- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద.. జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు
భారీ వర్షాల కారణంగా తెలంగాణ ప్రాజెక్టులకు వరదనీరు పోటెత్తుతోంది. దీంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణతో పాటు ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ వరదనీటితో నిండుకుండల్లా మారాయి. నాగార్జునసాగర్, శ్రీరామ్ సాగర్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులతో పాటు.. కాళేశ్వరం త్రివేణి సంగమం, భద్రాచలం వద్ద గోదావరికి వరద గంటగంటకూ పెరుగుతోంది. దీంతో అధికారులు ఆయా ప్రాజెక్టుల గేట్లను ఎత్తి వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ కు వరద ప్రవాహం భారీగా రావడంతో 26 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 294.55 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 10 లక్షల క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తుండగా.. 4.06 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
మరోవైపు శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తుండటంతో 39 గేట్లను ఎత్తి 4.03 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలుతున్నారు. ఇన్ ఫ్లో 2.75 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. నిన్న సాయంత్రానికి 1089 అడుగుల వరకూ వరదనీరు చేరింది. ఎస్సారెస్పీ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తడంతో 40 గేట్లను ఎత్తి 5,17,250 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోకి 6,65,170 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. అదేస్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరదనీటి రాకతో సమ్మక్కసాగర్ బ్యారేజీ జలకళను సంతరించుకుంది. బ్యారేజీ పూర్తిస్థాయి నీటిమట్టం 83 మీటర్లు కాగా.. గత రాత్రి వరకూ 82.60 మీటర్లకు చేరినట్లు అధికారులు తెలిపారు.
భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం పెరుగుతుండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదిలో స్నానాలు ఆచరించే భక్తులను ఒడ్డునే ఉండాలని సూచించారు. ప్రస్తుతం నది నీటిమట్టం 43 అడుగులకు చేరుకుంది.






