స్‌ లో పని చేసిన ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కేటగిరి పరిధిలో లేరు. ఆ కాలంలో అలాంటి టైప్‌రైటర్లు లేవన్నది రెవెన్యూ వర్గాల వాదన. పైగా అప్పటి అధికారుల సంతకాలతో దరఖాస్తుదారులు సమర్పించిన లావునీ పట్టాల్లోని సంతకాలను ఎఫ్‌ఎస్‌ఎల్‌ హైదరాబాద్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ పరిశీలించారు. సంతకాలు సరిపోలడం లేదంటూ ఫైల్‌ నం.ఎ4/12573/61 ద్వారా ఫోర్జరీ చేసినట్లుగా తేల్చారు. ఇదంతా పరిశీలించిన సీసీఎల్‌ఏ డైరెక్టర్‌ ఆఫ్‌ అప్పీల్స్‌ 1993లో జారీ చేసిన సప్లిమెంటరీ సేత్వార్‌ను రద్దు చేయాలని ఉత్తర్వులు టీ2/1001/2005 (తేదీ.9.4.2008) జారీ చేశారు. ఇందులో సర్వే నం.4, 5, 8, 9, 10, 41/9, 41/9, 41/10, 41/11, 41/12, 41/13, 41/14లో జారీ చేసిన అసైన్‌మెంట్లు అక్రమమైనవని ధ్రువీకరించారు.

రెండో సారి నోటీసులు

సర్వే నం.41లోని అసైన్డ్ ల్యాండ్స్ లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, చర్యలు తీసుకోవాలని ఒకరు ఫిర్యాదు చేస్తే డిప్యూటీ కలెక్టర్ వెంకారెడ్డి నోటీసులు జారీ చేశారు. మొదటి సారి నోటీసులు జారీ చేసిన కొన్నాళ్లకు అక్రమార్కుల్లో ఒకరు తాము అసైన్డ్ ల్యాండ్స్ ను కొనుగోలు చేసినట్లు అంగీకరించారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా కూడా రాసిచ్చారు. అయినా చర్యలు తీసుకోకుండా రెండోసారి నోటీసులు జారీ చేశారు. ఈ సారి ఎన్ని నెలల పాటు కాలయాపన చేస్తారో చూడాలి. ఇల్లీగల్ బిల్డింగ్స్, నిర్మాణాలు అని గుర్తించగానే హైడ్రా కూల్చివేతకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. అయితే శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు మాత్రం నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నారు. ఈ లోగా వీళ్లు బదిలీపైన మరో చోటికి వెళ్లడానికి అవకాశం ఉంటుందన్న ఆలోచన తెర వెనుక ఉన్నట్లు కనిపిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story