బ్రేకింగ్.. స్థానిక ఎన్నికలపై ముందుకు వెళ్లొచ్చన్న హైకోర్టు.. కానీ వన్ కండీషన్

by Naga Rani Yarlagadda |

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది.

బ్రేకింగ్.. స్థానిక ఎన్నికలపై ముందుకు వెళ్లొచ్చన్న హైకోర్టు.. కానీ వన్ కండీషన్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. 42 శాతం బీసీ రిజర్వేషన్లను హైకోర్టు అడ్డుకున్న విషయం తెలిసిందే. స్థానిక ఎన్నికలపై నోటిఫికేషన్ విడదలవ్వగా.. దానిపై కూడా హైకోర్టు స్టే విధించింది. తాజాగా.. హైకోర్టే స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లొచ్చని శుక్రవారం అర్థరాత్రి (అక్టోబర్ 10) ఆర్డర్ కాపీ జారీ చేసింది. గడువు తీరిన స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు పాతవిధానం ప్రకారం ఎన్నికల సంఘం ముందుకు వెళ్లవచ్చని ఆర్డర్ కాపీలో హైకోర్టు పేర్కొంది. రిజర్వేషన్లపై 50 శాతానికి మించొద్దని సూచించింది.

దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీ సీట్లుగా గుర్తించి ఎన్నికలకు వెళ్లవచ్చని 2022లో సుప్రీంకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు గుర్తుచేసింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లను హైకోర్టు నిలిపివేయడంతో.. దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీ కింద గుర్తించి.. ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్లవచ్చని స్పష్టం చేసింది. ఇక్కడ దామాషా సీట్లు అంటే.. ఎన్నికలలో ముఖ్యంగా పంచాయతీలు, స్థానిక సంస్థలు లేదా పార్టీలలో సీట్లను ప్రాపోర్షనల్ రిప్రజెంటేషన్ పద్ధతి ప్రకారం కేటాయించడం. దీనిని "దామాషా" (Damaasha) పద్ధతి అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఓటు షేర్ లేదా జనాభా ఆధారంగా సీట్లు విభజిస్తారు.

హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీలో.. వికాస్ కిషన్ రావు గవాలి కేసును పరిగణనలోకి తీసుకుని జీఓ9,41,42లను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ జీఓ నంబర్ 9 జారీ చేయడంతో రిజర్వేషన్లు 67 శాతానికి చేరతాయన్న కోర్టు.. జీఓ జారీ చేయకముందుకు ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, ఓబీసీలకు 25 శాతం.. మొత్తం 50 శాతం రిజర్వేషన్లు ఉన్నాయంది. ఆ రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని తెలిపింది.

కాగా.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. హైకోర్టు ఆర్డర్ కాపీ ఆధారంగా.. బీసీ రిజర్వేషన్లపై విచారణ చేయాలని స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Next Story