దడ పుట్టిస్తున్న కోర్టు నెం.21.. హార్ట్ స్ట్రోక్‌తో నలుగురు న్యాయవాదులు మృతి

by Kema Shiva Kumar |

హైకోర్టులో నెం.21 కోర్టు పేరు చేబితే న్యాయవాదులంతా హడలిపోతున్నారు.

దడ పుట్టిస్తున్న కోర్టు నెం.21.. హార్ట్ స్ట్రోక్‌తో నలుగురు న్యాయవాదులు మృతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర హైకోర్టులో ఒక చిత్రమైన ఘటన చోటుచేసుకుంటోంది. హైకోర్టులో నెం.21 కోర్టు పేరు చేబితే న్యాయవాదులు హడలిపోతున్నారు. ఇక్కడ జరుగుతున్న ఆకస్మిక మరణాలు న్యాయవాదులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఆరోగ్యంగా ఉండి అప్పటి వరకు కేసులో వాదించి, తోటి వారితో చలోక్తులు వేసిన వారు ఆకస్మాత్తుగా మరణించడం న్యాయవాదులను కుంగదీస్తున్నది. గత కొంత కాలంగా హైదరాబాద్ లోని తెలంగాణ హైకోర్టులో తలెత్తుతున్న గుండెపోటు మరణాలతో న్యాయవాదులు హడలిపోతున్నారు. ఇక్కడ కొంతమంది ప్రాణాలు వదులుతుంటే, మరికొందరిని అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు తరలించాల్సి వస్తోందని న్యాయవాదులు చెబుతున్నారు. నలుగురు న్యాయవాదులు మరణించడం, మరొకరు ప్రాణాలతో బయటపడటం కలవరానికి గురి చేస్తున్నది. ఇటీవలి కాలంలో న్యాయవాదులు పర్స అనంత నాగేశ్వరరావు, పుసునూరు వేణుగోపాలరావు, బి. వెంకటరమణ, గోవర్దన్ రెడ్డిలు గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. మరో న్యాయవాది ఎన్ కే వీ ని హుటాహుటిన ఆస్పత్రికి సదరు న్యాయవాదులు తరలించడంతో అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడగలిగారు.

నెం.21 కోర్టులో అసలేం జరుగుతోంది?

ఈ కోర్టు దగ్గరే న్యాయవాదులకు గుండెపోటు రావడానికి ప్రధాన కారణాలు ఏమిటని న్యాయకోవిదులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికైనా ఈ బ్లాక్ దగ్గర అత్యవసర వైద్య సేవలు, సీపీఆర్ లో శిక్షణపొందిన నిపుణులను అందబాటులో ఉంచాలని, అంబులెన్సును ఏర్పాటు చేయాలని, న్యాయవాదుల ఆరోగ్య పరిరక్షణకు హైకోర్టు ఉన్నతాధికారులు, బార్ అసోసియేషన్ తగిన చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

- ఆగస్టు 7, వ తేదీ మధ్యాహ్నం 2:20 గంటల ప్రాంతంలో న్యాయవాది పర్స అనంత నాగేశ్వర్ రావు (47) తెలంగాణ హైకోర్టులోని 21వ కోర్టు హల్ లో కుర్చీలో కూర్చుని ఉండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా నాగేశ్వరరావు ప్రాణం విడిచారు.

- ఫిబ్రవరి 18వ తేదీన 21వ కోర్టులో వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది పుసునూరు వేణుగోపాలరావుకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో కోర్టులోనే కుప్పకూలిపోయారు. అక్కడే ఉన్న సదరు న్యాయవాదులు సీపీఆర్ చేస్తూ, అంబులెన్స్ కు సమాచారం అందించి, ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలో వేణుగోపాలరావు తుది శ్వాస విడిచారు.

ఫస్ట్ ఎయిడ్ అందింతే బతికే వారు

న్యాయవాదులు పర్స అనంత నాగేశ్వరరావు, పుసునూరు వేణుగోపాలరావు, గోవర్ధన్ రెడ్డిలకు సకాలంలో ఫస్ట్ ఎయిడ్ అంది ఉంటే వారు బతికేవారని హై కోర్టు న్యాయవాదులు అంటున్నారు. హైకోర్టు డిస్పెన్సరీ సిబ్బంది ఫస్ట్ ఎయిడ్, సీపీఆర్ లో సరైన శిక్షణ లేకపోవడం, నిర్లక్ష్యధోరణి, సేవాలోపంపై న్యాయవాదులు మండిపడుతున్నారు.

Next Story