రాష్ట్రంలో జోరుగా వర్షాలు.. పంట బీమా పథకం కోసం రైతుల ఎదురుచూపులు

by Kema Shiva Kumar |

వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో అన్నదాతలు పంట బీమా కోసం ఎదురు చూస్తున్నారు.

రాష్ట్రంలో జోరుగా వర్షాలు.. పంట బీమా పథకం కోసం రైతుల ఎదురుచూపులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో అన్నదాతలు పంట బీమా కోసం ఎదురు చూస్తున్నారు. పాలకులు పంట సీజన్ ముందు హామీలు ఇవ్వడం తప్ప ఫైలు ముందుకు కదలడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ శాఖ విధి విధానాలు ఖరారు చేసినా బీమా కంపెనీలతో ఒప్పందం కుదరకపోవడంతో ఆలస్యం జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రెండు పంటలకు నష్టపోగా వచ్చే సీజన్ పంటలకైనా ప్రభుత్వం బీమా అమలు చేసి రైతులకు ధీమా కల్పించాలని వేడుకుంటున్నారు. ఇప్పటికే పంట కాలం మొదలై పత్తి, వరి, మిరప, మొక్కజొన్న సంబంధించి సాగు ప్రారంభించారు. వీలైనంత త్వరగా బీమా కంపెనీలతో ఒప్పందం చేసుకుని ప్రీమియం చెల్లించాలని కోరుతున్నారు.

ప్రతి ఏటా అకాల వర్షాలు, వడగళ్ల వానలతో కోట్లాది రూపాయల పంట నీటిపాలవుతోంది. గతంలో పంటల బీమా పథకం అమలులో ఉన్నప్పుడు ఆలస్యంగా అయినా నష్టపరిహారం అంది కొంతమేరైనా ఉపశమనం లభించేది. ఐదేళ్లుగా పంటల బీమా పథకం అమలు కావడం లేదు. దీంతో ప్రకృతి వైఫరీత్యాలు సంభవించినప్పుడల్లా రైతులు నిలువునా మునిగిపోతున్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించడంలో రాష్ట్రప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. 2024 వానాకాలం సీజన్‌ నుంచే పంటల బీమాను పునరుద్ధరిస్తామని చెప్పిన ప్రభుత్వం గత వానాకాలంతో పాటు యాసంగి పంట కాలాల్లోనూ పంటల బీమా ఊసేలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇప్పటి వరకు పంటల బీమాపై విధివిధానాలను ఖరారు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వ్యవసాయ శాఖకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఈ సీజన్‌లో కూడా పథకం అమలయ్యే అవకాశాలు కానరావడంలేదు.

కొలిక్కిరాని బీమా పథకం..

వ్యవసాయ శాఖ అధికారులు పంట బీమా అమలుపై పలుసార్లు సమావేశమైనా విధి విధానాలు ఖరారు చేయడం వరకే జరిగింది. ప్రీమియం చెల్లింపు విషయంలో జాప్యం జరుగుతోంది. బీమా కంపెనీలు ప్రీమియం విషయంలో తగ్గడం లేదని, తాము సూచించిన ప్రకారం చెల్లిస్తే బీమా వర్తిస్తుందని తేల్చి చెబుతున్నారు. తక్కువగా చెల్లిస్తే తాము విధించే షరతులకు పంట నష్టం జరిగిన రైతులందరికి ఇవ్వలేమని స్పష్టం చేశారు. తమ ప్రతిపాదనల ప్రకారం ముందుకు వెళ్లితే నష్టం జరిగిన రైతులను ఆదుకోవచ్చని సలహాలు ఇచ్చినట్లు సమాచారం. ఇక ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవడమే తరువాయి. ఇటీవల అధికారులు పంట నష్టం ఆధారంగా రాష్ట్రాన్ని 11 క్లస్టర్లుగా విభజించారు. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకం మార్గదర్శకాల ప్రకారంగా వానాకాలానికి మొత్తం ప్రీమియంలో రైతు వాటా 2 శాతం, యాసంగి పంటకాలంలో 1.5 శాతం, వాణిజ్య, ఉద్యానపంటలకు 5 శాతం ప్రీమియం ఉంటుందని, మిగిలిన ప్రీమియంలో రాష్ట్ర, కేంద్రప్రభుత్వం 50:50 భరించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. మొత్తం స్థూల పంట విస్తీర్ణంలోని 98 శాతం విస్తీర్ణానికి భీమా వర్తిస్తుంది.

విధివిధానాలు ఖరారు..

దిగుబడి ఆధారిత బీమా పథకం కింద వరి, మొక్కజొన్న, కంది, మినుము, సోయాబిన్, వేరుశనగ, శనగ, నువ్వులు వాతావరణ ఆధారిత బీమా పథకం కింద పత్తి, మిరప, మామిడి, ఆయిల్ పామ్, టమాట, బత్తాయి పంటలకు బీమా వర్తింపచేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఎండాకాలంలో వడగళ్ల వర్షం వలన నష్టపోయే వరి, మామిడి వంటి ప్రధాన పంటలకు పూర్తి స్థాయి నష్ట పరిహారాన్ని అందించే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. టెక్నాలజీ ఆధారంగా పంటల దిగుబడి అంచనాలను రూపొందించడం, నష్టపోయిన పంటల విషయంలో బీమా కంపెనీలు సత్వరమే క్లెయిమ్ చేసేందుకు గల విధివిధానాలను రూపొందించారు. అన్ని రకాల ప్రధాన పంటలకు బీమా ప్రీమియం అంచనా వేసేందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి చెప్పారు.

Next Story