- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కమలం’ నేతలపై హైకమాండ్ ఫోకస్..! రేవంత్ అనుకూల వర్గం చిట్టా సిద్ధం?
తెలంగాణలో కమలం పార్టీ బలోపేతానికి హై కమాండ్ నడుం బిగించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కమలం పార్టీ బలోపేతానికి హై కమాండ్ నడుం బిగించింది. పార్లమెంటు సీట్ల పరంగా ప్రతిపక్ష హోదాలో ఉండాల్సిన బీజేపీ ఎందుకు వెనకబడిందని సమాలోచనలు చేస్తున్నది. తెలంగాణ ప్రజలు పార్టీని ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నా స్థానిక నాయకులు ఎందుకు గుర్తించలేకపోతున్నారని, వారి మధ్య ఉన్న సమస్యలను పసిగట్టేందుకు హస్తిన పెద్దలు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆ పార్టీలోని పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు రేవంత్ ప్రభుత్వం తీసుకునే ప్రజావ్యతిరేక కార్యక్రమాలను విమర్శించడంలో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. వారి వ్యవహారంపై నిఘా పెట్టి పార్టీ నిర్మాణం చేయడంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారనే అంశాలను పరిశీలన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. కొంతమంది నాయకులు ఆర్థిక లబ్ధి పొందేందుకు అధికార పార్టీని ఒక మాట అనకుండా వారితో చీకటి ఒప్పందాలు చేసుకున్నట్లు ఇప్పటికే గుర్తించారు.
ఆధిపత్య పోరు తగ్గిస్తేనే భవిష్యత్..
ప్రభుత్వంతో అంటకాగే వారిని అలాగే వదిలేస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఆచరణలో సాధ్యం కాదని హస్తిన పెద్దలు అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రధాని మోడీ.. తెలంగాణ ఎంపీలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పార్టీ బలోపేతానికి మీకున్న సమస్యలు ఏమిటని ప్రశ్నించినట్లు సమాచారం. కమ్యూనిస్టు కంచుకోటను బద్దలు కొట్టిన పార్టీ..తెలంగాణలో ఎందుకు అధికారంలోకి రావడం లేదని నిలదీసినట్లు ప్రచారం జరుగుతోంది.ఇకపై ప్రజాసమస్యలపై పోరాడే నాయకులకే పార్టీలో సముచితం గౌరవం లభిస్తుందని, ప్రభుత్వంతో లోపాయికారి ఒప్పందాలు చేసుకునే వారు తమ దారి చూసుకోవచ్చని హెచ్చరించినట్లు ఎంపీల అనుచరులు వెల్లడించారు.నేతల మధ్య ఆధిపత్య పోరు తగ్గించుకుంటే రాజకీయ భవిష్యత్ ఉంటుందని, ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తే పార్టీ నుంచి సాగనంపక తప్పదని హెచ్చరించినట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.ఇప్పటికే ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి దూరంగా ఉన్నారు. ఎంపీలలో నలుగురు రేవంత్ ప్రభుత్వానికి టచ్‌లో ఉంటూ పైరవీలు పెద్ద మొత్తంలో చేసుకుంటున్నట్లు పార్టీ పెద్దలకు ఇప్పటికే రిపోర్టు అందింది.వారితో మరోసారి పెద్దలు భేటీ అయ్యి క్లాస్ పీకుతారని టాక్ వినిపిస్తోంది.
రేవంత్ అనుకూల వర్గం చిట్టా సిద్ధం..
రేవంత్ సర్కారుతో అనుకూలంగా ఉండే ఎంపీల జాబితాను రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలిసింది. బీజేపీ స్టేట్ చీఫ్ ఏ కార్యక్రమం చేపట్టినా సహకరించకుండా దూరంగా ఉన్నవారి వివరాలను సేకరిస్తున్నట్లు టాక్. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి కొందరు నేతలు కమలంలో చేరేందుకు సిద్దమైతే వారిని పార్టీలోకి రావొద్దని, ఇక్కడ ఫీడ్రమ్ ఉండదని, గ్రూపులు, ఒకే వర్గం నేతలదే పైచేయి ఉంటుందని చెప్పిన వారి జాబితాను కూడా రెడీ చేస్తున్నారు.అదే విధంగా చిన్న అంశాలపై ఫిర్యాదులు చేయడం, ఇతర పార్టీ నేతల ముందు పార్టీ గురించి తక్కువ చేసి మాట్లాడే వారిని గుర్తించి వేటు వేసేందుకు సిద్ధమైనట్లు పార్టీలో చర్చ సాగుతోంది. రాష్ట్ర ప్రజల సమస్యలపై ఎంపీలు, ఎమ్మెల్యేల స్పందన ఆశించిన విధంగా లేదు. ఇప్పటివరకు బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి మాత్రమే స్పందిస్తున్నారు.
ఫైర్ బ్రాండ్ కోసం హైకమాండ్ పాకులాట..
తెలంగాణలో పార్టీ ఆశించిన మేరకు ఎదగాలంటే బండి సంజయ్ కుమార్ లాంటి నేతలు ఈ సమయంలో అవసరమని పార్టీ గుర్తించినట్లు తెలిసింది. తెలంగాణ అధికార కాంగ్రెస్లో గ్రూపు తగాదాలు, వర్గపోరుతో సతమతం అవుతుండగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇంటి పోరుతో చతికిల పడింది.ఇలాంటి పరిస్ధితుల్లో పార్టీని చక్కదిద్దడం సులవైన పని, ఇలాంటి పనులు చేయకుండా ప్రజా సమస్యలపై స్పందించకుండా పార్టీ పిలుపు మేరకు పనిచేసే నేతలు అవసరం లేదనే అంచనాకు ఢిల్లీ పెద్దలు వచ్చినట్లు తెలిసింది.






