TG: పెండింగ్ సాదాబైనామాలకు మోక్షం.. 9 లక్షల కుటుంబాలకు ఊరట

by Gantepaka Srikanth |

రాష్ట్ర వ్యాప్తంగా ఆరేండ్లుగా పెండింగులోని ఉంచిన 9 లక్షల దరఖాస్తులకు మోక్షం లభించింది. సాదాబైనామాల కింద కొనుగోలు చేసిన భూముల క్రమబద్ధీకరణలో నెలకొన్న న్యాయ పరమైన చిక్కులు తొలిగాయి.

TG: పెండింగ్ సాదాబైనామాలకు మోక్షం.. 9 లక్షల కుటుంబాలకు ఊరట
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ఆరేండ్లుగా పెండింగులోని ఉంచిన 9 లక్షల దరఖాస్తులకు మోక్షం లభించింది. సాదాబైనామాల కింద కొనుగోలు చేసిన భూముల క్రమబద్ధీకరణలో నెలకొన్న న్యాయ పరమైన చిక్కులు తొలిగాయి. మంగళవారం హైకోర్టు పెండింగులో ఉన్న అప్లికేషన్లను క్లియర్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ చేసింది. వీటిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్ ని డిస్మిస్ చేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆర్వోఆర్ 1971, ఆర్వోఆర్ 2020 చట్టాల మధ్య నెలకొన్న టెక్నికల్ ఇష్యూస్ తో ఇన్నేండ్లుగా అపరిష్కృతంగా ఉన్నాయి. న్యాయపరమైన వివాదాలు తలెత్తుతాయని తెలిసి కూడా అప్పటి సీఎస్ సోమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం. ఓ వైపు అప్లికేషన్లు తీసుకున్నారు. మరోవైపు వాటిని పరిష్కరించేందుకు అవసరమైన చట్టంలోని అంశాలను తొలగించారు. దాంతో దాఖలైన కేసు ఇన్నాండ్లుగా నడిచింది. తాజాగా హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం భూ భారతి చట్టం కింద వీటిని పరిష్కరించేందుకు ఎలాంటి చిక్కులు ఉండవు. ఐతే ఇప్పటికే సాదాబైనామా దరఖాస్తులను కొన్ని మండలాల్లో పరిశీలించారు. గ్రౌండ్ రిపోర్ట్ కూడా సిద్ధం చేయాలని సీసీఎల్ఏ మౌఖికంగా ఆదేశించారు. దాంతో రిపోర్ట్ ని రూపొందించేందుకు అవసరమైన వ్యవస్థను కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లు రూపొందించారు.

ఆరేండ్లుగా ఎదురుచూపులు

గత ప్రభుత్వం 2020 అక్టోబరులో జీవో 112 ద్వారా సాదాబైనామాల క్రమబద్ధీకరణకు దరఖాస్తులను స్వీకరించింది. 2020 అక్టోబరు 10 నుంచి 29 తేదీ వరకు 2,26,693 దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత ఆర్వోఆర్ 2020 ని అమల్లోకి వచ్చింది. అందులో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం లేదు. ఐనా అది అమల్లోకి వచ్చిన తర్వాత 2020 అక్టోబరు 29 వరకు 6,74,201 అప్లికేషన్లు వచ్చాయి. అంటే 9 లక్షల వరకు వచ్చాయి. ఐతే ఆర్వోఆర్ 2020లో వీటి పరిష్కార మార్గాలను క్లోజ్ చేశారు. దాంతోనే ఎలా చేస్తారని, ఏ చట్టం ప్రకారం క్రమబద్ధీకరిస్తారంటూ కోర్టుకు వెళ్లారు. ఇప్పుడా సమస్య తలెత్తకుండా ఆర్వోఆర్ 2025లో పెండింగ్ దరఖాస్తుల వరకు ప్రొవిజన్ కల్పించారు. కొందరేమో సాదాబైనామాల దరఖాస్తులపై కోర్టులో కేసు ఉందని, స్టే ఆర్డర్ ఉన్నప్పుడు ఎలా చేస్తారంటూ వాదిస్తున్నారు. ఐతే ఆ కేసు చట్టంలో ఎలాంటి ప్రొవిజన్ లేనప్పుడు ఎలా చేస్తారన్న అంశంపైనే.. ఇప్పుడా అవకాశం కొత్త చట్టంలో కల్పిస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదని రెవెన్యూ నిపుణులు అంటున్నారు. స్టే వెకేట్ చేసిన తర్వాతే మొదలు పెట్టాలన్న అవసరం కూడా లేదంటున్నారు. దానికి తోడు 2020 అక్టోబరు 29 వరకు దాఖలైన 2.26 లక్షల దరఖాస్తుల పరిష్కారం ఎప్పుడైనా చేసే వీలున్నది. దానిపై ఎలాంటి పేచీ లేదని గుర్తు చేస్తున్నారు. దీనిపై అనవసర రాద్దాంతం చేయడం ద్వారా దరఖాస్తుదారుల సహనాన్ని పరీక్షించడమేనంటున్నారు. ఆరేండ్లుగా భూ హక్కుల కోసం నిరీక్షిస్తున్నారు.

5(ఎ), 5(బి) తొలగింపుతోనే సమస్య

ఆర్వోఆర్ 1971 యాక్ట్ అమల్లోకి వచ్చినప్పుడు ఈ సాదాబైనామాలకు అవకాశం ఇవ్వొద్దని డిసైడ్ చేశారు. కానీ కొంత కాలానికి భాగ పంపకాలు, నోటి మాట, తెల్ల కాగితాల ద్వారా కొనుగోళ్లు తెలంగాణలో సాధారణమని జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు. దాని ఫలితంగానే ఆర్వోఆర్ యాక్ట్ 1971లో 5 ఎ, 5 బి సెక్షన్లు తర్వాత అమెండ్మెంట్ చేశారు. 5ఎ ద్వారా అన్ రిజిస్టర్ డాక్యుమెంట్ల రెగ్యులరైజేషన్, వాటిపై 5బి కింద ఆర్డీవోకు అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి నిర్దేశించారు. ఈ రెండు సెక్షన్లు 1989లో చేర్చడం గమనార్హం. దాంతో 1971–1989 మధ్య కాలంలో ప్రభుత్వం భూమి ఎట్లా సంక్రమించినా.. అది వాస్తవమైతే రికార్డులకు ఎక్కించాలని నిర్ణయించింది. ఆర్వోఆర్ 1971 యాక్టులో రూల్ పొజిషన్ లో తహశీల్దార్ కి దరఖాస్తు చేసుకుంటే విచారించారు. స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చేవారు. ఆ ఆర్డర్ కాపీ విలువైనదిగా మారింది. ఐతే ఆర్వోఆర్ 2020లో ఈ రెండు సెక్షన్లను తొలగించారు. కానీ అప్లికేషన్లను మాత్రం స్వీకరించారు. ఏ చట్టం ప్రకారం క్రమబద్ధీకరిస్తారన్న ఫిర్యాదుతోనే కోర్టు స్టే విధించింది. ఐతే భూభారతి చట్టం ఆర్వోఆర్ 2025లో పెండింగులోని సాదాబైనామా అప్లికేషన్ల వరకు పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. దాంతో స్టే వెకెట్ అయ్యింది.

Next Story