- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫెస్టివల్ రష్.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీగా రద్దీ
మామూలుగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విపరీతమైన ప్రయాణికుల రద్దీ ఉంటుంది. ఇక దసరా, దీపావళి పండుగల సమయంలో ఊహించని స్థాయిలో ప్రయాణికుల సందడి నెలకొంటుంది.

- స్టేషన్ అప్ గ్రేడేషన్ నేపథ్యంలో ట్రాఫిక్ కంట్రోల్ పై ప్రత్యేక దృష్టి
- ప్లాట్ఫామ్ 10 ద్వారా ప్రయాణాలు చేయాలంటున్న అధికారులు
దిశ తెలంగాణ బ్యూరో: మామూలుగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విపరీతమైన ప్రయాణికుల రద్దీ ఉంటుంది. ఇక దసరా, దీపావళి పండుగల సమయంలో ఊహించని స్థాయిలో ప్రయాణికుల సందడి నెలకొంటుంది. అయితే తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను రూ. 700 కోట్లతో ఆధునికీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడి నుంచి అనేక రైళ్లను చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి, మల్కాజ్ గిరి, ఉందానగర్ తదితర స్టేషన్లకు తరలించారు. రైళ్ల సంఖ్యను తగ్గించినా కూడా ఈ స్టేషన్లో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్న నేపథ్యంలో ఇంకా రైళ్లను మళ్లించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. దసరా, దీపావళి సందర్భంగా నగరం నుంచి వివిధ ప్రాంతాలకు నడిపే ప్రత్యేక రైళ్లను సైతం సికింద్రాబాద్ నుంచి కాకుండా ఇతర స్టేషన్ల నుంచి నడిపేందుకు కసరత్తు చేస్తున్నారు. సికింద్రాబాద్‌లో పునరాభివృద్ధి పనుల దృష్ట్యా టెర్మినల్ భవనాల ప్రధాన విభాగాలు, ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనిచేయవు. ఈ స్టేషన్‌లో ప్రయాణీకుల రద్దీని తగ్గించడానికి, రద్దీని నియంత్రించడానికి దక్షిణ మధ్య రైల్వే సమగ్ర ప్రణాళికను ప్రారంభించింది
సికింద్రాబాద్ స్టేషన్ లో భారీ రద్దీ..
సికింద్రాబాద్ స్టేషన్‌లో సాధారణ రోజుల్లో రోజుకు 1.3 లక్షల మంది ప్రయాణికులు.. పండుగ రోజుల్లో రోజుకు 2 లక్షలకు పైగా ప్రయాణికులు వస్తుంటారు. స్టేషన్ లోపల ప్రయాణీకుల రద్దీని తగ్గించేందుకు ఓ అధ్యయనం చేశారు. సాధారణంగా ఈ స్టేషన్ లో ప్లాట్ఫారం-1 ద్వారా ప్రయాణీకులు ఎంటర్, ఎగ్జిట్ అవుతారు. రిజర్వేషన్ లేని ప్రయాణీకులలో దాదాపు 80-90 శాతం మంది ఈ మార్గం ద్వారానే వచ్చి పోతుంటారు. ప్లాట్ ఫారం 10 వైపు స్టేషన్‌తో పోలిస్తే ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు, హోటళ్లతో కళకళలాడుతుంటుంది. ఉదయం 5.00-8.00 గంటలు, సాయంత్రం 21.00-23.00 గంటల రద్దీ సమయాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల ప్లాట్‌ఫామ్ మెట్ల ద్వారా గంటకు 10,000 కంటే ఎక్కువ మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. ఇది అత్యంత రద్దీ సమయంగా పరిగణించబడుతుంది.
సికింద్రాబాద్ స్టేషన్ లోపల రద్దీని తగ్గించేందుకు..
సికింద్రాబాద్ స్టేషన్ రాకుండా కొన్ని రైళ్ల మళ్లింపునకు అధికారులు నిర్ణయించారు. రద్దీ సమయాల్లో కొన్ని రైళ్లను సనత్‌నగర్-అమ్ముగూడ-మౌలాలీ-చర్లపల్లి మీదుగా మళ్లించడం, చర్లపల్లి వంటి శాటిలైట్ స్టేషన్లలో అదనపు హాల్ట్‌లను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పలు రైళ్లను కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి తదితర స్టేషన్లకు తరలించారు. ఇక సికింద్రాబాద్ లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రస్తుతం తాత్కాలికంగా వెయిటింగ్ ఏరియాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్లాట్ ఫారమ్ 1 నుండి సికింద్రాబాద్ (వెస్ట్) మెట్రోకు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక రెగ్యులర్ గా వచ్చే కార్లు, టాక్సీలలో ప్రయాణించే వారు ప్లాట్ ఫారం 1 వైపు కాకుండా ప్లాట్ ఫారం 10 వైపును ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్లాట్ ఫారం 1 వైపు పికప్, డ్రాప్ కోసం పరిమితంగా మాత్రమే వినియోగించుకోవాలని కోరుతున్నారు. ప్లాట్ ఫామ్ 10 వైపు 200 కార్లను ఉంచడానికి కొత్త బేస్‌మెంట్ పార్కింగ్ అందుబాటులో వచ్చిందని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ప్లాట్‌ఫారమ్ నంబర్ 10 వైపు నుండి స్టేషన్‌లోకి ప్రవేశించేటప్పుడు ఫోర్ వీలర్ల కోసం గతంలో అమలు చేసిన 12 నిమిషాల ఎంట్రీ, ఎగ్జిట్ టోల్ గేట్ ఇప్పుడు తీసేశారు. మెరుగైన టికెటింగ్ సౌకర్యం కోసం అదనపు హెల్ప్ డెస్క్‌లు, ఎంక్వైరీ కౌంటర్లు కూడా పనిచేస్తాయి. ప్రయాణికులు ప్లాట్‌ఫామ్ 10 (బోయిగూడ) వైపు ప్రవేశ ద్వారం ఉపయోగించుకునేందుకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది విశాలమైనఅప్రోచ్ రోడ్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, లిఫ్ట్‌లతో సౌకర్యంగా మారింది.






