హరీశ్‌రావు వనపర్తి పర్యటనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఎస్పీ ఆదేశాలు రద్దు

by Kema Shiva Kumar |

వనపర్తిలో హరీశ్‌రావు సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. గొల్లపల్లి రిజర్వాయర్ నిర్వాసిత రైతులకు సంఘీభావం తెలపడానికి ఆయన రేపు వనపర్తి వెళ్లనున్నారు.

హరీశ్‌రావు వనపర్తి పర్యటనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఎస్పీ ఆదేశాలు రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) వనపర్తి పర్యటనకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) అనుమతి మంజూరు చేసింది. ఈ పర్యటనకు అనుమతి నిరాకరిస్తూ జిల్లా ఎస్పీ ఇచ్చిన ఆదేశాలను కోర్టు కొట్టివేసింది. రేపు నియోజకవర్గంలో హరీశ్ రావు సభ నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. వనపర్తి జిల్లాలోని గొల్లపల్లి రిజర్వాయర్ (Gollapalli Reservoir) నిర్మాణానికి వ్యతిరేకంగా గత కొంతకాలంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. నిర్వాసిత రైతులకు సంఘీభావం తెలిపేందుకు, వారి సమస్యలపై పోరాడేందుకు హరీశ్ రావు రేపు వనపర్తి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం ముందుగా అనుమతులు తీసుకున్నప్పటికీ, చివరి నిమిషంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందంటూ జిల్లా ఎస్పీ ఆ అనుమతులను రద్దు చేశారు.

కోర్టును ఆశ్రయించిన హరీశ్ రావు..

పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హరీశ్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాయడం సరికాదని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. వాదనలు విన్న హైకోర్టు.. పోలీసుల అభ్యంతరాలను తోసిపుచ్చుతూ సభ నిర్వహణకు అనుమతి ఇచ్చింది. అయితే, నిబంధనల ప్రకారం శాంతియుతంగా సభ నిర్వహించుకోవాలని సూచించింది. హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ శ్రేణులుచ, గొల్లపల్లి రిజర్వాయర్ పోరాట రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story