రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-26 03:16:49  IST  )

బంగాళాఖాతం (Bay Of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా రూపాంతరం చెందింది.

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర, మధ్య బంగాళాఖాతం (Bay of Bengal)లో కేంద్రీకృతమైన అల్పపీడనం కారణంగా హైదరాబాద్ (Hyderabad) నగరంతో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 12 నుంచి 20 సెం.మీ. మధ్య వర్షపాతం నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇక హైదరాబాద్ మహా నగరంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. తెల్లవారుజాము నుంచి ముసురు జోరు మరింత పెరిగింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. పలుచోట్ల ప్రధాన రహదారులు కాలువలను తలపిస్తున్నాయి. మరోవైపు నాన్‌స్టాప్ రెయిన్ కారణంగా వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

ఆరు జోన్లకు భారీ వర్ష సూచన

భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మొత్తం ఆరు జోన్లలో ఇవాళ భారీ వర్ష సూచన ఉన్నట్లుగా ప్రకటించారు. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి జోన్లలో రికార్డు స్థాయిలో భారీ వర్షంపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు..

రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు కీలక సూచనలు చేశారు. అధికారులు నిరతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని కలెక్టర్లకు సూచించారు. అవసరం అయితే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలను తరలించాలన్నారు. అన్ని కాజ్‌వేలను పరిశీలించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా విద్యుత్ శాఖ మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. వేలాడుతున్న కరెంట్ వైర్లను సరిచేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో యంత్రాంగం అలర్ట్‌గా ఉండాలని, ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

ఆ 15 జిల్లాల్లో అతి భారీ వర్షాలు..

అల్పపీడన ప్రభావం కారణంగా రాష్ట్రంలోని మొత్తం 15 జిల్లాలో నేడు అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలకు అధికారులు ‘ఆరెంజ్‌’ అలర్ట్ జారీ చేశారు.

Next Story