ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠంపై హైకోర్టు కీలక తీర్పు.. 3 వారాల్లో ఎన్నిక ముగించాలని ఆదేశం

by Kema Shiva Kumar |

ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికను మూడు వారాల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్, కలెక్టర్‌ను ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది.

ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠంపై హైకోర్టు కీలక తీర్పు.. 3 వారాల్లో ఎన్నిక ముగించాలని ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: వివాదానికి కేంద్ర బిందువుగా మారిన ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. ఈ ఎన్నికల ప్రక్రియను రాబోయే మూడు వారాల్లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను (SEC), రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. కౌన్సిలర్లు ఎవరి ఒత్తిడికి లోనవ్వకుండా స్వచ్ఛందంగా తమ మద్దతును తెలుపుకునేలా చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. చైర్మన్ ఎన్నికపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఎన్నికల రిటర్నింగ్ అధికారిదేనని కోర్టు తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఉన్న సందిగ్ధతను తొలగించి ఎన్నికల ప్రక్రియను మూడు వారాల్లోగా పూర్తి చేసి, నూతన పాలకవర్గాన్ని ప్రకటించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

కాగా, మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగాల్సిన సమయంలో 19వ వార్డు బీఆర్ఎస్ (BRS) కౌన్సిలర్ ఆకుల యాదగిరి కనిపించకుండా పోవడం కలకలం రేపింది. దీంతో తన తండ్రిని ప్రత్యర్థి పార్టీ నేతలు కిడ్నాప్ చేశారంటూ యాదగిరి కుమారుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియపై స్టే విధించింది. అయితే, స్టే ఉత్తర్వులు వచ్చే సమయానికే ఎన్నిక ముగిసిందని, బీఆర్ఎస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి మెజారిటీ సాధించారని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను మూడు వారాల్లోపు పూర్తి చేయాలని తుది తీర్పును వెలువరించింది.

Next Story